Most Cursed Horror Movie on OTT : హర్రర్ సినిమాలు అంటే ఎలా ఉంటాయి ? భయంకరంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాలా అనుకుంటున్నారా… నిజమే. చాలా సినిమాలు గుండె జారిపోయే సీన్లతో హడలెత్తిస్తాయి. కానీ అదే హర్రర్ ఓ సినిమాను, స్క్రీన్ ను దాటి బయటకు వస్తే, ఏకంగా రియల్ లైఫ్ లో వెంటాడితే… చేసిన మూవీనే శాపంగా మారి, సినిమాలో నటించిన వారిని వెంటాడి, వేటాడి చంపితే… వినడానికే భయమేస్తోంది కదా. కానీ ఇది ఓ సినిమా విషయంలో నిజంగానే జరిగింది. అదే 1982లో విడుదలై హాలీవుడ్ హారర్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన క్లాసిక్ ‘Poltergeist’. మరి ఈ సినిమాను, అందులో నటించిన వారిని వెంటాడిన శాపం ఏంటి ? ఇందులో నటించిన నటీనటులు ఎలా చనిపోయారు ? అన్న ఇంట్రెస్టింగ్ విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కథ కాలిఫోర్నియాలోని క్యూస్టా వెర్డే అనే ప్రాంతంలో నడుస్తుంది. అక్కడ ఫ్రీలింగ్ కుటుంబం నివశిస్తుంది. స్టీవ్ ఫ్రీలింగ్ సక్సెస్‌ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతని భార్య డయానా ఇంటిని చక్కగా చూసుకునే ఇల్లాలు . ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె డానా, మధ్య కుమార్తె మేరీ, చిన్న కుమార్తె క్యారల్ ఆన్. వీళ్లు ఇల్లు కొత్తగా నిర్మించిన సబర్బన్ హౌసింగ్ కాలనీలో ఉంటుంది.
ఒకరోజు రాత్రి చిన్నమ్మాయి క్యారల్ ఆన్ తన బెడ్‌రూమ్‌లో టీవీ ఆన్ చేస్తుంది. అంతే వింత శబ్దాల మధ్య ఆమె ఏదో శక్తితో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రుల వైపు తిరిగి “వాళ్లు వచ్చేశారు” అని చెబుతుంది. మొదట్లో ఇది చిన్న పిల్లల ఊహ అని అనుకుంటారు. కానీ క్రమంగా ఇంట్లో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతుంది. కుర్చీలు వాటికవే కదులుతాయి, వస్తువులు గాలిలో పైకి ఎగురుతాయి, గోడల నుంచి వచ్చే వింత శబ్దాలు గుండె గుభేల్మనిపిస్తాయి.
ఇదంతా జరుగుతుండగానే, మరో రోజు రాత్రి భయంకరమైన తుఫాను వస్తుంది. దానివల్ల ఇంటి బయట ఉన్న పెద్ద చెట్టు విరిగి కిటికీ అద్దాన్ని పగలగొట్టి, ఆ దంపతుల కొడుకు రాబీని మింగేస్తుంది. మరుసటి రోజు క్యారల్ ఆన్ ను ఆమె బెడ్‌రూమ్ క్లోసెట్ నుంచి వేరే ప్రపంచంలోకి లాక్కెళ్తారు. ఆమె కేవలం టీవీ శబ్దం ద్వారా మాత్రమే తల్లికి వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి కథ భయంకరమైన మలుపు తీసుకుంటుంది.
ఇవన్నీ చూసి భయపడిపోయిన ఆ కుటుంబం పారానార్మల్ నిపుణులైన క్లేర్‌వాయంట్ టాంగినాను సహాయం కోసం పిలుస్తుంది. ఆమె ఇన్వెస్టిగేట్ చేసి భయంకరమైన నిజాన్ని బయటపెడుతుంది. వాళ్ళు నివసిస్తున్న ఇల్లు ఒక పాత శ్మశాన వాటికపై కట్టారని, రియల్ ఎస్టేట్ కంపెనీ సమాధుల రాళ్లను మాత్రమే తొలగించి, లోపల ఉన్న అస్థిపంజరాలను అక్కడే వదిలేసి మోసం చేసిందని తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన ఆత్మలు ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. మరి ఆ దెయ్యాల నుంచి ఆ కుటుంబం ఎలా తప్పించుకుంది ? చిన్నకుతురు మళ్లీ బయటకు వచ్చిందా లేదా ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమాను వీక్షించాల్సిందే.
స్టీవెన్ స్పీల్‌బెర్గ్ స్టోరీటెల్లింగ్, టోబీ హూపర్ దర్శకత్వం ‘పోల్టర్గెయిస్ట్’ చిత్రాన్ని హారర్ క్లాసిక్‌గా నిలిపాయి. అయితే ఈ సినిమాకు “పోల్టర్‌గైస్ట్ శాపం” అనే భయంకరమైన శాపం కూడా ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌లో హీరోయిన్ బురద గుంటలో పడుతుంది. ఆ టైమ్ లో ఆమె చుట్టూ డజన్ల కొద్దీ అస్థిపంజరాలు తేలుతాయి. అయితే సినిమాను తీస్తున్న టైమ్ లో ప్లాస్టిక్ అస్థిపంజరాలు కాస్ట్లీగా ఉండేవట. అందుకని మెడికల్ రిసెర్చ్ కోసం కోసం వాడే నిజమైన మనుషుల అస్థిపంజరాలు తక్కువ ధరకే దొరకడంతో, మేకర్స్ అవే సినిమాలో వాడారు. కానీ అలా వాడి చనిపోయిన వారి ఆత్మలను అవమానించినందుకే ఈ శాపం తగిలిందని ఇప్పటికీ నమ్ముతారు.
Also Read : ఫర్నిచర్ షోరూమ్‌లో తీయకూడని తలుపు… లోపలికెళ్తే అంతులేని వింత మిస్టరీ
ఈ సినిమాలో పెద్ద కూతురుగా నటించిన అమ్మాయి డొమినిక్ డన్ హత్యకు గురైంది. సినిమా విడుదలైన కేవలం ఐదు నెలలకే ఆమెను మాజీ ప్రియుడి బలిగొన్నాడు. ఈ సిరీస్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన చిన్నకూతురు హీథర్, ‘పోల్టర్‌గైస్ట్ 3’ షూటింగ్ పూర్తి కాకముందే, 12 ఏళ్ల వయసులోనే ఒక వింత ప్రేగు సంబంధిత వ్యాధితో సడన్ గా చనిపోయింది. ‘పోల్టర్‌గైస్ట్ 2’లో నటించిన జూలియన్ బెక్ క్యాన్సర్‌తో చనిపోతే, విల్ సాంప్సన్ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల సినిమాను కంప్లీట్ చేసిన కొద్దిరోజులకే కన్నుమూశారు. మొత్తం మీద ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన ఆరుగురు నటులు ఈలా మరణించడం హర్రర్ ప్రపంచంలో ఓ మిస్టరీగా మారింది. కాగా ఈ మూవీ Amazon Prime Video, Apple TVలలో రెంటల్ ఆప్షన్ లో ఇంగ్లీష్ తో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులోకి రాలేదు.