Tamil Political Crime Drama: ఒక జిల్లా కలెక్టర్ గా ప్రజల కోసం పోరాడే అధికారిణి… అవినీతిపరులపై చర్యలు తీసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న నాయకురాలు… కానీ ఆమె గతం మాత్రం ఎవరికీ తెలియదు. అధికారంలోకి రావాలన్న కోరిక కోసం ఎంత దూరమైనా వెళ్లే మహిళగా ఆమె అసలు రూపం బయటపడితే ? రాజకీయ నాయకులను ఒక్కొక్కరిగా తన ఆటలోకి లాగుతూ ఆమె వేసే పథకం ఏంటి ? అపర్ణతి ప్రధాన పాత్రలో నటించిన తమిళ్ పొలిటికల్ క్రైమ్ డ్రామా Vengeance ఇలాంటి మైండ్ గేమ్స్ చుట్టూ తిరుగుతుంది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
వేణి ఒక జిల్లా కలెక్టర్. అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం, అవినీతిపై కఠినంగా వ్యవహరించడం వంటి చర్యలతో ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదిస్తుంది. కానీ ఆమె జీవితంలో బయటకు కనిపించని మరో కోణం ఉంటుంది. అధికారాన్ని అందుకోవాలన్న ఆశయం, గతంలో జరిగిన కొన్ని పరిణామాలపై ఉన్న పగ ఆమెను మరో దారిలో నడిపిస్తుంటాయి. ఓ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతికి సంబంధించిన ఆధారాలను వేణి సేకరిస్తుంది. అయితే ఈ వ్యవహారం ఆమెకు రాజకీయంగా ఎదురుదెబ్బ అవుతుంది.
ముఖ్యమంత్రి వేలు ఆమెను అవమానించి పదవి నుంచి పంపిస్తాడు. అదే సమయంలో ఢిల్లీలో హోం మినిస్టర్ మాధవ్ ప్రధాని కావాలనే లక్ష్యంతో పావులు కదుపుతుంటాడు. రాష్ట్ర రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో అతడికి వేణి కీలకంగా మారుతుంది. ఓ భారీ మత ఘర్షణను వేణి తన తెలివితో అదుపులోకి తీసుకురావడంతో ఆమె ఇమేజ్ ఒక్కసారిగా మారిపోతుంది. సాధారణ అధికారిణి నుంచి పొలిటికల్ ఐకాన్ గా ఎదుగుతుంది. కానీ మాధవ్ ఆమె వెనుక ఉన్న అసలు కథను బయటకు తీస్తాడు. చనిపోయిందనుకున్న మాజీ సీఎం మెయ్యప్పన్ కుమార్తె వేణి అనే విషయం వెలుగులోకి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.
అయితే ఇదంతా నిజంగానే వేణికి ఎదురైన అనుకోని పరిణామాలా ? లేక ఆమె ముందే వేసుకున్న పథకంలో భాగమా ? సీఎం వేలు ప్రమేయం ఉన్నట్టుగా కనిపించే కారు ప్రమాదం, పోలీస్ షూటౌట్‌లో మాధవ్ మరణం, మెయ్యప్పన్‌కు మళ్లీ గవర్నర్ పదవి రావడం… ఒక్కో ఘటన వెనుక వేణి మాస్టర్ ప్లాన్ బయట పడుతుంది. చివరికి 2042కి కథ మారి, వేణి ఇంకా రహస్యంగా బతికే ఉందని చూపించడంతో పార్ట్-2పై ఆసక్తి పెంచుతూ సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా సెప్టెంబర్ 11 నుంచి Aha Tamilలో స్ట్రీమింగ్ అవుతోంది. రాహుల్ అశోక్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ క్రైమ్ డ్రామాలో అపర్ణతి ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం తమిళ్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగు ఆడియో లేదు. రాజకీయ కుట్రలు, రివెంజ్, మైండ్ గేమ్స్‌తో కూడిన కథతో సినిమా చివరి వరకూ ఆసక్తికరంగా మారుతుంది.