Crime Thriller on OTT: ఓ నగరంలో జరిగిన అనుమానాస్పద మరణం… పోలీసులకు మాత్రం అది పెద్ద కేసులా అనిపించదు. కానీ ఓ క్రైమ్ రిపోర్టర్‌కు మాత్రం అందులో ఏదో తేడా కనిపిస్తుంది. సాధారణ ప్రమాదంలా కనిపిస్తున్న ఆ ఘటన వెనుక మరో పెద్ద కథ ఉందని అతనికి అనుమానం వస్తుంది. నిజం తెలుసుకునే ప్రయత్నంలోకి దిగిన కొద్దీ పాత కేసులు, కొత్త ఆధారాలు, ఊహించని వ్యక్తుల మధ్య సంబంధాలు బయట పడుతుంటాయి. అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే… కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అడుగులను ముందుగానే ఊహిస్తున్న ఓ మైండ్ గేమ్ కిల్లర్ అక్కడ ఉంటాడు. అతను వదిలే క్లూస్ నిజంగా దర్యాప్తుకు ఉపయోగపడుతున్నాయా? లేక రిపోర్టర్‌ను కావాలనే ఓ ఉచ్చులోకి లాగుతున్నాడా? ఇలా క్రైమ్, లీగల్ లూప్‌హోల్స్, మర్డర్ మిస్టరీతో సాగిన మూవీనే ‘Mrithyunjay’. మరి ఈ సినిమా తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో జై (శ్రీవిష్ణు) ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం క్రైమ్ రిపోర్టింగ్ చేస్తుంటాడు. సాధారణ వార్తలను కవర్ చేయడం కంటే… పోలీసులకు అంతుచిక్కని కేసుల వెనుక అసలు నిజాన్ని బయటకు తీసుకురావడమే అతనికి ఇష్టం. అలాంటి సమయంలో నగరంలో ఓ హై-ప్రొఫైల్ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతాడు. పోలీసులు దాన్ని పెద్దగా అనుమానించకుండా కేసును ముగించే ప్రయత్నం చేస్తారు. కానీ జైకి మాత్రం ఈ మరణం వెనుక ఏదో దాగి ఉందనే అనుమానం మొదలవుతుంది.
అతను తనకు తెలిసిన సీత సహాయంతో కేసును సొంతంగా పరిశీలించడం మొదలు పెడతాడు. ఒక్కో ఆధారాన్ని వెతుక్కుంటూ వెళ్లే కొద్దీ ఇది ఒక్క మరణానికి సంబంధించిన విషయం కాదని తెలుస్తుంది. గతంలో జరిగిన కొన్ని అనుమానాస్పద మరణాలకు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు జై గుర్తిస్తాడు. ఇక్కడి నుంచే కథ అసలు మలుపు తిరుగుతుంది. జై దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఓ గుర్తుతెలియని వ్యక్తి అతనికి ఆధారాలు వదిలి పెడుతుంటాడు. అవి జైకి కేసును ఛేదించేందుకు సహాయపడుతున్నట్లే కనిపిస్తాయి.
కానీ ఆ క్లూస్ వెనుక మరో ఉద్దేశం ఉందని అతనికి మెల్లగా అర్థమవుతుంది. జై వేసే ప్రతి అడుగును ఆ కిల్లర్ ముందుగానే ఊహిస్తున్నట్లుగా పరిస్థితులు మారిపోతుంటాయి. కేసు లోతుల్లోకి వెళ్లిన కొద్దీ జైకి తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ప్రమాదంలో ఉన్నారని తెలుస్తుంది. కిల్లర్ కేవలం హత్యలు చేయడమే కాకుండా… తనను వెంబడిస్తున్న జైని మానసికంగా కూడా దెబ్బతీయాలని చూస్తుంటాడు. ఒక దశలో జై ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. అసలు ఈ వ్యక్తి జైని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అతని గతానికి ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? ఇన్ని హత్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అనే ప్రశ్నలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
సెకండాఫ్‌లో జై, ఆ కిల్లర్ మధ్య అసలైన మైండ్ గేమ్ మొదలవుతుంది. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటూ నిందితుడు తప్పించుకుంటూనే ఉంటాడు. జై దగ్గర ఆధారాలు ఉన్నా… వాటిని చట్టబద్ధంగా నిరూపించడం మరో పెద్ద సవాలుగా మారుతుంది. చివరికి తన తెలివితేటలతో పాటు లీగల్ లూప్‌హోల్స్‌ను ఉపయోగించుకుని జై ఆ కేసులో దాగిన అసలు నిజాన్ని ఎలా బయటకు తీశాడు? తనను ఇంతకాలం ఆడించిన హంతకుడి వెనుక ఉన్నది ఎవరు? అతని ఉద్దేశం ఏంటి? చివరికి జై ఆ మిస్టరీని ఛేదించి ప్రాణాలతో బయటపడ్డాడా? అనేదే క్లైమాక్స్‌లో చూడాల్సిన అసలు ట్విస్ట్.
‘మృత్యుంజయ్’ ప్రస్తుతం Netflixలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కిల్లర్ మైండ్ గేమ్స్, లీగల్ ట్విస్టులతో సాగే ఈ థ్రిల్లర్ ను ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి. ముఖ్యంగా హంతకుడు వేసే ఎత్తులకు హీరో వేసే పైఎత్తులు కథలో ఆసక్తికరంగా ఉంటాయి.
Read Also: గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో