OTT Movie : పరువు హత్యల నేపథ్యంలో వచ్చిన ఒక మరాఠి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాగా డబ్బున్న అగ్రకులం అమ్మాయిని, పేదవాడైన తక్కువ కులం గల అబ్బాయి ప్రేమిస్తాడు. పరువు కోసం పాకులాడే తండ్రి, వీళ్ళిద్దరిని ఏం చేస్తాడనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జి ఫైవ్ Zee5 లో
ఈ మరాఠీ లవ్ స్టోరీ మూవీ పేరు ‘సైరత్‘ (Sairat). 2016 లో వచ్చిన ఈ మరాఠీ మూవీకి నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు. వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు యువ కళాశాల విద్యార్థులు ప్రేమలో పడతారు, వారి ప్రేమ కుటుంబాల మధ్య వివాదానికి దారి తీస్తుంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా కర్మలా తాలూకాలోని మంజులే గ్రామం, జ్యూర్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరిగింది. ఈ మూవీ ఏప్రిల్ 2016 న మహారాష్ట్రతో పాటు, భారతదేశంలోని అనేక ఇతర ప్రదేశాలలో విడుదలైంది. విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ప్రశాంత్ ఒక పేద కుటుంబంలో పుట్టి చదువుకుంటూ ఉంటాడు. వీళ్ళ కుటుంబం చేపలు పట్టుకొని అమ్ముతూ ఉంటుంది. అయితే అదే ఊరిలో అర్చన అనే అమ్మాయి కూడా ఉంటుంది. ప్రశాంత్ చదివే స్కూల్లోనే ఈ అమ్మాయి కూడా చదువుతుంది. వీళ్ళది చాలా సంపన్న కుటుంబం. చాలా రోజుల నుంచి అర్చనను ప్రశాంత లవ్ చేస్తూ ఉంటాడు. ఆమెకు తన ప్రేమను తెలియజేపడానికి నానా తంటాలు పడతాడు. చివరికి వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెడతారు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలుస్తుంది. ప్రశాంతిని ఏమైనా చేస్తాడేమో అని, అర్చన ప్రశాంత్ దగ్గరికి వస్తుంది. ఇద్దరు కలిసి ఊరు విడిచి పారిపోతారు. అయితే సిటీకి వచ్చిన వీళ్ళని, పోలీసులు పట్టుకొని వివరాలు తెలుసుకొని అర్చన తండ్రికి చెప్తారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన అర్చన తండ్రి, కూతురుని తీసుకుని వెళ్ళిపోతూ ప్రశాంత్ ని చంపేయమని తన మనుషులకు చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న అర్చన అతనిని తప్పించి, మళ్లీ పారిపోయి ఇద్దరూ కలసి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి వస్తారు.
చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో, లక్ష్మి అనే మహిళ వీళ్ళకు ఆశ్రయం ఇస్తుంది. ఆ తరువాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని, ఒక బాబుని కూడా కంటారు. అయితే అర్చనకు తల్లి గుర్తుకు రావడంతో ఒకసారి ఫోన్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి వీరి లొకేషన్ కనుక్కుంటాడు. సడన్ గా బంధువులు వీరున్నచోటికి వస్తారు. తండ్రికి కోపం పోయిందని, మనల్ని తీసుకువెళ్లడానికి వచ్చారని అనుకుంటుంది అర్చన. ఇదే సమయంలో వీళ్ళ బాబుని పక్కింటావిడ ఆడుకోవడానికి తీసుకు వెళుతుంది. అయితే ఆ సమయంలోనే ప్రశాంత్, అర్చన లను వాళ్ళు చంపేసి వెళ్లిపోతారు. బాబు అనాధ అవుతాడు. పరువు కోసం ప్రాకులాడే కన్న తల్లిదండ్రులు, పిల్లల ప్రేమని అర్థం చేసుకోకుండా ప్రాణాలు తీయడం నిజంగా బాధాకరం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా, ఇంకా ఈ పిచ్చి పోలేదు. ఒక అమృత, ప్రణయ్ విషయంలోనే కాకుండా, ఇంతకన్నా ఘోరంగా మనుషులను చంపిన కేసులు లెక్కలేనన్ని ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండే రోజులు రావాలని కోరుకుందాం.