Horror Thriller on OTT : సినిమా సక్సెస్ ను బడ్జెట్ తో మాత్రమే కొలవలేమని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది Obsession మూవీ. కోట్ల రూపాయల సెట్లు, భారీ స్టార్ కాస్ట్, వందల కోట్ల మార్కెటింగ్ లేకుండానే ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ నిరూపిస్తోంది. కేవలం ఒక మిలియన్ డాలర్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. హారర్ జానర్ సినిమాలను ఇష్టపడే వారి విష్ లిస్ట్ లో ఈ మూవీతో మరో మూవీ చేరింది. మరి ఇంతటి సూపర్ హిట్ హర్రర్ మూవీని ఓటీటీ మూవీ లవర్స్ ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
మే 15న విడుదలైన హర్రర్ మూవీ ‘అబ్సెషన్’. మొదటి రోజు నుంచే అంచనాలకు మించి స్పందనతో థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోంది ఈ మూవీ. భారీ ఫ్రాంచైజీలు, స్టార్ హీరోల సినిమాలకే అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఇంతటి సందడి చేయడం చూస్తుంటాము. నిజానికి ప్రస్తుతం అక్కడ పాప్ సంగీత ప్రపంచాన్ని ఏలిన Michael Jackson జీవిత కథ ఆధారంగా రూపొందిన భారీ బయోపిక్ MICHAEL మూవీ థియేటర్లను ఊపేస్తోంది. అలాంటి టైంలో ఈ చిన్న హారర్ సినిమా జాక్సన్ మూవీని పక్కకు నెట్టి, కలక్షన్ల సునామీని సృష్టిస్తోంది.
విడుదలైన మొదటి రోజే ‘అబ్సెషన్’ 3.2 మిలియన్ డాలర్లు కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ‘మైఖేల్’ బయోపిక్ మాత్రం ఇంకా 2.6 మిలియన్ డాలర్ల వద్దే ఆగిపోవడం గమనార్హం. ఈ చిత్రాన్ని కేవలం ఒక మిలియన్ డాలర్లతో… భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 10 కోట్లలోపు బడ్జెట్ తోనే నిర్మించారు. అదే సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల దిశగా దూసుకుపోవడం అంటే మామూలు విషయం కాదు మరి. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరి ఇలాంటి మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే ఆసక్తి ఓటీటీ మూవీ లవర్స్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయం గురించి మూవీ టీం ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ సమాచారం ప్రకారం ఈ మూవీ జూన్ లేదా ఆగష్టులో అమెజాన్ ప్రైమ్ వీడియో / ఆపిల్ టీవీ ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే కుర్రాడు బేర్. చిన్ననాటి స్నేహితురాలు, కొలీగ్ అయిన నిక్కీ ఫ్రీమాన్ అంటే అతనికి ప్రాణం. కానీ అదే విషయాన్ని ఓపెన్ చెప్పే ధైర్యం మాత్రం ఉండదు. నిక్కీ ఆ ఊరు వదిలేయాలని అనుకుంటుంది. బేర్ ఒక స్టోర్ నుండి ‘వన్ విష్ విల్లో’ (One Wish Willow) అనే ఒక వింతైన పాత బొమ్మ/కర్రను కొంటాడు. నిక్కీ వెళ్ళిపోగానే ఆమె తననే అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి అని ఆ బొమ్మ దగ్గర కోరుకుంటాడు. ఇక్కడ వచ్చే ట్విస్ట్ ను చూస్తే ఎవ్వరైనా వణికిపోతారు. అసలు ప్రేమే వద్దురా బాబోయ్ అనేలా మారుతుంది కథ. ఆ తరువాత ఒక్కొక్క సీన్ ను చూస్తే గుండె జారిపోతుంది.