Malayalam Comedy Drama Series: సినిమాల్లో హీరో కావాలని కలలు కనే కుర్రాడికి తండ్రే అడ్డుగా నిలిస్తే ఎలా ఉంటుంది ? పైగా కొడుకు సినిమా కలను చెడగొట్టేందుకు తండ్రే స్వయంగా సినిమా తీస్తే ? ఆ సినిమా కావాలనే ఫ్లాప్ చేయాలన్న ప్లాన్ అయితే ? హీరో అవ్వాలనే పట్టుదల, తండ్రి పెట్టే షరతులు, స్నేహితుల గోలతో ఈ కథ ఎక్కడికి వెళ్తుంది ? చివరికి ఫిరోజ్ తన కలను నెరవేర్చుకున్నాడా లేదా అనేది తెలుసుకోవాలంటే కామెడీ-డ్రామా సిరీస్ Prince Of Mollywoodను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.
ఫిరోజ్ కి చిన్నప్పటి నుంచే సినిమా అంటే పిచ్చి. ఎప్పటికైనా పెద్ద హీరోగా ఎదిగి, ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకోవాలన్నది అతని జీవిత లక్ష్యం. ఆ కల కోసం కుటుంబ వ్యాపారాన్ని పట్టించుకోకుండా ఆల్బమ్ సాంగ్స్ లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాడు. కానీ అతని తండ్రి మమ్మాలికి మాత్రం కొడుకు ఆలోచనలు ఏమాత్రం నచ్చవు. కోట్లకు అధిపతిగా ఉన్న అతను ఫిరోజ్ కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవాలని కోరుకుంటాడు. అంతేకాదు, తన స్నేహితుడి కుమార్తెను పెళ్లి చేసుకోవాలని కూడా షరతు పెడతాడు.
ఫిరోజ్ మాత్రం తండ్రి మాట వినకుండా సినిమాల్లోనే తన భవిష్యత్తును వెతుక్కుంటాడు. దీంతో కొడుకును ఎలాగైనా సినిమా మోజు నుంచి బయటకు తీసుకురావాలని మమ్మాలి ఒక విచిత్రమైన ప్లాన్ వేస్తాడు. తానే నిర్మాతగా మారి ఒక సినిమా నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయితే, సినిమాలపై ఫిరోజ్ కు ఉన్న నమ్మకం పోయి తిరిగి బిజినెస్ లోకి వస్తాడనేది అతని ప్లాన్.
అయితే తండ్రి వేసిన ఎత్తుకు ఫిరోజ్ మరో ఎత్తు వేస్తాడు. తన స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్ సల్మా సహాయంతో అదే సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి అసలు కామెడీ మొదలవుతుంది. ఫిరోజ్ వేసే ప్లాన్లను అతని స్నేహితులు ఎలా తారుమారు చేస్తారు ? సినిమా ప్రపంచంలో అడుగు పెట్టేందుకు అతను పడే పాట్లు ఏంటి ? తండ్రి సినిమా ఫ్లాప్ చేయాలనుకుంటే, కొడుకు మాత్రం దాన్ని తన కెరీర్‌కు మెట్టుగా మార్చుకోవాలని చూస్తాడు. చివరికి తండ్రి ప్లాన్ గెలిచిందా ? లేక ఫిరోజ్ తన కలను సాధించి ‘ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్’గా నిలిచాడా ? అన్నదే సిరీస్‌లో చూడాల్సిన ఆసక్తికరమైన అంశం.
‘ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్’ సెప్టెంబర్ 11 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సిరీస్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం నాలుగు కొత్త ఎపిసోడ్లు విడుదల కానున్నాయి. షాని ఖాదర్ రచించి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను పిక్సెల్ ప్లేగ్రౌండ్ నిర్మించింది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా టార్గెట్ చేసే క్లీన్ కామెడీ-డ్రామా కావడంతో లైట్ గా ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్.
Read Also: పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా