Supreme Court: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ‘నువ్వు అతడి చెవి కొరికి తినేశావు’ అంటూ నిందితుడిపై న్యాయస్థానం విరుచుకుపడింది. అంతేకాకుండా అతడి బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఊహించని పరిణామంతో నిందితుడితో పాటు పిటిషనర్ తరపు న్యాయవాది షాక్ కు గురయ్యారు.
జార్ఖండ్లోని రాంచీలో గతేడాది జనష్టమి వేడుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. అర్గోరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రాజీవ్ రంజన్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రాజీవ్ రంజన్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. నిందితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఇరుగుపొరుగు వారి మధ్య చాలాకాలంగా గొడవలు ఉన్నాయని, ఆ రాత్రి అది పెద్దదైందని కోర్టుకు తెలిపారు. నిందితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని కిందకు నెట్టి కాళ్లు, చేతులు కట్టేసి ఛాతిపై గాయపరిచారని వాదించారు.
Also Read: మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!
అయితే ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. నిందితుడ్ని ఉద్దేశిస్తూ ‘నువ్వు మొదట తుపాకి తీశావు. ఆ తర్వాత అతడి చెవి పట్టుకుని మొత్తం కొరికి తినేశావు. ఇప్పుడు నీకు ముందస్తు బెయిల్ కావాలా?’ అని నిలదీసింది. తుపాకి వాడారన్న ఆరోపణ అబద్ధమని లాయర్ చెప్పగా.. ‘సరే, తుపాకి సంగతి పక్కన పెడదాం. మరి చెవి సంగతేంటి? అతడికి చెవిని ఎలా తిరిగి ఇస్తావు?’ అని కోర్టు ప్రశ్నించింది. అయితే నిందితుడు విచారణకు సహకరిస్తాడని, అతడి తరఫు న్యాయవాది ఎంతగానో వాదించినప్పటికీ.. కోర్టు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఈ తీవ్ర నేరంలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టేసింది.
Also Read: పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్పర్ట్స్ ఇస్తున్న సలహలివే?