Inzamam-ul-Haq On PAK VS SL Tri series: వన్డే ట్రై సిరీస్ లో పాకిస్తాన్ విజేతగా నిలిచిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకను ఓడించినట్టుగానే టీమిండియా చిత్తుగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాతో తమకు కనీసం మూడు మ్యాచ్ లు జరుగుతాయని చెప్పాడు. ఈ తరుణంలోనే ఆ వరల్డ్ కప్ లోనే టీమిండియాను ఓడించి,150 కోట్ల భారతీయులను ఏడ్పిస్తామని హెచ్చరించాడు. తాజాగా జరిగిన ట్రై సిరీస్ లో ఆడినట్టుగానే పాకిస్తాన్ ఇకపై ఆడుతుందనే నమ్మకం తనకు ఉందన్నాడు. కొన్ని రోజులుగా పాకిస్తాన్ వరుసగా ఓటములను చూసి ఫ్యాన్స్ బాధ పడ్డారని, కానీ ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఇక నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు టాప్ గేర్ లో దూసుకెళుతుందని వెల్లడించాడు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యాంగా జరిగిన వన్డే ట్రై సిరీస్ 2026 విజేతగా షాహీన్ అఫ్రిది నేతృత్వరంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిలిచింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా శనివారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంక జట్టును 3 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది షాహీన్ అఫ్రిది సేన. దీంతో ఈ ట్రై సిరీస్ ట్రోఫీ దక్కించుకుంది. ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 325 పరుగులు సాధించింది. ఓపెనర్ కమిందు మెండిస్ సెంచరీతో రాణించగా పవన్ రత్నాయకె 77 పరుగులు మెరుపులు మెరిపించాడు. దీంతో శ్రీలంక భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, శ్రీ లంక విధించిన టార్గెట్‌ను పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఛేదించింది.
ఈ క్రమంలోనే 48.3 ఓవర్లు ఆడిన పాక్, 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించి, విజయం సాధించింది. పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్ ఒక్కడే 127 పరుగులతో దుమ్ములేపాడు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన సాద్ బేగ్ 74 పరుగులతో రాణించాడు. చివరలో అరాఫత్ మిన్హాస్ 61 పరుగులు, హసన్ నవాజ్ 37 పరుగులతో దూకుడుగా ఆడటంతో పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, వన్డే ట్రై సిరీస్ 2026 టోర్నమెంట్‌లో ఆతిథ్య పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక తలపడ్డాయి. చెత్త ప్రదర్శన కనబరిచిన ఇంగ్లాండ్ గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయింది. ఫైనల్స్‌లో పాక్, లంక తలపడ్డాయి. ఇందులో పాక్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో దుమ్ములేపిన ఫఖార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అరాఫత్ మిన్హాస్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.