E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

షుగ‌ర్ లేనివాడేనూ మ‌నిషోయ్‌..! షుగ‌రుంటే సీఎంగా ప‌నికి రాడోయ్‌.. ! అంతేనా మైనంప‌ల్లి?

షుగ‌ర్ లేనివాడేనూ మ‌నిషోయ్‌..! షుగ‌రుంటే సీఎంగా ప‌నికి రాడోయ్‌.. ! అంతేనా మైనంప‌ల్లి?
Advertisement

నీకు షుగ‌రుంది. షుగ‌రుతో కూడిన పొగ‌రుంది! తిట్ల రాజ‌కీయంలో ఇప్పుడు రోగాన్ని క‌లిపి తిట్టే జ‌బ్బు కూడా వ‌చ్చింది నేత‌లకు కొత్త‌గా. తిండి క‌లిగితే కండ క‌ల‌దోయ్‌.. కండ‌క‌గిలిన వాడేనూ మ‌నిషోయ్‌..! అన్నాడు గుర‌జాడ అప్పారావు. మ‌న మైనంప‌ల్లి మాత్రం.. షుగ‌రు ఉంటే మ‌నిషే కాదోయ్‌..! అంటున్నాడు. అంతే కాదండోయ్‌.. అస‌లు షుగ‌రున్న లీడ‌రు సీఎం ఎలా కాగ‌లుగుతాడు..? అనే విధంగా కొత్త అర్థం వ‌చ్చేలా ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష కామెంటొక‌టి చేసి కొత్త చ‌ర్చ‌కు తెర లేపాడు కూడా. ఇప్పుడు నేను చెబుతున్న ఆ షుగ‌రు మనిషి కేటీఆర్‌. అదే.. మైనంప‌ల్లి ప‌రిభాష‌లో ఆ షుగ‌రుతో పాటు పొగ‌రున్న లీడ‌రు కేటీఆర్‌! పొగ‌రంటే.. అదేదో హీరో వ‌ర్షిప్ పొగ‌రు కాదండి బాబూ..! అహంకారం నిండిన అని అర్థం.. అదే హ‌న్మంత‌రావు ప‌రిభాష‌లో!

అస‌లు ఈ షుగ‌రు గోలేంది? అని కొత్త‌గా డిష్క‌ష‌న్ కూడా వ‌చ్చింది. అదేంటీ కేటీఆర్‌కు షుగ‌ర్ ఉందా? అని తెలియ‌ని చాలా మంది కొత్త విష‌యం తెలుసుకున్న‌ట్టుగా.. ముక్క‌న వేలేసుకుని.. దీనిపై ప్ర‌త్యేకంగా చ‌ర్చించ‌డం కూడా మొద‌లుపెట్టారు. అదేదో రేపో మాపో ప్రాణాలు పోయే జ‌బ్బు వ‌చ్చిన‌ట్టుగా! అయ్యో పాపం.. ఆయ‌న‌కు ఇంత చిన్న వ‌య‌స్సులో షుగ‌రొచ్చిందా? అని సానుభూతి నిండిన, ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌లిసిన హావాభావాలు తోడు రాగా.. రాష్ట్రంలో ఇప్పుడు దీని క‌న్నా ప్ర‌ధాన‌మైన చ‌ర్చ మ‌రొక‌టి లేద‌న్న‌ట్టుగా.

Advertisement

అవునూ.. షుగ‌ర్ కామ‌నే అయ్యిందిగా! వ‌య‌స్సు తో ప‌ని లేకుండా.. ముచ్చ‌ట‌గా మూడు ప‌దులు కూడా నిండ‌క ముందే.. దీనికి తోబుట్టువులా వ‌చ్చే బీపీని కూడా లైట్‌గానే తీసుకుంటున్నారుగా! మ‌రెందుకీ చ‌ర్చ‌… ర‌చ్చ‌. అది కేటీఆర్‌కు అని తెలిసిన‌ప్పుడే ఇదంతా జ‌రుగుతోంది. దీన్ని రివీల్ చేసింది మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు. మొన్న కేటీఆర్ మ‌ల్కాజిగిరి మీటింగుకు పోయి… ఇండైరెక్టుగా మైనంప‌ల్లి కి స‌వాల్ విసిరిండంట‌. రౌడీయిజం చేస్తున్నావ్ బిడ్డా.. నేను ఈడ‌నే అల్వాల్‌లో ఉంటా.. నీ సంగ‌తి చూస్తా..! అని బెదిరించి పోయిండంట‌. దీంతో తిక్క‌రేగిన మైనంప‌ల్లి తోక తొక్కిన తాచులా క‌స్సున లేచి ఇలా రంకెలేసి పోయిండంట‌.

కాక‌పోతే త‌న తిట్లు.. బెదిరింపులు.. తొడ‌లు చ‌రుచుడు.. బాల‌య్య బాబు డైలాగుల‌కు తోడు.. కేటీఆర్ నీకు షుగ‌రుంది…! అని ప‌దే ప‌దే ఆ ప్రెస్‌మీట్లో మాట్లాడాడు. ఇదీ అస‌లు ముచ్చ‌ట‌. దీని వెనుక మైనంప‌ల్లి మ‌ర్మ‌మేమై ఉంటుందా? అని పెద్ద‌గా, లోతుగా ఆలోచించాల్సి అవ‌స‌ర‌మేమీ లేదు. షుగ‌రున్న నేత అని తెలంగాణ జాతికి , దేశానికి తెలియ‌జెప్పాల‌ని అత‌గాడి ఫీలింగు.

Advertisement

తెలిస్తే ఏమిట‌ట‌…? అలా తెలియ‌జెప్ప‌డం మూలంగా.. కేటీఆర్‌ను మాన‌సికంగా ఇబ్బంది పెట్ట‌డం ద్వారా రాజకీయంగా త‌న క‌సి తీర్చుకున్న‌ట్టుగా మైనంప‌ల్లి భావించి ఉంటాడు. ఇప్పుడు మైనంప‌ల్లి బ‌య‌ట‌పెట్టేదేంటీ? ఎప్పుడో కేటీయారే చెప్పాడు క‌దా! నాకు షుగ‌రుంది అని. అవున‌నుకో. కానీ అది ఓ మీటింగుకే ప‌రిమిత‌మైంది. ఎక్కువ‌గా ఎవ‌రికీ తెలియ‌లేదు. తెలిసినా కొంద‌రు మ‌రిచిపోయారు.

ఇప్పుడు కేటీఆర్ మంచి జోష్ మీదున్న‌డు. ఇక మా ప్ర‌భుత్వ‌మే రాబోతుంద‌నుకుంటున్నాడు. ఆ వెంట‌నే కేసీఆర్ త‌న‌నే సీఎం చేస్తాడ‌ని క‌ల‌లు కంటున్నాడు. అందుకే ఈ ఉత్సాహం మీద నీళ్లు పోసేందుకు.. బాడీ షేమింగ్‌కు మించి ఇబ్బంది పెట్టేందుకు ఈ కొత్త తిట్టును క‌నుగొన్నాడు. షుగరున్నోడా..! అని.

అంతేకాదు.. నీకు షుగ‌రే ఉంది.. నువ్వేం రాజ‌కీయాల‌కు ప‌నికి వ‌స్తావ్‌.. పైగా సీఎంగా కూడానా? నీకంత సీన్ లేదోయ్..! అని వెట‌కారంతో కూడిన విమ‌ర్శ చేశాడ‌న్న‌మాట‌. పాద‌యాత్ర చేయ‌రా బై.. షుగ‌ర్ త‌గ్గుత‌ది.. ఒక్క జాప‌డ్ కొడితే మూడు చుట్లు గిర్రున తిరిగి ప‌డ‌తావ్‌.. ముందే నీకు షుగ‌రుంది! ఇగో ఇలా.. మాట‌కు ముందు.. డైలాగుకు చివ‌ర‌.. నీకు షుగ‌రుందిరో.. అని చెప్ప‌డ‌మే మైనంప‌ల్లి కొత్త మ‌ర్మం.

అవునూ.. షుగ‌రు లేని లీడ‌రు.. బీపీలు ద‌రిచేర‌ని జ‌ర్న‌లిస్టులు.. ఎంత మంది ఉన్నారంటావు..? నీది మ‌రీ అతి కాక‌పోతే..! ఓసారి లీడ‌ర్లంద‌రికీ షుగ‌ర్ టెస్టు చేసే మెడిక‌ల్ క్యాంపొక‌టి.. అసెంబ్లీలో పెట్ట‌రాదు..! నీ చాద‌స్తం చ‌ల్ల‌గుండ మైనంప‌ల్లి..!

Related News

బొగ్గు మాఫియానే డీటీవో వెంక‌న్నను బ‌లితీసుకుందా? మ‌రి బీఆరెస్ ప‌దేళ్లూ ఏం చేసింది?

పంట కొనుగోళ్ల పై పచ్చి అబద్ధాలు! రైతు కేంద్రంగా రాజకీయాలు!

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..!? హ‌రీశ్ నిన్నే…!

బండి భ‌గీరథ్‌ను వ‌ద‌ల‌ని బీఆరెస్‌! బెయిల్ మంజూరైనా… అది రేవంత్ వ‌ల్లేన‌ట‌!

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!

వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!

Big Stories

×