Horror Mystery Web Series on OTT : మరణం తర్వాత నిజంగా మరో ప్రపంచం ఉంటుందా ? చనిపోయిన వ్యక్తులు తమవాళ్లకు సంకేతాలు పంపగలరా ? ఇలాంటి ప్రశ్నల చుట్టూ అల్లుకున్న హారర్ మిస్టరీ వెబ్ సిరీస్‌నే ‘ది మిడ్‌నైట్ క్లబ్’ (The Midnight Club). ప్రముఖ హారర్ దర్శకుడు మైక్ ఫ్లానగన్ రూపొందించిన ఈ సిరీస్, భయపెట్టడమే కాదు… జీవితం, మరణం, స్నేహం, ఆశల గురించి కూడా భావోద్వేగంగా చెబుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో హారర్, మిస్టరీ, సూపర్‌న్యాచురల్ అంశాలు ఆసక్తిని పెంచుతాయి. మరి ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
1994 నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది. ఇలోంకా అనే తెలివైన యువతి థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ, చికిత్సకు అవకాశాలు లేకపోవడంతో ‘బ్రైట్‌క్లిఫ్ హోస్పీస్’ అనే ప్రత్యేక ఆశ్రమంలో చేరుతుంది. అక్కడ ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న మరో ఏడుగురు టీనేజర్లు కూడా ఉంటారు. తమకు మిగిలిన జీవితాన్ని భయంతో కాకుండా ధైర్యంగా గడపాలని నిర్ణయించుకున్న వీరంతా ప్రతిరోజూ అర్థరాత్రి పాత లైబ్రరీలో రహస్యంగా కలుసుకుంటూ భయంకరమైన కథలు చెప్పుకుంటారు. అందుకే తమ గ్రూప్‌కు ‘ది మిడ్‌నైట్ క్లబ్’ అనే పేరు పెట్టుకుంటారు.
ఒక రోజు వీరంతా ఓ విచిత్రమైన ఒప్పందం చేసుకుంటారు. తమలో ఎవరైనా ముందుగా చనిపోతే, మరణం తర్వాత కూడా మిగిలిన వారికి ఏదో ఒక సంకేతం పంపాలని నిర్ణయించుకుంటారు. మొదట సరదాగా మొదలైన ఈ ఒప్పందం కొద్ది రోజుల్లోనే భయంకరమైన మలుపు తిరుగుతుంది. ఆశ్రమంలో వింత నీడలు కనిపించడం, తెలియని శబ్దాలు వినిపించడం, విచిత్ర సంఘటనలు జరగడం మొదలవుతాయి. దీంతో ఇలోంకా ఆ భవనం గతం గురించి అన్వేషించడం ప్రారంభిస్తుంది.
దర్యాప్తులో బ్రైట్‌క్లిఫ్‌కు 1940లలో ‘పారాగాన్’ అనే రహస్య కల్ట్‌తో సంబంధం ఉందని తెలుస్తుంది. అమరత్వం కోసం ఆ కల్ట్ అక్కడ క్షుద్రపూజలు, నరబలులు నిర్వహించిందనే ఆధారాలు బయటపడతాయి. ఇదే సమయంలో క్లబ్ సభ్యుల్లో ఒకరైన అన్యా మరణించిన తర్వాత, ఆమె నిజంగానే సంకేతాలు పంపుతున్నట్లు మిగిలిన వారికి అనిపిస్తుంది. ఇలోంకాను శాస్తా అనే మహిళ మోసం చేసి, మళ్లీ ఆ పాత క్షుద్రపూజను నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే చివరి క్షణంలో డాక్టర్ స్టాంటన్ అడ్డుకోవడంతో పరిస్థితి మారుతుంది. డాక్టర్ స్టాంటన్ మెడపై ‘పారాగాన్’ కల్ట్‌కు చెందిన టాటూ ఎందుకు ఉంది? ఆమెకు ఆ రహస్య ముఠాతో ఉన్న సంబంధం ఏమిటి ? చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుందా ? లేక ఇవన్నీ భ్రమలా ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
Also Read : 18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్
ఈ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్‌లో క్లబ్ సభ్యులు చెప్పే హర్రర్ కథలు, బ్రైట్‌క్లిఫ్ రహస్యాలు, చివరి వరకు కొనసాగించే మిస్టరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరణాన్ని ఎదుర్కొంటున్న యువతీ యువకుల భావోద్వేగాలు హైలెట్. మొదటి ఎపిసోడ్‌లోనే 21 జంప్ స్కేర్స్ ఉండటంతో ఈ సిరీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. సిరీస్ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. హారర్‌తో పాటు మిస్టరీ, సూపర్‌న్యాచురల్ అంశాలు, భావోద్వేగ కథలు ఇష్టపడేవారు మస్ట్ వాచ్. భయపెట్టే సన్నివేశాల కంటే కథలోని రహస్యాలు, పాత్రల భావోద్వేగ ప్రయాణం ఎక్కువగా ఆకట్టుకుంటాయి. మైక్ ఫ్లానగన్ రూపొందించిన ఇతర హారర్ సిరీస్‌లు నచ్చిన వారికి ఇది కూడా తప్పకుండా నచ్చే వెబ్ సిరీస్ అవుతుంది.