Yezhu Kadal Yezhu Malai OTT: ఒక రైలు ప్రయాణం మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందా? అందులోనూ ఒక సాధారణ ప్రయాణికుడికి 8,000 ఏళ్లుగా బతుకుతున్న అమరుడు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? అతడి జీవితంలో దాగున్న ప్రేమకథ తెలిస్తే మన ఆలోచనా విధానమే మారిపోతుందా? ఇలాంటి ఆసక్తికరమైన ఫాంటసీ, ప్రేమకథతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘యెజు కడల్ యెజు మలై’. (Yezhu Kadal Yezhu Malai) మలయాళ నటుడు నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు విదేశీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను ఇండియాలో ఎప్పుడు చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కథ ఒక వర్షం కురుస్తున్న రాత్రి వేళ, కదులుతున్న రైలులో మొదలవుతుంది. ఎనిమిదేళ్ల పాటు దుబాయ్‌లో పనిచేసి, తొలిసారిగా తన కొడుకును చూడటానికి స్వదేశానికి వస్తుంటాడు సూరి. ప్రయాణిస్తున్న బోగీలో అతడికి నివిన్ పౌలీ అనే వింత మనిషి ఎదురవుతాడు. బోగీలో ఉన్న ఒక ఎలుక విషయంలో ఇద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ క్రమంగా పెద్ద సంఘటనలకు దారితీస్తుంది. ఆ తర్వాత నివిన్ సాధారణ వ్యక్తి కాదని, దాదాపు 8,822 ఏళ్లుగా జీవిస్తున్న అమరుడని సూరికి తెలుస్తుంది.
ఆ రాత్రి ప్రయాణంలో నివిన్ తన జీవితంలోని ఎన్నో అనుభవాలను సూరితో పంచుకుంటాడు. ముఖ్యంగా తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి (అంజలి) వేర్వేరు కాలాల్లో మళ్లీ మళ్లీ జన్మిస్తుంటుంది. ఆమెను తిరిగి కలుసుకోవాలనే ఆశతో నివిన్ శతాబ్దాల పాటు ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలో ప్రేమ, విరహం, బాధలతో పాటు ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటాడు. అయితే అతడి కథలో ప్రేమ ఒక్కటే కాదు.. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి ప్రాణం ఎంత విలువైనదో చెప్పే మరో కోణం కూడా ఉంటుంది.
మరోవైపు కొడుకును కలవాలనే ఆశతో ప్రయాణం మొదలుపెట్టిన సూరికి ఆ రాత్రి ఎన్నో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. తాను ఎంతో విలువైనవిగా భావించిన వస్తువుల కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమ, జాలి, మానవత్వమే గొప్పవని అతడు అర్థం చేసుకుంటాడు. ఒక విచిత్రమైన రైలు ప్రయాణం ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఎలా కలిపింది? అమరుడి ప్రేమకథలోని అసలు మర్మం ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ.
ఈ చిత్రంలో నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సురేష్ కామాచి V House Productions బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు 137 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా అక్టోబర్ 1, 2026న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం మలేషియాకు చెందిన Astro Movies ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే భారతదేశంలోని Netflix, Prime Video, JioHotstar వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. తెలుగు వెర్షన్ ‘సంచారి’ పేరుతో థియేటర్లలో విడుదలైనందున, భవిష్యత్తులో ఇండియన్ ఓటీటీ రిలీజ్ సమయంలో తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి వస్తుందేమో చూడాలి.