Korean Family Drama OTT : పెంపుడు కుక్క అంటే చాలామందికి ఒక జంతువు మాత్రమే కాదు… ఫ్యామిలీ మెంబర్ కూడా. మనం ఇంటికి రాగానే ఎదురొచ్చే దాని ఆనందం, మనతో ఆడుకునే తీరు, మనం దూరంగా ఉంటే చూపించే ఆప్యాయత… ఇవన్నీ దానితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. అలాంటి కుక్కను ప్రాణంగా చూసుకునే వ్యక్తికి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కుక్కల వల్ల అలర్జీ ఉందని తెలిస్తే ? జీవిత భాగస్వామి కోసం పెంపుడు కుక్కను వదులుకోవాల్సి వస్తే అతని పరిస్థితి ఏమిటి ? కుటుంబ బంధాలు, జంతువులపై ప్రేమను కలగలిపిన దక్షిణ కొరియా చిత్రం ‘మై హార్ట్ పప్పీ’ (My Heart Puppy). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
మిన్ సూ తన పెంపుడు కుక్క రూనీను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అది అతనికి కేవలం పెంపుడు జంతువు కాదు… తన కుటుంబంలో ఒక సభ్యుడు. రూనీతో కలిసి గడపడం, దాని అవసరాలు చూసుకోవడం అతని రోజువారీ జీవితంలో భాగం. తనకు ఎంత ముఖ్యమైన బంధమో, రూనీకి కూడా తనతో అంతే అనుబంధం ఉందని మిన్ సూ నమ్ముతాడు. ఈ సమయంలో మిన్ సూ తన ప్రేయసిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతారు. కానీ పెళ్లికి సంబంధించిన ప్రణాళికల మధ్య ఊహించని సమస్య ఎదురవుతుంది. మిన్ సూ ప్రేయసికి కుక్కల వల్ల అలర్జీ ఉంటుంది.
రూనీతో కలిసి ఒకే ఇంట్లో జీవించడం ఆమె ఆరోగ్యానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉండటంతో, పెళ్లి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది. దీంతో మిన్ సూ పెద్ద సందిగ్ధంలో పడతాడు. ఒకవైపు తన జీవిత భాగస్వామితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే కోరిక… మరోవైపు తనను నమ్ముకుని ఉన్న రూనీని వదులుకోలేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి అతను తన బంధువు జిన్ గుక్ సహాయం కోరతాడు. రూనీని ప్రేమగా చూసుకునే కొత్త యజమాని దొరికితే సమస్య పరిష్కారమవుతుందని ఇద్దరూ భావిస్తారు. అలా కుక్కకు తగిన ఇల్లు వెతికే ప్రయాణం మొదలవుతుంది.
అయితే రూనీకి సరైన వ్యక్తిని కనుగొనడం అంత సులభం కాదు. ఈ ప్రయాణంలో మిన్ సూ, జిన్ గుక్ వివిధ ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ ఎన్నో కుక్కలను, వాటితో అనుబంధం పెంచుకున్న మనుషులను కలుస్తారు. ఒక్కో సందర్భం వారికి పెంపుడు జంతువులపై ప్రేమ అంటే ఏమిటో, వాటిని పెంచుకోవడం వెనుక ఎంత బాధ్యత ఉంటుందో తెలియజేస్తుంది. కొత్త యజమానిని వెతుకుతున్న క్రమంలో రూనీతో మిన్ సూ అనుబంధం మరింత బలంగా బయటపడుతుంది. రూనీకి నిజంగా మంచి ఇల్లు దొరుకుతుందా? మిన్ సూ తన జీవితంలో ఎదురైన ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం కనుగొంటాడు? తనకు ఎంతో ప్రియమైన కుక్కను దూరం చేసుకోకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించగలడా? అన్నదే కథలోని భావోద్వేగం.
Also Read : భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్కు కొత్త యానిమే ట్రీట్
‘మై హార్ట్ పప్పీ’ 2023 మార్చి 1న దక్షిణ కొరియాలో విడుదలైన ఫ్యామిలీ కామెడీ డ్రామా. ఈ చిత్రం హాట్స్టార్ (JioHotstar)లో అందుబాటులో ఉంది. అలాగే తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. యూ యోన్ సియోక్ (Yoo Yeon-seok) మిన్ సూ పాత్రలో, చా టే హ్యూన్ (Cha Tae-hyun) జిన్ గుక్గా నటించారు. జంగ్ ఇన్ సన్ (Jung In-sun) కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. జేసన్ కిమ్ (Jason Kim) దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ సన్నివేశాలతో పాటు మనుషులకు, పెంపుడు జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని చూపిస్తుంది. ఒక కుక్కకు కొత్త ఇల్లు వెతకడం కోసం మొదలైన ప్రయాణం, దాన్ని ప్రేమించే మనుషుల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడవచ్చు.