Korean Comedy Drama: ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన స్టార్స్… కాలం మారడంతో ఒక్కసారిగా అందరి జ్ఞాపకాల నుంచి మాయమైపోతే ఎలా ఉంటుంది ? మళ్లీ అదే స్టేజ్‌పై నిలబడి తమను తాము నిరూపించుకోవాలని ప్రయత్నిస్తే ? అలాంటి ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన కొరియన్ మ్యూజికల్ కామెడీ డ్రామానే ‘వైల్డ్ సింగ్’ (wild sing). ఒకప్పుడు సూపర్‌హిట్ పాప్ గ్రూప్‌గా వెలుగొందిన ముగ్గురు కళాకారులు, 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి తమ కలను నెరవేర్చుకునేందుకు చేసే ప్రయత్నాలే ఈ సినిమా ప్రధాన కథ. నవ్వులు, ఎమోషన్స్, సంగీతం, స్నేహం, రెండో అవకాశం… అన్నింటినీ కలిపి ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం పదండి.
2000వ దశకం ప్రారంభంలో ‘ట్రయాంగిల్’ అనే పాప్ గ్రూప్ దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానాన్ని సంపాదిస్తుంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ టీమ్ పాటలు, డ్యాన్స్ ప్రదర్శనలతో యువతను ఊపేస్తుంది. అయితే అనుకోకుండా జరిగిన ఒక పెద్ద వివాదం వారి కెరీర్‌ను ఒక్క రాత్రిలోనే కూలదోస్తుంది. దాంతో ముగ్గురూ విడిపోతారు. ఒక్కొక్కరు ఒక్కో దారి పట్టి, సంగీతానికి దూరమైన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఒకప్పుడు తమను అభిమానించిన ప్రేక్షకులు ఇప్పుడు కొత్త తరం గాయకుల వెంటపడుతుంటారు. ఇలాంటి సమయంలో మళ్లీ స్టేజ్‌పైకి రావాలని ఆ ముగ్గురు నిర్ణయించుకుంటారు. కానీ అంత ఈజీగా తిరిగి గుర్తింపు దక్కదు. వయసు పెరగడం, కొత్త మ్యూజిక్ ట్రెండ్స్, సోషల్ మీడియా ప్రభావం… ఇలా ప్రతి అడుగులోనూ కొత్త సవాళ్లు ఎదురవుతాయి.
మళ్లీ పాత కెమిస్ట్రీని తెచ్చుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు నవ్వులు పంచుతాయి. రిహార్సల్స్‌లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు, ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి. అయితే ఈ ప్రయాణం కేవలం సంగీతం గురించే కాదు. కొన్నాళ్ల క్రితం విరిగిపోయిన స్నేహాన్ని మళ్లీ కలపడం, కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం, జీవితంలో మరో అవకాశం కోసం పోరాడడం గురించీ ఈ సినిమాలో ఉంటుంది.
ఆ ముగ్గురూ మళ్లీ పాత స్థాయిలో విజయం సాధించారా? గతంలో జరిగిన ఆ స్కాండల్ అసలు ఏమిటి? ప్రేక్షకులు మరోసారి వారిని అంగీకరించారా? లేక కాలంతో పాటు వారి కల కూడా ముగిసిపోయిందా? అనే ప్రశ్నలకు సమాధానాలను సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
‘వైల్డ్ సింగ్’ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. గ్యాంగ్ డాంగ్-వాన్, ఉమ్ తే-గూ, పార్క్ జి-హ్యున్, ఓ జంగ్-సే ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు సన్ జే-గోన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి లీ జిన్-హీ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాత కే-పాప్ కాలాన్ని గుర్తు చేసే పాటలు, డ్యాన్స్‌లు సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. కేవలం కామెడీ మాత్రమే కాదు, స్నేహం, కలలు, రెండో అవకాశం, జీవితంపై ఆశ వంటి భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చెప్పిన మంచి మ్యూజికల్ డ్రామా ‘వైల్డ్ సింగ్’. నవ్విస్తూనే కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టించే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు మంచి అనుభూతిని అందిస్తుంది. ఫీల్ గుడ్ సినిమాలు, సంగీతం, ఎమోషనల్ కామెడీలు ఇష్టపడే వారికి ఈ సినిమా వర్త్ వాచింగ్ అన్పిస్తుంది. కానీ ఓటీటీలో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు.
Read Also: విద్యార్థులను రాక్షసులుగా మార్చే శాపం… నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ సిరీస్ చూశారా?