Anaganaga OTT Movie Review : సుమంత్ గతంలో పలు హిట్లు ఇచ్చిన హీరోనే. కానీ అతని కటౌట్ కి తగ్గట్టు మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు ‘సీతా రామం’ ‘సార్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మరోపక్క ఓటీటీ సినిమాలు చేస్తున్నాడు. మొన్నామధ్య ‘అహం రీబూట్’ అనే కాన్సెప్ట్ సినిమా చేశాడు. అది బాగానే ఉంది. కానీ పెద్దగా చప్పుడు చేయలేదు. ఇప్పుడు ‘అనగనగా’ అంటూ మరో ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు నుండీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకునే విధంగా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
కథ :
వ్యాస్ (సుమంత్) ఓ పెద్ద స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య భాగ్యలక్ష్మీ(కాజల్ చౌదరి) అదే స్కూల్ కి ప్రిన్సిపాల్. వీరి కొడుకు రామ్ (మాస్టర్ విహార్ష్) కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటాడు. రామ్ కి స్కూల్ అంటే భయం. అతనికి పాస్ మార్కులు కూడా రావు. మరోపక్క తండ్రి వ్యాస్ అంటే అతనికి ప్రాణం. ఇక బట్టీ చదువులను వ్యాస్ ఎంకరేజ్ చేయడు. పాఠాలను కథలుగా చెబితేనే పిల్లలకి అర్ధమవుతుంది అని నమ్మే వ్యక్తి అతను. చదువు చెప్పే పద్ధతి అలా ఉండాలి అనేది అతని బలమైన నమ్మకం.
కానీ అందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోదు. వ్యాస్ ను వ్యతిరేకిస్తుంది. అతని భార్య అయిన ప్రిన్సిపాల్ కి కూడా నచ్చజెబుతుంది. దీంతో భర్తతో గొడవపెడుతుంది భాగ్యలక్ష్మీ. నీ వల్లే నీ కొడుకు పాడైపోతున్నాడు అన్నట్టు వ్యాస్ ని దెప్పిపొడుస్తుంది. దీంతో రామ్ కి వ్యాస్ ఎలా నచ్చజెప్పాడు? రామ్ తండ్రి చెప్పినట్టు విన్నాడా? భర్త విషయంలో భాగ్యలక్ష్మీ ఏం చేసింది? స్కూల్ యాజమాన్యం వల్ల వ్యాస్ ఉద్యోగానికి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
కార్పొరేట్ స్కూల్స్ లో చదువులు.. ఫీజుల వల్ల సామాన్యులు పడే ఇబ్బందులు.., బట్టి చదువుల వల్ల కెరీర్లో పడే ఇబ్బందులు.. వంటివి ఇప్పటికే మనం పలు సినిమాల్లో చూశాం. ‘తారే జమీన్ పర్’ ‘త్రీ ఇడియట్స్’ ‘సార్’ ’35 – చిన్న కథ కాదు’ వంటి సినిమాల్లో చూపించింది ఇదే. కాబట్టి ‘అనగనగా’ కథ విషయంలో మనకి కొత్తగా కనిపించేది ఏమీ ఉండదు.
దర్శకుడు సన్నీ సంజయ్ అందుకే సెకండాఫ్ అంతా ఫ్యామిలీ ఎమోషన్స్ పై దృష్టి పెట్టాడు. ప్రీ క్లైమాక్స్ పోర్షన్ నుండి ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతాడు. క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ అప్పటివరకు ప్రేక్షకులకి ఇది స్లో డ్రామాలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా లేజీగా సాగుతుంది. ప్రతి సీన్ ను మనం ముందుగానే అంచనా వేసేస్తాం. అయితే కొన్ని డైలాగులు బాగున్నాయి. రియాలిటీకి దగ్గరగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సాదాసీదాగానే ఉన్నాయి. ఓటీటీ సినిమా కాబట్టి.. వంకలు పెట్టేంత చీప్ గా అనిపించవు.
నటీనటుల విషయానికి వస్తే.. సుమంత్ సటిల్డ్ గా చేశాడు. కానీ కొత్తగా ఏమీ అనిపించదు. ‘గోల్కొండ హైస్కూల్’ లో చేసిన పాత్రనే మళ్ళీ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో బాగా ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. కాజల్ చౌదరి హోమ్లీగా కనిపిస్తుంది. డబ్బింగ్ సింక్ ఎందుకో కుదర్లేదు. అవసరాల శ్రీనివాస్ కి కూడా ఇది కొత్త రకమైన పాత్ర ఏమీ కాదు. మాస్టర్ విహార్ష్ నటన ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో ఈ పిల్లాడి నటనకి కన్నీళ్లు పెట్టుకోని వారంటూ ఉండరేమో అనిపిస్తుంది. మిగతా నటీనటులు ఉన్నంతలో ఓకే అనిపిస్తారు.
ప్లస్ పాయింట్స్ :
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్
ఇంటర్వెల్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
ఫస్ట్ హాఫ్
స్లో నెరేషన్
మొత్తంగా.. ఈ ‘అనగనగా’ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ లేజీ టేకింగ్ వల్ల అందరికీ కనెక్ట్ అవ్వదు. ఓటీటీ సినిమానే కాబట్టి.. ఫాస్ట్ ఫార్వార్డ్ ఆప్షన్ యూజ్ చేసి ఒకసారి ట్రై చేయొచ్చు.
Anaganaga OTT Movie Rating : 2/5