Man Pet Lion Kill|ఇంట్లో జంతువులు పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. వాటితో ఆడుకోవడం వల్ల ఒత్తిడికి దూరంగా ఉంటే ఉత్సహంగా ఉంటారు. అందుకోసమే చాలామంది కుక్కలు, పిల్లులను సాధారణంగా పెంచుకుంటుంటారు. కానీ ఇటీవల కొందరు ఐశ్వర్యవంతులు అడవి మృగాలను కూడా సరదా కోసం ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. తరుచూ యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటాం. అయితే తాజాగా ఒక వ్యక్తి ఇంట్లో పెంపుడు జంతువుగా ఉన్న ఓ సింహాన్ని కాల్చి చంపేశారు. అంతకుముందు ఆ ఇంట్లో ఓ భయానక ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఇరాక్ దేశంలోని నజఫ్ రాష్ట్రం అల్ బారకియా జిల్లాకు చెందిన అఖిల్ ఫఖర్ అల్ దీన్ (65)కు ఇంట్లో జంతువులు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన కొన్ని రోజుల క్రితమే ఒక యంగ్ సింహాన్ని కొనుగోలు చేశాడు. ఆయన ఇంట్లోని పెరట్లో ఇప్పటికే చిలుకలు, ఒక పులి, కుక్కలు ఉన్నాయి. వాటి కోసం ఆయన ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి వాటికి సరైన ఆహారం, ఇతర సౌకర్యాలు అందిస్తూ ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ అనుకోకుండా గత వారం ఆయన ఇంట్లో ఓ భయానక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రెండు ప్రాణాలు బలయ్యాయి.
స్థానిక వార్తా పత్రిక అల్ ఘాగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మే 8, 2025న మధ్యాహ్నం వేళ.. అఖిల్ ఫకర్ అల్ దీన్ తన ఇంట్లో ఉన్న కొత్త సింహానికి ఆహారం అందించేందుకు వెళ్లాడు. అందుకోసం ముందుగా ఆ సింహం బోను తెరిచి.. దాన్ని ప్రేమగా పిలిచాడు. కానీ మదమెక్కిన ఆ సింహం తన యజమానిపై ఎగిరి దాడి చేసింది. ఏకంగా ఫఖర్ దీన్ గొంతుని తన పదునైన పళ్లతో గట్టిగా పట్టేసింది. అతని ఛాతీ భాగంపై తన బలమైన పంజాలతో దాడి చేసింది. సింహం దాడి చేయడంతో ఫఖర్ కేకలు వేశాడు. ఆ కేకలకు అతని భార్య, పిల్లలు అక్కడికి వచ్చి చూసి భయపడిపోయారు. వారు కాపాడడానికి ప్రయత్నించినా.. ఆ సింహం వారిపై కూడా దాడి చేయడానికి పరుగులు తీసింది .ఇది చూసి వారు పరుగులు తీశారు. వెంటనే పొరుగింటికి వెళ్లి వారిని సాయం కోరారు.
దీంతో పొరుగింటి వ్యక్తి తన తుపాకీ తీసుకొని అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆ సింహం ఫఖర్ దీన్ ని చంపేసింది. అతని శరీర భాగాలన వేరు చేసి తింటూ కనిపించింది. ఇది చూసి ఆ పొరుగింటి వ్యక్తి తన తుపాకీ ఆ సింహంపై కాల్పులు జరిపాడు. ఫలితంగా ఆ సింహం గాయాలతో రక్తస్రావమై చనిపోయింది.
Also Read: టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ హత్య.. వీడియో లైవ్ స్ట్రీమింగ్‌లో యువతిపై కాల్పులు..
ఇరాక్ లో ఎటువంటి అనుమతులు లేకుండా కృూర మృగాలను ఫఖర్ దీన్ తన ఇంట్లో పెంచుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అతడి చర్యలు ఆ ప్రాంతంలోని పౌరులందరికీ ప్రమాదమని చెప్పి.. అతడి ఇంట్లోని కృూర మృగాలన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.