Cocktail 2:ప్రముఖ పాన్ ఇండియా స్టార్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna) లేటెస్ట్ గా నటించిన బాలీవుడ్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం కాక్ టెయిల్2. షాహిద్ కపూర్ (Shahid Kapoor), కృతి సనన్ (Kriti Sanon), రష్మిక మందన్న కలయికలో జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అటు థియేటర్లలో ఆడియన్స్ ని మెప్పించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ మేరకు సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది.
అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఆగస్టు 14వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ట్రెండీ లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ డైరెక్టర్ హోమీ అడజానియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ప్రీతమ్ సంగీతాన్ని అందించారు. ఇంతియాజ్ రాసిన ఈ బ్రీజీ లవ్ స్టోరీని మాడ్యాక్ ఫిలిమ్స్, లవ్ ఫిలిమ్స్ బ్యానర్లపై దినేష్ విజన్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరించారు. మొదటి వారంలోనే రూ.50 కోట్లు దాటిన హిందీ సినిమాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికగా ఓటీటీ లవర్స్ ను మెప్పించడానికి సిద్ధం అయ్యింది.
also read:అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!
కాక్ టెయిల్ 2 సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాలేజీ రోజుల నుంచి ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడినా.. పెళ్లి వ్యవస్థపై నమ్మకం లేక లివింగ్ రిలేషన్ కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఈ జంట ఇటలీలోని అందమైన సిసిలీ దీవులకు వెకేషన్ ప్లాన్ చేసుకుంటుంది. అక్కడ అనుకోకుండా దియా స్నేహితురాలు అల్లీ (కృతి సనన్) వీరిని కలుస్తుంది. అల్లీ బలవంతం పెట్టడంతో కునాల్ , దియా తమ ప్లాన్స్ ను పక్కనపెట్టి, ఆమెతో కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. అయితే బయటకు అంత హ్యాపీగానే ఉన్నా దియా మనసులో మాత్రం ఏదో తెలియని అభద్రతాభావం.. కునాల్ తనను నిజాయితీగా ప్రేమిస్తున్నాడా ? లేక ఏదో బాధ్యతగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా ? అనే అనుమానం ఆమెను వేధిస్తూ ఉంటుంది.
దీంతో కునాల్ ను పరీక్షించడం కోసం కునాల్ తో క్లోజ్ గా ఉంటూ ఫ్లర్ట్ చేయమని తన ఫ్రెండ్ అల్లీని కోరుతుంది దియా. అయితే అనుకోకుండా కునాల్ అల్లీ మాయలో పడడమే కాకుండా ఆమెతో ఒకానొక సందర్భంలో శారీరకంగా కూడా కలుస్తారు. ఇక ఈ విషయం తెలియని దియా కునాల్ తో పెళ్లికి సిద్ధమవుతూ ఉంటుంది. అదే సమయంలో కునాల్ పై మితిమీరిన ప్రేమను పెంచుకున్న అల్లీ ఈ విషయాన్ని దియాతో చెబుతుంది. ఆ తర్వాత దియా రియాక్షన్ ఏంటి? కునాల్ ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకున్నారు? తదితర విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇక థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇటు ఓటీటీలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.