OTT Movies: మీకు మంచి హర్రర్ మూవీ చూడాలని ఉందా? అది కూడా రియాలిటీకి దగ్గరగా ఉండే మూవీ? అయితే, తప్పకుండా ఈ ఫౌండ్ ఫూటేజ్ హార్రర్ మూవీ చూడాల్సిందే. ఇంతకీ ఫౌండ్ ఫూటేజ్ అంటే ఏమిటనేగా మీ సందేహం? యూట్యూబర్స్ లేదా మరెవరైనా కెమేరాల్లో రికార్డు చేసే ఫూటేజీని అలా పిలుస్తారు. ఇవి చూసేందుకు రెగ్యులర్ మూవీ టేకింగ్‌లా ఉండదు. చాలా నేచురల్‌గా నిజంగా జరుగుతుందా అనిపించేలా ఉంటుంది. తమిళంలో మొదటిసారిగా ఈ ఫౌండ్ ఫూటేజ్ హార్రర్ మూవీ తీశారు. మూవీ పేరు ‘మర్మూర్’ (Murmur). ఇది 2025లో విడుదలైన మూవి. ఇక మూవీ కథలోకి వెళ్తే..
కథ:
ఈ మూవీకి హెమ్నాథ్ నారాయణన్ రచన, దర్శకత్వం అందించారు. చెన్నైకి చెందిన ఒక యూట్యూబర్ల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నలుగురు యూట్యూబర్లు జవధు హిల్స్‌లోని ఒక శాపగ్రస్త అడవిలో ‘సప్త కన్నిగల్’ అనే ఏడు దేవతలు, మంగై అనే ఆత్మ గురించి తెలుసుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత కథలో భయానక ట్విస్టులు మొదలవుతాయి.
యూట్యూబర్లు మెల్విన్, అంకిత, జెనిఫర్, వివేక్ తమ యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రత్యేకమైన కంటెంట్ సృష్టించాలని అనుకుంటారు. పారానార్మల్ కంటెంట్‌కు మంచి వ్యూస్ వస్తాయని భావిస్తారు. దెయ్యాలు, ఆత్మలు, అతీంద్రియ శక్తులు, సంఘటనల గురించి నిత్యం వీడియోలు చేస్తుంటారు. ఒక రోజు వారికి జవధు హిల్స్‌లోని కట్టూర్ అనే ఒక గ్రామం గురించి తెలుస్తుంది. ఈ గ్రామ ప్రజలు ‘సప్త కన్నిగల్’ అనే ఏడుగురు దేవతలను ఆరాధిస్తారని, అలాగే అక్కడి అడవిలో మంగై అనే శాపగ్రస్త ఆత్మ ఉందని తెలుసుకుంటారు. దీంతో వారంతా అక్కడికి చేరుకుంటారు.
అక్కడి స్థానికులు మంగై గురించి భయానక అనుభవాలు చెబుతారు. అడవిలోకి వెళ్లిన ఎవరూ ఇప్పటివరకు తిరిగి రాలేదని, వాళ్లను మంగై చంపేసి తినేసిందని అంటారు. రక్తం వాసన వస్తే చాలు మంగై వారిని చంపేస్తుందని తెలుపుతారు. అందుకే, తమ గ్రామంలో మాంసం ముట్టమని, అంతా శాఖాహారమే తింటామని అంటారు. వాస్తవానికి మంగై ఒకప్పుడు కట్టూర్ గ్రామంలో నివసించేదని, ఆమె చేతబడులు చేస్తూ మనుషులను తినేస్తూ ఉండేదని.. అందుకే గ్రామస్తులు ఆమెను చంపేసి.. గోనెలో పెట్టి అడవిలో వదిలేశారని చెబుతారు. ఈ కథలు విన్న యూట్యూబర్లకు అడవిలోకి వెళ్లాలనే కుతుహులత మరింత పెరుగుతుంది. రియల్-టైమ్‌లో పారానార్మల్ అనుభవాలను తమ కెమెరాలో బంధించాలని నిర్ణయిస్తారు.
వారికి ఆ అడవిలోకి ఎలా వెళ్లాలో తెలీదు. ఆ గ్రామంలో ఉండే గౌడ్ రామస్వామిని తమ వెంట తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ, అతడిని పాము కాటు వేయడంతో.. అతడి కూతురు కాంతా వారితో వెళ్తుంది. వెళ్లే ముందు వారిని మరీ మరీ హెచ్చరిస్తుంది. మంగైకు కోపం వచ్చే పనులు చేయొద్దని, రక్తం వాసనకు అది మేల్కొంటుందని చెబుతుంది. అయితే, యూట్యూబర్లు కాంతా మాటలను తేలిగ్గా తీసుకుంటారు. ఎట్టకేలకు అడవిలోకి చేరుకుని అక్కడే క్యాంప్ వేసుకుని చుట్టూ కెమేరాలు ఏర్పాటు చేస్తారు.
అడవిలో భయానక సంఘటనలు:
అడవిలోకి ప్రవేశించిన కొద్ది గంటల్లోనే వారికి వింత సంఘటనలు చూస్తారు. వారి కెమెరాలలో వింత శబ్దాలు రికార్డు అవుతాయి. గుసగుసలు, అడుగుల శబ్దాలు, దూరంగా ఎవరో ఏడుస్తున్న శబ్దాలను వింటారు. ఆ నలుగురిలో అంకిత ధైర్యవంతమైన అమ్మాయి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొనేందుకు ఒంటరిగా వెళ్తుంది. అక్కడ ఏమీ లేకపోయే సరికి మళ్లీ తిరిగి తమ క్యాంప్ దగ్గరకు వచ్చేస్తుంది. అయితే, జెనిఫర్.. కాంతాలు మాత్రం భయపడుతూ ఉంటారు. మెల్విన్, వివేక్‌లు వారికి ధైర్యం చెబుతారు.
అడవిలో రాత్రివేళ వారు ఒక పాత దేవాలయం శిథిలాలను కనుగొంటారు. అక్కడే సప్త కన్నిగల్ ఆరాధించబడేవారని కాంత చెబుతుంది. ఈ దేవతలు గ్రామాన్ని రక్షించే శక్తులుగా ఉండేవారని, కానీ మంగై చేతబడి పూజల వల్ల వారు కోపగించారని చెబుతుంది. అది విన్న తర్వాత వారు.. ఆ శిథిలాల వద్ద కూర్చొని ఒక ఓజా బోర్డ్ (ఆత్మలతో సంభాషించేందుకు వాడే బోర్డు) ఉపయోగించి మంగైను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఆత్మ స్పందించదు. దీంతో మెల్విన్‌కు కోపం వచ్చి.. కాంతా వేలిని కోసి ఆ రక్తాన్ని బోర్డుకు రాస్తాడు. దీంతో షాకైన కాంతా అక్కడి నుంచి వెళ్లిపోతానని, తన రక్తం వాసన చూస్తే మంగై వచ్చి తనని చంపేస్తుందని ఏడుస్తుంది. అయితే, ఆ ఆత్మను పంపేద్దాం.. కూర్చో అని కాంతాను మోసం చేసి ఓజో బోర్డుతో మళ్లీ మంగైను పిలుస్తారు. అక్కడి నుంచే వీరికి కష్టాలు మొదలవుతాయి.
యూట్యూబర్లతో ఒక ఆట ఆడుకొనే.. మంగై
ఓజా బోర్డ్ ఉపయోగించిన తర్వాత అడవిలో అసహజ పరిస్థితులు ఏర్పడతాయి. మొదటి రోజు రాత్రి వారు అక్కడే నిద్రపోతారు. టెంటులో ఖాళీ లేకపోవడంతో కాంతా బయట నిద్రపోతుంది. ఉదయం చూసేసరికి ఆమె కనిపించదు. ఆమె తిరిగి గ్రామానికి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తారు. ఆ తర్వాతి రోజు వారు మరో చోట క్యాంప్ వేసుకుంటారు. అక్కడ బాగా తాగేసి టెంటులో నిద్రపోతారు. గాఢ నిద్రలో ఉన్న జెనిఫర్‌ను అసభ్యకంగా తాకుతూ వివేక్ ముద్దు పెట్టుకుంటాడు. దీంతో జెనిఫర్‌కు కోపం వచ్చి.. మెల్విన్ సాయంతో మరో చోటుకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత తాగిన మత్తులో వివేక్, అంకితాలు టెంటులో ఆ పని కానిస్తారు. అప్పుడే వారికి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అయితే వివేక్ అవేమీ పట్టించుకోకుండా నిద్రపోతాడు. అతడి గురక వల్ల అంకితాకు నిద్ర పట్టదు. దీంతో సిగరెట్ తాగడానికి టెంటు బయటకు వస్తుంది. కానీ, మెల్విన్.. జెన్నీలు సిగరెట్స్ తీసుకెళ్లిపోవడంతో వాకీ టాకీలో మాట్లాడి వాళ్లు ఉన్న ప్రాంతానికి బయల్దేరుతుంది. అక్కడి నుంచి అసలైన భయానక సంఘటనలు మొదలవుతాయి. దాని గురించి చదవడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఆ నలుగురికి ఏమైంది? వారిని చంపుతున్నది మంగైనా? సప్త కన్యలు (ఏడుగురు దేవకన్యలు) వారికి కనపడతారా? కాంతా ఏమైంది? అనేది తెలియాలంటే తప్పకుండా ఈ మూవీ చూడండి.
ఏ ఓటీటీలో ఉంది?
ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తమిళంలో ఉంటుంది. సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు. మొదట్లో మంగై, సప్త కన్యలు గురించి తెలుసుకోడానికే కాస్త ఇబ్బంది అవుతుంది. తర్వాత జరిగేది అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. మధ్యలో కాస్త లాగ్ అనిపించినా.. ఏం జరుగుతుందా అనే టెన్షన్ మాత్రం మీలో కలుగుతుంది.