Korean Action Horror Thriller: ఒక బిల్డింగ్ లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ప్రమాదకరమైన వైరస్ బారిన పడితే ఏం జరుగుతుంది ? బయటకు వెళ్లే దారి లేదు… లోపలే ఉండి ప్రాణాలు కాపాడుకోవాలి. కానీ వైరస్ సోకిన వాళ్లు మనుషుల్లా కాకుండా ఓ సమూహంలా కలిసి పని చేస్తే ? వాళ్ల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అసలు ఈ వైరస్ ఎలా వచ్చింది ? దానికి విరుగుడు ఎవరి దగ్గర ఉంది ? ఇలాంటి ప్రశ్నలతో ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సౌత్ కొరియన్ యాక్షన్ హారర్ థ్రిల్లర్ Colony. మరి ఈ స్పైన్ చిల్లింగ్ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
సియోల్ లోని ఓ భారీ హై-రైజ్ బిల్డింగ్ లో బయోటెక్ కాన్ఫరెన్స్ జరుగుతుంటుంది. ప్రొఫెసర్ క్వోన్ సె-జియాంగ్ కూడా అక్కడికి వస్తుంది. అంతా సవ్యంగానే సాగుతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఓ ప్రమాదకరమైన వైరస్ బయట పడుతుంది. చూస్తుండగానే కొందరికి ఇన్ఫెక్షన్ సోకుతుంది. వాళ్లలో శారీరకంగా భయంకరమైన మార్పులు మొదలవుతాయి. ఇక్కడితో సమస్య ఆగదు. వైరస్ సోకిన వాళ్లు విడివిడిగా కాకుండా ఒకే సమూహంలా ప్రవర్తించడం మొదలు పెడతారు. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం ఆ బిల్డింగ్ ను పూర్తిగా మూసివేస్తుంది.
వైరస్ బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో లోపల ఉన్నవాళ్లను అక్కడే వదిలేస్తారు. దీంతో బయట సహాయం కోసం ఎదురుచూసే అవకాశం కూడా ఉండదు. బతికి ఉన్నవాళ్లు తమకు అందుబాటులో ఉన్న మార్గాల్లోనే ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ చోయి హ్యున్-సియోక్ కు మాత్రం మరో పెద్ద సమస్య ఉంటుంది. పక్షవాతంతో బాధపడుతున్న తన సోదరి హ్యున్-హీని కూడా సురక్షితంగా ఉంచాలి. అందుకే అతడు ఎంత ప్రమాదమైనా ఎదుర్కొంటూ ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు.
ఇదిలా ఉండగా వైరస్ కు సంబంధించిన అసలు నిజం బయట పడుతుంది. ఈ విపత్తుకు కారణమైన బయాలజిస్ట్ సియో యంగ్-చోల్ కూడా అదే బిల్డింగ్‌లో చిక్కుకున్నాడని తెలుస్తుంది. అతడి దగ్గర వైరస్‌కు సంబంధించిన కీలక సమాచారం మాత్రమే కాదు.. వ్యాక్సిన్ కూడా ఉండొచ్చని తెలుస్తుంది. దీంతో ప్రాణాలతో బయటపడిన వాళ్లకు అతడే ఆశగా మారతాడు. ఒకవైపు ఇన్ఫెక్ట్ అయిన జీవుల నుంచి తప్పించుకోవాలి. మరోవైపు ఆ బయాలజిస్ట్ ను చేరుకోవాలి. ఈ రెండు లక్ష్యాల మధ్య జరిగే పోరాటమే కథను చివరి వరకు నడిపిస్తుంది. చివరకు వ్యాక్సిన్ దొరికిందా ? ఈ భవనం నుంచి ఎవరు బయటపడ్డారు ? వైరస్ బయట ప్రపంచానికి చేరిందా ? అనేది సినిమాలో చూడాల్సిందే.
2026లో వచ్చిన ఈ కొరియన్ యాక్షన్ హారర్ థ్రిల్లర్ కు Yeon Sang-ho దర్శకత్వం వహించారు. ప్రస్తుతం భారత్ లో Amazon Prime Videoలో తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ తో ఈ సినిమా అందుబాటులో లేదు. అలాగే Apple TV, YouTube వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రెంట్ లేదా కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైరస్ హారర్, సర్వైవల్ థ్రిల్లర్లు, బిల్డింగ్ లో చిక్కుకుపోయే కథతో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఆసక్తికరంగా ఉంటుంది.
Read Also: పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్ థ్రిల్లర్ ను డోంట్ మిస్