ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మొదటి నుంచి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. దూకుడుగా ఉంటాడు. ముక్కుసూటిగా మాట్లాడుతాడు. తనకు ఏది సరైనదని అనిపిస్తే..అదే ఓపెన్‌గా చెప్పేస్తాడు. కొన్నిసార్లు పార్టీలైన్‌ను కూడా పట్టించుకోడు. తన వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రయార్టీ ఇస్తాడు. అతనిలోని ఆ వ్యక్తిత్వమే తనకు ఓ ప్రత్యేకతను ఆపాదించిపెట్టింది. ఆది నుంచి ఆయనది అదే దూకుడు. కానీ అంతా తానై పార్టీని తన చేతిలో పెట్టుకుని.. బీజేపీ అంటే తను.. తను అంటే బీజేపీ అనే లెవల్లో నిజామాబాద్ బీజేపీ రాజకీయాలను గంపగుత్తగా చేతిలో పెట్టుకున్న అర్వింద్‌కు ఇది మింగుడుపడటం లేదు.
రాకేశ్ ఫైర్ బ్రాండ్‌గా ఎదిగిపోవడం, రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగ్గ లీడర్‌గా గుర్తింపు పొందడం, అసెంబ్లీలో తన నియోజకవర్గం కోసం ప్రభుత్వాన్ని నిలదీసే వైనం.. ఇవన్నీ రాకేశ్‌రెడ్డికి మంచిపేరునే తెచ్చిపెట్టాయి. కానీ అర్వింద్ దగ్గర మాత్రం మంచి మార్కులు కాదు కదా.. మరింత చేటయ్యాడు రాకేశ్. వాస్తవానికి , అర్వింద్ కూడా తనదైన స్టైల్‌లో వెటకారాలు, వ్యంగ్యాలు, విమర్శలు, తిట్లు.. వీటితోనే ప్రత్యేకంగా ప్రజల నోళ్లలో నానాడు. మీడియాలో హైలెట్ అయ్యాడు. చాలాసార్లు హద్దులు మీరి మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. ఇవి పార్టీకి ఇబ్బందికరంగా కూడా మారాయి. అధిష్టానానికి తలవంపులు, తలనొప్పులు తెచ్చిపెట్టేవిగా కూడా ఉన్నాయి. కానీ దీనికి భిన్నం రాకేశ్‌రెడ్డి.
ఎక్కడా హద్దులు మీరకుండా పరిణతి చెందిన లీడర్‌గానే .. చెప్పే విషయాలను సూటిగా, ఘాటుగా, ఆవేశంగా చెప్పడంలో తన స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నారు. హిందూత్వం అంశంలో తప్ప అతిగా స్పందించిన దాఖలాలు లేవు. మొన్నటి బండి సంజయ్ కొడుకు కేసు విషయంలో కూడా అర్వింద్‌ది ఓ దారి, రాకేశ్‌ది మరోదారిలా సాగింది. రాకేశ్‌రెడ్డి.. ఈ కేసును లైట్‌గా తీసుకున్నాడు. ఇది ఇద్దరి ఇష్టపూర్వకంగానే జరిగిన సంఘటనగా.. ఆ తరువాత పొరపొచ్చాలతో, మనస్పర్దలతో విడిపోయిన కేసుగానే అభివర్ణించడంతో సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యాడు. అర్వింద్‌తో ఇది ఇంకా దూరం పెంచింది. చాలా రోజుల నుంచి వీరిద్దరికీ మాటలు లేవు. ఇప్పుడు ఇది మరింత అగాధాన్ని పెంచింది.
బండి సంజయ్ కొడుకు కేసును అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటే.. అతని మంత్రి పదవిని తొలగిస్తే.. అదే సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నాడు అర్వింద్. కానీ, ఇలా సొంత జిల్లాలోని తన ఆధీనంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే.. తన ఎత్తుగడకే గండి కొట్టేలా , తన వ్యూహాలనే బెడిసికొట్టేలా చేయడం మరింత ఇబ్బందికరంగా మారింది. అర్వింద్‌కు కవిత అంటే పడదు. కానీ, రాకేశ్ చాలా సార్లు కవిత ఉన్నతిని, ఆమె క్షేమాన్ని కోరుతూ కామెంట్లు చేశాడు. అర్వింద్ అగ్గిమీద గుగ్గిలమే అయ్యాడు. ఇవన్నీ రాకేశ్‌కు తెలిసినా.. డోంట్ కేర్ అన్నట్టుగానే తన శైలిలో తాను వెళ్తున్నాడు తప్ప… ఎక్కడా ఇంచుక మాత్రం వెనుక్కి తగ్గడం లేదు. ఇప్పుడు రాకేశ్‌రెడ్డి జిల్లా లీడర కాదు స్టేట్ లీడర్ అయి కూర్చున్నాడు. ఇది మరింత ఇబ్బందికరంగా మారింది అర్వింద్‌కు.
జిల్లా సెంట్రిక్ గా అంతా తన ఆధీనంలోనే రాజకీయాలు నడవాలని, తను చెప్పినట్టే ఎమ్మెల్యేలు వినాలనే నియంత మనస్తత్వం ఉన్న అర్వింద్‌కు ఇప్పుడు రాకేశ్ కొరకరాని కొయ్యగా మారాడు. ఇప్పట్నుంచే ఆర్మూర్‌కు వేరే అభ్యర్థిని కూడా వెతికి పెట్టుకునే పనిలో ఉన్నాడట అర్వింద్. అంటే ఎంతలా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందో దీన్ని బట్టి అర్థమవుతోంది. గతంలో కూడా రాకేశ్.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, తానే హోం మంత్రిని కాబోతున్నానని కూడా ప్రకటించుకున్నాడు. ఇది కూడా అర్వింద్‌లో విపరీత కోపానికి కారణమైంది.
ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల్లేవు.. మాట్లాడుకోవడాలు లేవు.. ఎవరి దారి వారిదే… ఎవరి పంథా వారిదే. ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో అర్వింద్‌కు చెక్ పెట్టే రేంజ్‌లో ఎదుగుతూ వస్తున్న నేత రాకేశ్‌రెడ్డే అని చెప్పాలి. బీజేపీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణను పూర్తిగా పార్టీకి దూరం పెట్టేసిన అర్వింద్.. ఇప్పుడు రాకేశ్‌ను అదే తీరులో ట్రీట్ చేస్తున్నాడు. ప్రెస్‌మీట్లకు పిలవడం లేదు. ఆర్మూర్‌లో ఎలాంటి కార్యక్రమాలున్నా పోవడం లేదు. ఇద్దరి మధ్య ఈ ప్రచ్చన్నయుద్దం రోజు రోజుకు ముదిరిపోతున్నది. అర్వింద్ తను చెప్పినట్టు వినని చాలా మంది లీడర్లను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు. అందులో ముత్యాల సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి..మీసాల శ్రీనివాస్.. ఇలా చాలా మంది లిస్టే ఉంది.