Sci Fi Horror Movie OTT : అంగారక గ్రహం మీద మనుషులు నివసించడం మొదలు పెడితే… అక్కడ కూడా భూమి మీద ఉన్నట్టే పోలీస్ స్టేషన్లు, జైళ్లు, మైనింగ్ పనులు ఉంటాయని ఊహించుకోవచ్చు. కానీ అదే గ్రహంలో మనుషులకు తెలియని ఓ పురాతన శక్తి మేల్కొని, అక్కడి వారిని భయంకరమైన హంతకులుగా మార్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? ప్రాణాలతో బయటపడాలంటే పోలీసులతో పాటు ఖైదీలు కూడా కలిసి పోరాడాల్సి వస్తే ? ఇలాంటి భయానకమైన సైన్స్ ఫిక్షన్ కథతో వచ్చిన సినిమానే ‘John Carpenter’s Ghosts of Mars’. హారర్, యాక్షన్ కు సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే…
ఈ సినిమా కథ భవిష్యత్తులో సాగుతుంది. అప్పటికి మానవులు అంగారక గ్రహం మీదకు చేరుకుని అక్కడ మైనింగ్ పనులు చేపడతారు. భూమి మీద లభించే వనరుల కోసం మాత్రమే కాకుండా, అంగారక గ్రహంలోని ఖనిజ సంపదను ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ కొన్ని ప్రాంతాల్లో మనుషులు నివసించడం మొదలుపెడతారు. అయితే ఆ గ్రహం మీద మానవులకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి.
అంగారక గ్రహంలోని ఓ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు బృందానికి కీలకమైన బాధ్యత అప్పగిస్తారు. ప్రమాదకరమైన నేరస్థుడైన జేమ్స్ విలియమ్స్ ను అదుపులోకి తీసుకుని తిరిగి తీసుకురావాలి. ఈ ఆపరేషన్ కు లెఫ్టినెంట్ మెలనీ బాలార్డ్ నాయకత్వం వహిస్తుంది. ఆమెతో పాటు మరికొందరు పోలీసులు ప్రయాణం మొదలుపెడతారు. మరోవైపు, జేమ్స్ విలియమ్స్ సాధారణమైన నేరస్థుడు కాదు. అతడిని పట్టుకోవడం అంత సులభం కాదని పోలీసులకు తెలుసు.
అయితే వారు చేరుకున్న ప్రాంతంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతాయి. అక్కడి ప్రజలు వింతగా ప్రవర్తిస్తుంటారు. కొందరు అదుపు తప్పి ఇతరులపై దాడులకు దిగుతారు. మొదట ఈ పరిణామాల వెనుక ఏదైనా మానవ తప్పిదం ఉందని భావించిన పోలీసులకు, అసలు ప్రమాదం తమ ఊహలకు అందనంత పెద్దదని క్రమంగా అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో పురాతన అంగారక జీవుల ఆత్మలకు సంబంధించిన ఓ భయంకరమైన రహస్యం బయటపడుతుంది. ఆ శక్తులు మనుషుల శరీరాలను ఆక్రమించి వారిని క్రూరంగా మారుస్తుంటాయి.
ఇప్పుడు పోలీసుల ముందున్న సమస్య నేరస్థుడిని పట్టుకోవడం మాత్రమే కాదు. తమ ప్రాణాలను కాపాడుకుంటూ అక్కడి నుంచి బయటపడటం కూడా. పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారడంతో పోలీసులకు, ఖైదీలకు మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. శత్రువు ఎవరు ? ఎవరిని నమ్మాలి ? ఈ భయంకరమైన శక్తిని ఎలా ఎదుర్కోవాలి ? మెలనీ బాలార్డ్ బృందం ఆ రహస్యాన్ని ఛేదించగలదా ? అంగారక గ్రహం మీద మానవుల మనుగడకు ఎదురైన ఈ ముప్పు నుంచి బయటపడగలరా ? అనేదే మిగతా కథ.
Also Read : వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్
ఇది 2001లో విడుదలైన హారర్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా. జాన్ కార్పెంటర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటాషా హెన్‌స్ట్రిడ్జ్, ఐస్ క్యూబ్, జేసన్ స్టాథమ్, క్లియా డువాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అంగారక గ్రహం నేపథ్యంలో సాగే భయానక కథలు, వింత జీవులు, నిరంతర పోరాటాలతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా ప్రస్తుతం భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో లేదు.