Malayalam Crime Thriller: హత్య కేసులో నిందితులు పోలీసులకు దొరకకుండా తిరుగుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి “నేనే ఒకరిని చంపాను” అంటూ లొంగిపోతుంది. అంతేకాదు… తాను ఎవరిని హత్య చేసిందో, శవాన్ని ఎక్కడ పాతి పెట్టిందో కేవలం ఒకే ఒక్క పోలీసు అధికారికి మాత్రమే చెబుతానని షరతు పెడుతుంది. అసలు ఆమె అలా ఎందుకు చేసింది? ఆమె నిజంగానే హత్య చేసిందా? అనే ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘Ini Utharam’.
ఉత్కంఠతో పాటు భావోద్వేగాలను కూడా మేళవించిన ఈ సినిమా మొదటి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ప్రతి 5 నిమిషాలకో కొత్త అనుమానం, కొత్త మలుపు రావడం ఈ చిత్రానికి ప్రధాన బలం. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
జానకి అనే వైద్యురాలు ఒకరోజు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను హత్య చేశానని ఒప్పుకుంటుంది. అయితే విచారణ మొదలుపెట్టిన పోలీసులకు ఆమె ఎలాంటి వివరాలు చెప్పదు. కేవలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కరుణన్ వస్తే మాత్రమే నిజం చెబుతానని అంటుంది. మీడియా, ప్రజల ఒత్తిడి పెరగడంతో పోలీసులు కరుణన్‌ను అక్కడికి పిలుస్తారు. అతను వచ్చిన తర్వాత జానకి శవాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్తానని చెబుతుంది. పోలీసులు, మీడియా, స్థానికుల సమక్షంలో అందరూ అడవిలోని ఒక ప్రాంతానికి చేరుకుంటారు.
జానకి చెప్పిన చోట పోలీసులు తవ్వడం ప్రారంభిస్తారు. అయితే అదే సమయంలో ఆమె మరో సంచలన ఆరోపణ చేస్తుంది. ఈ శవాన్ని పాతిపెట్టడంలో కరుణన్ కూడా తనకు సహాయం చేశాడని చెబుతుంది. ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్‌కు గురవుతారు. కరుణన్ మాత్రం ఆమె మాటలను పూర్తిగా ఖండిస్తాడు. కొద్దిసేపటి తర్వాత తవ్వకాల్లో ఒకటి కాదు… రెండు మృతదేహాలు బయటపడతాయి. వాటిలో ఒకటి జానకికి అత్యంత సన్నిహితుడైన అశ్విన్‌ది కాగా, మరొకటి కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన యువకుడిదని తెలుస్తుంది. దీంతో కేసు పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది.
ఇక అసలు విచారణ అక్కడి నుంచే మొదలవుతుంది. జానకి నిజంగానే హత్య చేసిందా? ఆమె ఎందుకు నేరాన్ని తనపై వేసుకుంది? కరుణన్‌కు ఈ కేసుతో సంబంధం ఏమిటి? అశ్విన్ మరణం వెనుక దాగి ఉన్న నిజం ఏంటి? ఒక్కొక్కటిగా బయటపడే ఆధారాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి. చివరికి జానకి చెప్పిన కథ నిజమా? లేక ఆమె వెనుక ఇంకేదైనా పెద్ద ప్లాన్ ఉందా? అసలు హంతకుడు ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
‘Ini Utharam’ చిత్రంలో అపర్ణ బాలమురళి, కళాభవన్ షాజాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు ఆడియోతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. చివరి వరకు ఏం జరుగుతుందో ఊహించలేని క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి ఆప్షన్. ప్రతి మలుపు కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తూ, చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే చిత్రం ఇది.
Read Also: ఏం థ్రిల్లర్ రా అయ్యా… ఈ పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటే చస్తారు