Mike Tyson Documentary OTT : బాక్సింగ్ గురించి తెలిసిన వారికి మైక్ టైసన్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థిని క్షణాల్లో కంగారు పెట్టే పంచ్ లు, రింగ్ లో ఆయన చూపించిన దూకుడు, చిన్న వయసులోనే సాధించిన ప్రపంచ ఖ్యాతి… ఇవన్నీ టైసన్ ను క్రీడా ప్రపంచంలో ఓ సంచలనంగా నిలబెట్టాయి. అయితే ఆ విజయాల వెనుక ఆయన జీవితంలో ఎన్నో చీకటి అధ్యాయాలు కూడా ఉన్నాయి. పేదరికంలో గడిచిన బాల్యం నుంచి ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఎదగడం, వ్యక్తిగత వివాదాలు, మాదకద్రవ్యాల సమస్యలు, జైలు జీవితం వరకు సాగిన ఆ ప్రయాణాన్ని చూపించే నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్ టైసన్ (TYSON). మరి టైసన్ అభిమానులు ఈ డాక్యుమెంటరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
ఇది కల్పిత కథ కాదు. మైక్ టైసన్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, ఆయన ఎదుగుదల, విజయాలు, తప్పిదాలు, వాటి ప్రభావాలను పరిశీలించే బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ. న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో కష్టాల మధ్య పెరిగిన బాలుడు ఎలా ప్రపంచ బాక్సింగ్ లో అత్యంత భయంకరమైన ప్రత్యర్థుల్లో ఒకడిగా మారాడన్నది ఇందులో కీలకమైన అంశం. చిన్నతనంలో ఎదురైన సమస్యలు, నేరాల వైపు వెళ్లే ప్రమాదం, ఆ దశలో ఆయన జీవితంలోకి వచ్చిన శిక్షకుడు కస్ డి అమాటో పాత్రను కూడా ఈ సిరీస్ లో చూపించారు.
టైసన్ కు కేవలం బాక్సింగ్ నేర్పడమే కాకుండా, ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కస్ కీలక పాత్ర పోషించాడు. ఆ మార్గదర్శకత్వంతో టైసన్ వేగంగా ఎదిగాడు. అతి చిన్న వయసులోనే హెవీ వెయిట్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి క్రీడా చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే విజయంతో పాటు వచ్చిన కీర్తి, డబ్బు, ప్రజల దృష్టి ఆయన జీవితాన్ని మరింత కష్టతరం చేశాయి.
రింగ్ బయట జరిగిన వివాదాలు, వ్యక్తిగత సంబంధాల్లో ఎదురైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మాదకద్రవ్యాల వ్యసనం, అత్యాచార కేసులో శిక్ష అనుభవించిన అంశాలు కూడా ఈ సిరీస్ లో చూపించారు. 1997లో ఇవాండర్ హోలీఫీల్డ్ (Evander Holyfield)తో జరిగిన పోరులో టైసన్ ప్రత్యర్థి చెవిని కొరికిన ఘటన ఆయన కెరీర్‌లో అత్యంత వివాదాస్పద సంఘటనల్లో ఒకటిగా నిలిచింది. టైసన్ తన జీవితంలోని ఈ సంఘటనలను ఇప్పుడు ఎలా చూస్తున్నారు, వాటి నుంచి ఏం నేర్చుకున్నారన్నది కూడా డాక్యుమెంటరీలో ఉంది. ప్రపంచాన్ని గెలిచిన క్రీడాకారుడు తన జీవితంలో ఎదురైన తప్పులు, పతనాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ? విజయాల వెనుక దాగిన వ్యక్తిగత సంఘర్షణలు ఆయనను ఎలా మార్చాయి ? అనేవి ఈ సిరీస్ లో ఆసక్తి రేపే అంశాలు.
Also Read : అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్
ఫ్లాయిడ్ రస్ (Floyd Russ) దర్శకత్వం వహించిన ఈ నాలుగు భాగాల డాక్యుమెంటరీ అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. క్రీడా చరిత్ర, ప్రముఖుల జీవితాల్లోని విజయాలు–వివాదాలు తెలుసుకోవాలనుకునే వారికి ఈ డాక్యుమెంటరీ మంచి ఆప్షన్.