Psychological Mystery Thriller: ప్రతి కథలో ఒక నిజం ఉంటుంది. కానీ ఆ నిజాన్ని ఇద్దరు వ్యక్తులు పూర్తిగా డిఫరెంట్ గా చెబితే ? అలాంటి సందర్భంలో ఎవరిని నమ్మాలో అర్థం కాక ప్రేక్షకుడే అయోమయంలో పడేలా చేసే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్లలో ‘మై క్లైంట్స్ వైఫ్’ (My Clients Wife) ఒకటి. మొదట సినిమా సాధారణ గృహహింస కేసులా కనిపించినా, నెమ్మదిగా ప్రతి పాత్రపై అనుమానం పెరుగుతుంది. ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం ఆడుతున్నారు? అనే సందేహాన్ని చివరి వరకు కొనసాగించడంతో సస్పెన్స్ పీక్స్ లో ఉంటుంది. మరి మీరు కూడా ఆ సస్పెన్స్ తో థ్రిల్ అవ్వాలి అనుకుంటే ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
రఘురామ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య సిందూరాపై తీవ్రంగా దాడి చేశాడనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదవుతుంది. ఈ కేసును వాదించేందుకు లాయర్ మానస్ వర్మ రంగంలోకి దిగుతాడు. అయితే రఘురామ్ చెప్పే కథ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తాను నిర్దోషినని, తన భార్యే ముందుగానే పక్కా ప్లాన్ వేసి ఈ కేసులో ఇరికించిందని చెబుతాడు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని, తన ప్రవర్తన వెనుక ఒక విచిత్రమైన మనస్తత్వ సమస్య ఉందని ఆరోపిస్తాడు.
రఘురామ్ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలని మానస్ నేరుగా సిందూరాను కలుస్తాడు. కానీ అక్కడ మరో కథ వినిపిస్తుంది. తన భర్త చాలా క్రూరుడని, ఎన్నో రోజులుగా తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని సిందూరా చెబుతుంది. ఇద్దరూ చెప్పే కథలు పూర్తిగా డిఫరెంట్ గా ఉండటంతో మానస్ తీవ్ర గందరగోళంలో పడతాడు. నిజం ఏది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆ ఇంట్లో ఎక్కువ సమయం గడిపే కొద్దీ విచిత్రమైన సంఘటనలు అతని దృష్టికి వస్తాయి. చుట్టుపక్కల వాళ్ల ప్రవర్తన కూడా అనుమానాలను మరింత పెంచుతుంది.
క్రమంగా ఆ ఇంట్లో కనిపించని మరో రహస్యం దాగి ఉందనే భావన కలుగుతుంది. మానస్ దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ మానవ మనస్తత్వం, భ్రమలు, అనుమానాలు ఒక మనిషి జీవితాన్ని ఎంతగా మార్చగలవో కథ ఆసక్తికరంగా చూపిస్తుంది. చివరికి అసలు నిజం ఏది ? నేరస్థుడు ఎవరు ? జరిగిన సంఘటనల వెనుక దాగిన షాకింగ్ వాస్తవం ఏమిటి ? అనే విషయాలు మాత్రం సినిమాలో చూస్తేనే అసలు కిక్ తెలుస్తుంది.
‘మై క్లైంట్స్ వైఫ్’ పూర్తిగా పాత్రల చుట్టూ తిరిగే సైకోలాజికల్ మిస్టరీ థ్రిల్లర్. షరీబ్ హష్మీ లాయర్ గా నటించగా, అంజలి పాటిల్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు ప్రభాకర్ మీనా భాస్కర్ పంత్ సినిమాను తెరకెక్కించారు. భారీ యాక్షన్ లేదా హారర్ ఎలిమెంట్స్ లేకపోయినా, ట్విస్టులు, మిస్టరీని ఆస్వాదించే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. 2020లో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, షెమారూ మీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. అధికారికంగా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రం హిందీ భాషలో మాత్రమే ఉంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడి అభిప్రాయాన్ని మార్చే కథలు మీకు నచ్చితే ‘మై క్లైంట్స్ వైఫ్’ ఒకసారి చూడదగ్గ సినిమా.
Read Also: 10 కోట్ల బ్యాగ్ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు