Greek Drama: సాధారణంగా కోడి కథ అంటే సరదా కథ అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ కోడి జీవితమే మనుషుల జీవితాలతో ముడిపడుతుంది. ఫ్యాక్టరీ ఫామ్ నుంచి తప్పించుకున్న ఓ కోడి ఓ పాత సముద్రతీర రెస్టారెంట్ లోకి చేరుతుంది. అక్కడ తన గుడ్లను కాపాడుకోవడానికి అది చేసే ప్రయత్నం, ఆ ప్రదేశంలో జరుగుతున్న మానవ విషాదంతో కలుస్తుంది. చూస్తే ఓ కోడి ప్రయాణంలా కనిపించినా, లోపల మనుషుల బతుకులు, ఆశలు, బ్రతకడానికి చేసే పోరాటం కనిపిస్తుంది. ఇదే ‘హెన్’ (Hen) మూవీ కథ. మరి ఈ మూవీని తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
కథలో కోళ్ల ఫామ్ నుంచి ఓ కోడి తప్పించుకుంటుంది. బయట ప్రపంచం గురించి పెద్దగా తెలియని ఆ కోడి చివరకు క్షీణించిన ఓ గ్రీక్ సముద్రతీర రెస్టారెంట్ ప్రాంగణంలోకి చేరుతుంది. అక్కడే అది తనకు సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కోడి అక్కడ గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. వాటిని కాపాడుకోవడం దాని ప్రధాన లక్ష్యంగా మారుతుంది. కానీ ఆ ప్రదేశం అంత ప్రశాంతంగా ఉండదు. రెస్టారెంట్ లోని మనుషుల మధ్య సంబంధాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత బాధలు ఒక్కొక్కటిగా బయట పడతాయి.
కోడి మాత్రం వీటన్నింటినీ తనకు సాధ్యమైనంత వరకు గమనిస్తూ ఉంటుంది. దాని దృష్టిలో మనుషులు చేస్తున్న పనులకు వేరే అర్థం ఉంటుంది. ఒకవైపు అది తన గుడ్లను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు అక్కడి మనుషులు తమ జీవితాలను కాపాడుకోవడానికి పోరాడుతుంటారు. ఈ రెండు కథలు క్రమంగా ఒకదానితో ఒకటి కలుస్తాయి. కోడి తన గుడ్లను కోల్పోకుండా ఉండేందుకు చేసే ప్రయత్నం సాధారణ జంతు కథలా కనిపించినా, దాని వెనుక మాతృత్వం, చావుబతుకుల పోరాటం వంటి అంశాలు కనిపిస్తాయి.
రెస్టారెంట్ లోని మనుషుల జీవితాల్లో దాగి ఉన్న విషాదం కథలో మరో లేయర్లా ఉంటుంది. ఒక చిన్న జీవి తన కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మనుషులు తమ సమస్యలతో ఎలా పోరాడుతున్నారో కథలో సమాంతరంగా చూపిస్తారు. సినిమా ముందుకు వెళ్లే కొద్దీ కోడి చుట్టూ జరిగే సంఘటనలు మరింత ఆసక్తికరంగా మారతాయి. ప్రేక్షకుడు మొదట ఊహించిన కథ నెమ్మదిగా ఊహించని మలుపు తిరుగుతుంది. జీవించాలనే కోరిక మనిషికే కాదు, ప్రతి జీవికి ఎంత బలంగా ఉంటుందో చెప్పే డిఫరెంట్ డ్రామా ఇది. మరి చివరికి ఆ కోడి తన గుడ్లను ఎలా కాపాడుకుంది ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అనేది సినిమాలో చూడాల్సిందే.
యానిస్ కొకియాస్మెనోస్ (Yannis Kokiasmenos), మారియా డియాకోపనగియోటు (Maria Diakopanagiotou), అర్గిరిస్ పాంటజరాస్ (Argyris Pantazaras) నటించిన ‘హెన్’కు జ్యోర్జీ పాల్ఫీ (György Pálfi) దర్శకత్వం వహించారు. Amazon Prime Videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది. హిందీ, తమిళం, తెలుగు, గ్రీక్ ఆడియోలు లిస్టెడ్ గా ఉన్నాయి.