Historical Action Drama: బ్రిటీష్ పాలనను ఎదుర్కొనేందుకు తుపాకులు చేతబట్టి పోరాడిన యువకుల కథ ఇది. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని విప్లవకారులు ఎవరు ? బ్రిటీష్ సామ్రాజ్యానికి చెమటలు పట్టించిన ఆ రహస్య ఆపరేషన్లు ఎలా జరిగాయి ? రాష్ బిహారీ బోస్, బాఘా జతిన్ లాంటి వీరుల పోరాటం వెనుక ఉన్న అసలు కథేంటి ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా వచ్చిన పీరియడ్ యాక్షన్ డ్రామానే ‘ది రెవల్యూషనరీస్’ (The Revolutionaries). మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలియాలంటే ముందు కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
కథ 1912లో బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశంలో మొదలవుతుంది. 1857 తిరుగుబాటు విఫలమైనా… స్వాతంత్ర్యం కోసం పోరాటం మాత్రం ఆగిపోలేదు. అహింసా మార్గానికి భిన్నంగా ఆయుధాలతోనే బ్రిటీష్ రాజ్‌ను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్న కొందరు యువ విప్లవకారులు రహస్యంగా తమ నెట్‌వర్క్ ను విస్తరిస్తుంటారు. ఈ క్రమంలో వైస్రాయ్ పై జరిగిన హత్యాయత్నం బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ పోరాటానికి వ్యూహాలు రచించే రాష్ బిహారీ బోస్ గా భువన్ బామ్ కనిపిస్తారు. కుటుంబ నేపథ్యం నుంచి బయటకు వచ్చి విప్లవ బాట పట్టే యువకుడు సచింద్ర నాథ్ సన్యాల్ గా రోహిత్ సరాఫ్ నటించారు.
బ్రిటీష్ పాలనను కూల్చేందుకు పెద్ద ప్రణాళికతో రంగంలోకి దిగే బాఘా జతిన్ పాత్రలో గుర్ఫతే పిర్జాదా కనిపిస్తారు. విప్లవకారులకు అండగా నిలిచే ప్రతిభా లాహిరిగా ప్రతిభా రంతా నటించారు. వీరి కదలికలను పసిగట్టేందుకు బ్రిటీష్ అధికారులు డయ్యర్, టెగార్ట్‌లను రంగంలోకి దింపుతారు. బెనారస్, కలకత్తా ప్రాంతాల్లోని రహస్య సేఫ్ హౌస్ ల నుంచి విప్లవకారులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. పోలీసుల నిఘా పెరుగుతున్నా… వెనక్కి తగ్గకుండా మరింత పెద్ద దాడికి సిద్ధమవుతారు.
బాఘా జతిన్ నేతృత్వంలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కుదిపేసే భారీ దోపిడీకి ప్లాన్ చేస్తారు. ఈ పోరాటంలో గదర్ పార్టీ నాయకుడు లాలా హరదయాళ్, యువ విప్లవకారుడు కర్తార్ సింగ్ శరభ కూడా భాగమవుతారు. బ్రిటీష్ సైన్యం వేసే ఉచ్చులను తప్పించుకుంటూ ఈ యువకులు సాగించే పోరాటం ఎక్కడికి దారి తీస్తుంది ? వారి త్యాగాలు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నదే సీజన్ లో చూడాల్సిన ప్రధాన కథ.
ప్రముఖ దర్శకుడు నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన సిరీస్ ‘ది రెవల్యూషనరీస్’. సంజీవ్ సన్యాల్ రాసిన Revolutionaries: The Other Story of How India Won Its Freedom పుస్తకం ఆధారంగా రూపొందింది. మొత్తం 5 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ Amazon Prime Videoలో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. పీరియడ్ యాక్షన్, హిస్టారికల్ డ్రామా, స్వాతంత్ర్య సమర కథలు ఇష్టమైతే ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వొద్దు.
Read Also: జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్