Mystery Thriller series: ఒకవైపు డబ్బు, విలాసవంతమైన జీవితం గడిపే ధనవంతుల పిల్లలు… మరోవైపు కనీస అవసరాల కోసం కూడా కష్టపడే యువత. అలాంటి రెండు వర్గాల మధ్య పెరిగిన ఓ కుర్రాడికి… తన తండ్రి సముద్రంలో కనిపించకుండా పోయాడని తెలుస్తుంది. కానీ అతని తండ్రి కోసం వెతుకుతుంటే ఏకంగా వందల మిలియన్ డాలర్ల విలువైన పురాతన నిధి ఆచూకీ బయట పడితే ? ఆ నిధి కోసం ప్రాణాలకు తెగించి వేట మొదలు పెడితే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి ? ప్రేమ, స్నేహం మధ్య కూడా క్లాస్ వార్ అడ్డొస్తే ఏం జరుగుతుంది ? ఇలాంటి సాహసాలు, మిస్టరీ, టీనేజ్ డ్రామాతో ఆకట్టుకునే సిరీస్ ‘ఔటర్ బ్యాంక్స్’ (Outer Banks). మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
నార్త్ కరోలినాలోని ఔటర్ బ్యాంక్స్ ద్వీపంలో ఈ కథ సాగుతుంది. అక్కడి సమాజం ప్రధానంగా రెండు వర్గాలుగా ఉంటుంది. పేద, దిగువ మధ్యతరగతికి చెందిన యువతను ‘పోగ్స్’ అని పిలుస్తారు. ధనిక కుటుంబాలకు చెందిన వారిని ‘కూక్స్’ అంటారు. ఈ రెండు వర్గాల మధ్య ఉండే తేడాలు కథలో చాలా చోట్ల కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో జాన్ బి అనే పోగ్ కుర్రాడి జీవితంలోకి ఓ పెద్ద మిస్టరీ వస్తుంది. అతని తండ్రి తొమ్మిది నెలల క్రితం సముద్రంలో అదృశ్యమయ్యాడు. మొదట అది సాధారణ ప్రమాదమే అనుకుంటాడు. కానీ తండ్రి కోసం వెతుకుతున్న సమయంలో అతను ఒక సంచలన విషయాన్ని తెలుసుకుంటాడు.
తన తండ్రి సాధారణ సముద్ర ప్రయాణంలో కనిపించకుండా పోలేదని, ఏకంగా సుమారు 400 మిలియన్ డాలర్ల విలువైన పురాతన నిధి కోసం అన్వేషిస్తూ మాయమయ్యాడని అతనికి అర్థమవుతుంది. అంతే జాన్ బి తన స్నేహితులు జెజె, పోప్, కియారాతో కలిసి నిధి వేట మొదలు పెడతాడు. పాత ఆధారాలు, మ్యాపులు, సముద్ర ప్రయాణాలు ఇలా ఒక్కో క్లూ వాళ్లను మరో ప్రమాదం వైపు తీసుకెళ్తుంది. అయితే వాళ్లు వెతుకుతున్నది కేవలం నిధి మాత్రమే కాదు. జాన్ బి తండ్రి అదృశ్యం వెనుక నిజం కూడా బయట పెట్టాల్సి ఉంటుంది.
నిధి కోసం వెతుకుతున్న కొద్దీ ధనిక కూక్స్ కుటుంబాలతో వీరి గొడవలు పెరుగుతాయి. అదే సమయంలో జాన్ బి, కూక్స్ వర్గానికి చెందిన సారా కేమరాన్ కు దగ్గరవడం మరో సమస్యను తెస్తుంది. ప్రేమ ఒకవైపు, స్నేహం మరోవైపు… నిధి కోసం పోటీ ఇంకోవైపు… ఇలా జాన్ బి బృందం ఎప్పటికప్పుడు ప్రమాదంలో పడుతుంది. సీజన్లు ముందుకు వెళ్లే కొద్దీ ఈ నిధి వేట పరిధి కూడా పెరుగుతుంది. బహామాస్, బార్బడోస్, మొరాకో వంటి ప్రాంతాలకు సాహసం విస్తరిస్తుంది. ఎల్ డొరాడో, బ్లాక్ బియర్డ్ నిధి వంటి చారిత్రాత్మక రహస్యాలు కూడా కథలోకి వస్తాయి.
కానీ అసలు ప్రశ్నలు మాత్రం అలాగే ఉంటాయి. జాన్ బి తండ్రి వెతికిన నిధి నిజంగానే ఎక్కడ ఉంది ? ఆ నిధి కోసం ఇంతమంది ఎందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు ? పోగ్స్, కూక్స్ మధ్య పోరు ఎక్కడికి దారితీస్తుంది ? స్నేహం, ప్రేమ, కుటుంబం… వీటిలో ఏది చివరికి గెలుస్తుంది ? నిధి కోసం మొదలైన ఈ వేటలో అసలు ఎవరు ఏం కోల్పోతారు ? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం సిరీస్‌ను చూడాల్సిందే.
‘ఔటర్ బ్యాంక్స్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేకపోయినా ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్ ఆప్షన్ ఉంది. టీనేజ్ డ్రామా, ఫ్రెండ్షిప్, లవ్, ట్రెజర్ హంట్, అడ్వెంచర్, మిస్టరీ కలిసిన కథ కావాలంటే ఈ సిరీస్ మంచి ఆప్షన్.
Read Also: తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు