Horror Comedy Movie: ఒక సీరియల్ కిల్లర్ చేతిలో దారుణంగా దాడికి గురైన అమ్మాయి ప్రాణాలతో బయటపడుతుంది. కానీ ఉదయం లేచేసరికి ఆమె తన శరీరంలో ఉండదు. ఏకంగా ఓ భయంకరమైన కిల్లర్ బాడీలో చిక్కుకుపోతుంది. మరి అదే సమయంలో ఆ కిల్లర్ ఓ టీనేజ్ అమ్మాయి రూపంలో తిరుగుతూ ఉంటే ? పోలీసులకు అసలు హంతకుడు ఎవరో గుర్తించడం ఎలా ? పైగా ఈ మార్పు కేవలం 24 గంటల్లో తిరిగి సరిచేయాలి. లేదంటే జీవితాంతం అదే శరీరంలో ఉండాల్సి వస్తే ? హారర్, కామెడీ రెండింటినీ కలిపి ఇలాంటి వింత కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే Freaky. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడాలి ? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం పదండి.
బ్లిస్‌ఫీల్డ్ పట్టణంలో ‘ది బుట్చర్’ అనే సైకో కిల్లర్ వరుస హత్యలతో భయపెడుతుంటాడు. ఓ రోజు కొంతమంది టీనేజర్లను చంపిన తర్వాత అతడి చేతికి ఓ పురాతన ఖడ్గం దొరుకుతుంది. ‘లా డోలా’ అనే ఆ ఖడ్గానికి మంత్రశక్తి ఉందని అతడికి తెలియదు. అదే రాత్రి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న మిల్లీ కాస్లర్ ను అతడు టార్గెట్ చేస్తాడు. ఖడ్గంతో ఆమె గుండెల్లో పొడిచేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ అక్కడే ఊహించని పరిణామం జరుగుతుంది. ఖడ్గంలోని శక్తి కారణంగా మిల్లీ చనిపోదు. మరుసటి ఉదయం కళ్లు తెరిచేసరికి మాత్రం ఆమె ఆత్మ బుట్చర్ శరీరంలోకి వెళ్లిపోతుంది.
కిల్లర్ ఆత్మ మిల్లీ శరీరాన్ని ఆక్రమిస్తుంది. దీంతో అసలు కిల్లర్ టీనేజ్ అమ్మాయి రూపంలో స్కూల్ కు వెళ్తుండగా… మిల్లీ మాత్రం ఆరడుగుల సైకో కిల్లర్ శరీరంలో చిక్కుకుపోతుంది. తనను ఎవరూ నమ్మని పరిస్థితిలో మిల్లీ తన స్నేహితులు నైలా, జోషువాలను కలిసి తానేనని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరకు వాళ్లు ఆమె మాట నమ్మడంతో ఈ బాడీ స్వాప్ వెనుక ఉన్న రహస్యం బయట పడుతుంది. అయితే సమస్య అక్కడితో ఎండ్ కాదు.
మిల్లీకి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఆ లోపే అదే ఖడ్గాన్ని ఉపయోగించి కిల్లర్ ను పొడిస్తేనే ఇద్దరి శరీరాలు మళ్లీ మారతాయి. లేదంటే ఈ మార్పు శాశ్వతమైపోతుంది. ఇదిలా ఉంటే మిల్లీ రూపంలో ఉన్న కిల్లర్ స్కూల్ లో తన వేట కొనసాగిస్తుంటాడు. హోమ్ కమింగ్ డాన్స్ లో పెద్ద హత్యాకాండకు కూడా ప్లాన్ చేస్తాడు. దీంతో మిల్లీ తన స్నేహితులు, తన క్రష్ బుకర్ సాయంతో అతడిని ఆపేందుకు బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? మిల్లీ తన శరీరాన్ని తిరిగి దక్కించుకుందా ? కిల్లర్ ఆటను ఎలా ఆపింది ? అనేదే మిగతా కథ.
2020లో వచ్చిన ఈ హారర్-కామెడీ స్లాషర్ మూవీలో కాథరిన్ న్యూటన్, విన్స్ వాఘన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో ఆడియో లేదు. ఇంగ్లీష్ ఆడియోతో సబ్‌టైటిల్స్ ద్వారా చూడాలి. హారర్ కు కామెడీని జోడించిన సినిమాలు, బాడీ స్వాప్ కాన్సెప్ట్, స్లాషర్ మూవీస్ నచ్చేవారికి ఈ సినిమా ఓ మంచి టైమ్‌పాస్ మూవీ.
Read Also: రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి