Psychological Thriller Series OTT : ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర లేచే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ అదే సమయానికి లేచిన ప్రతిసారీ భయంకరమైన దృశ్యాలు కనిపిస్తే… ఆ టైమ్ వెనుక ఏదో రహస్యం ఉందని అనిపిస్తుంది. లూసీ చాంబర్స్ కు ప్రతిరోజూ తెల్లవారుజామున 3:33 గంటలకు ఇదే జరుగుతుంది. ఆమె కొడుకు ఐజాక్ ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది. అదే సమయంలో నగరంలో జరుగుతున్న వరుస హత్యలతో లూసీ పేరు ముడిపడటంతో అసలు మిస్టరీ మొదలవుతుంది. టైమ్, డెజా వూ, సీరియల్ కిల్లర్ మిస్టరీ కలిసి ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘ది డెవిల్స్ అవర్’ (The Devil’s Hour). మరి ఈ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
లూసీ చాంబర్స్ ఒక సోషల్ వర్కర్. తన వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉంటాయి. భర్త మైక్ తో సంబంధం దెబ్బతింటుంది. వారి చిన్న కుమారుడు ఐజాక్ కూడా చాలా వింతగా ప్రవర్తిస్తుంటాడు. అతనిలో భావోద్వేగ స్పందనలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు ఇతరులకు కనిపించని వ్యక్తులను తాను చూస్తున్నానని ఐజాక్ చెబుతుంటాడు. లూసీకి మాత్రం మరో సమస్య ఉంది. ప్రతిరాత్రి సరిగ్గా 3:33 AMకు ఆమెకు నిద్రల నుంచి మెలకువ వస్తుంది. ఆ సమయంలో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి.
పగటిపూట కూడా ఎప్పుడో జరిగినట్టు అనిపించే సంఘటనలు ఆమెకు ముందుగానే తెలిసినట్టుగా అనిపిస్తాయి. ఇదే సమయంలో డీఐ రవి ధిల్లాన్ వరుస హత్యలను దర్యాప్తు చేస్తుంటాడు. మొదట వాటికి ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టే కనిపిస్తుంది. కానీ కేసు ముందుకు వెళ్లేకొద్దీ లూసీ పేరు ఆ హత్యలతో అనుకోకుండా ముడిపడుతుంది. మరోవైపు లూసీ తల్లి కూడా ఖాళీ కుర్చీలతో మాట్లాడటం, కనిపించని వ్యక్తులను చూసినట్టు ప్రవర్తించడం ఆమెను మరింత కలవర పెడుతుంది. ఐజాక్ కూడా ఒక సాధారణ పిల్లాడిలా ఉండడు. అతని మాటలు, ప్రవర్తన లూసీకి అర్థంకాని మరో ప్రపంచానికి సంకేతాల్లా ఉంటాయి.
ఈ సమయంలో గిడియన్ షెపర్డ్ అనే మిస్టీరియస్ వ్యక్తి కథలోకి వస్తాడు. అతనికి లూసీతో ఏదో విచిత్రమైన సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అతను భవిష్యత్తు గురించి తనకు తెలిసినట్టుగా మాట్లాడుతుంటాడు. లూసీకి కనిపిస్తున్న దృశ్యాలు, గిడియన్ మాటలు, జరుగుతున్న హత్యలు.. అన్నీ ఒకే రహస్యానికి చెందినవని క్రమంగా అర్థమవుతుంది.
అసలు లూసీ ఎందుకు 3:33కే మేల్కొంటుంది ? ఐజాక్ కు కనిపించే వ్యక్తుల వెనుక ఉన్న విషయం ఏంటి ? గిడియన్ కు లూసీ గురించి ఎలా తెలుసు ? ఆమె గతం, భవిష్యత్తు, సీరియల్ కిల్లర్ మధ్య ఉన్న సంబంధం ఏంటి ? అన్నది తెలుసుకోవడానికి సిరీస్ ను చూసి తీరాల్సిందే. ఒక్కో ఎపిసోడ్ తో ఈ మిస్టరీ మరింత మైండ్-బెండింగ్‌గా మారుతుంది. కాబట్టి డోంట్ మిస్.
Also Read : బాబోయ్ 23 ఏళ్లకు ఒకసారి వచ్చే దెయ్యం మళ్లీ వచ్చింది… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సినిమా
‘ది డెవిల్స్ అవర్’ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. జెస్సికా రైన్, పీటర్ కాపాల్డీ, నికేష్ పటేల్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఉదయం 3:33 గంటల చుట్టూ తిరిగే మిస్టరీతో పాటు టైమ్, డెజా వూ, సీరియల్ కిల్లర్ అంశాలను కలిపి కథను నడిపించారు. ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.