తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబం మొత్తం కలిసి ఢిల్లీ వెళ్లి సోనియాకు కృతజ్జతలు చెప్పారు. పిల్లలతో సహా వెళ్లారు. తెలంగాణ రావడానికి సోనియానే కారణం.. ఆమెకు ఈ విధంగా తమ కుటుంబం మొత్తం కృతజ్ఞతగా ఉంటుందని కేసీఆర్ అన్నాడు అప్పట్లో. పలు వేదికల మీద.. అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన సోనియా గాంధీ పేరును గుర్తు చేశారు.
ఎవరు ఒప్పుకున్నా.. ఎవరు కాదన్నా.. తెలంగాణ రావడానికి ఒక్క సోనియా గాంధే కారణమని, ఆమె పేరు తెలంగాణ చరిత్ర పుటల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుందని కూడా రికార్డెడ్‌గానే చెప్పాడు. అయితే తెలంగాణ ఇచ్చిన వెంటనే టీఆరెస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాననే లీకులు ఇచ్చాడు కేసీఆర్.
అప్పటికే ఓసారి .. అంటే 2009లో తెలంగాణ పై ప్రకటన చేసి వెనక్కి తగ్గింది కేంద్రంలోని కాంగ్రెస్. దీంతో ఇప్పుడు రాకపోతే మళ్లెప్పుడూ ఇక తెలంగాణ రాదు అనే అభిప్రాయానికి తెలంగాణ నేతలు వచ్చారు. అప్పుడు జయశంకర్ సార్ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్‌ను నమ్మేవాడు కాదు. చాలా వేదికల మీద బహిరంగంగానే చెబుతుండే.. తెలంగాణలోని మూడు తరాలను నాశనం చేసి చరిత్ర కాంగ్రెస్‌దని.
అయితే అప్పటి పొలిటికల్ వ్యూహం మేరకు కేసీఆర్.. సోనియాతో తన పార్టీ విలీనంపై ప్రతిపాదన చేశాడు. కానీ కాంగ్రెస్ నుంచి ఈ ప్రతిపాదన రాలేదు. కేసీఆరే ఆశపెట్టినట్టుగా కేంద్రాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే క్రమంలో ఎత్తుగడగా దీన్నిప్రయోగించాడు. అయితే.. 2014లో తెలంగాణ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడింది. కానీ అప్పటికి జయశంకర్ సార్ చనిపోయి మూడేండ్లవుతున్నది.
కానీ ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయి కేసీఆర్. అందుకే సోనియాకు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వచ్చారే తప్ప.. అంతకు ముందు తను పెట్టిన విలీనం ప్రతిపాదన పై మాత్రం దాటవేశాడు కేసీఆర్. సోనియా కూడా ఈ విషయంలో ఏం మాట్లాడలేదు. అప్పటికే టీఆరెస్ హవా కొనసాగుతోంది. తాము వెళ్లి కాంగ్రెస్‌లో విలీనం కావడమెందుకు..? ఏకంగా సీఎంగానే కొనసాగుదామని కేసీఆర్ ఆ వైపున ఆలోచనలు చేశాడు.
దీంతో అంతకు ముందు ఉద్యమ సమయంలో చాలా సార్లు చెబుతూ వచ్చిన దళిత సీఎం.. అనే హామీకి కూడా నీళ్లొదిలాడు కేసీఆర్. తనే సీఎం అయ్యాడు. రెండు సార్లు. మూడోసారి ఓడాడు. ఆలోపుగానే కేటీఆర్‌ను కూడా సీఎం చేయాలనుకున్నాడు. కుదరలేదు. ఇప్పుడు కేసీఆర్ ముందున్నది కేటీఆర్‌ను సీఎం చేయడమేననే ఒకే ఒక సంకల్పం అంతే.
ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకంటే.. ఇవాళ ఈ ముచ్చట ఇండైరెక్టుగా కేటీఆరే చెప్పాడు. స్వయంపాలనే మనకు కావాలని, ఢిల్లీకి గులాములుగా ఉండరాదని జయశంకర్ సార్ చెప్పేవాడని అందుకే తాము కాంగ్రెస్‌ను నమ్మలేదన్నాడు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి మూడేండ్లలోపే 75 సార్లు ఢిల్లీకి వెళ్లాడనే విషయాన్నీ ఇక్కడ ప్రస్తావించాడు కేటీఆర్.