బొద్దింకల పార్టీ మంచి నిర్ణయం తీసుకున్నది. పొలిటికల్ పార్టీగా మారేందుకు ఇష్టపడటం లేదు. ఇదే కరెక్టు. మరి రాజకీయ పార్టీగా మారకపోతే.. ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటే.. చట్టసభల్లో ఎలా ప్రభావం చూపగలగుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ ఇప్పటికిప్పుడు కాక్రోచ్ పార్టీ .. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినా ఓట్ల వేటలో ఘోరంగా ఓడిపోవచ్చు. అప్పటి దాకా వారిని ఆకానికెత్తిన యువతే వీరికి ఓట్లు వేయకపోవచ్చు.
అంతిమంగా ఇక్కడ బలంగా ఉన్న సంప్రదాయ, జాతీయ పార్టీల బలానికి బొద్దింకలు చెల్లాచెదురు అయిపోవచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వారి మాటలను బట్టి చూస్తే ఒక్కటే అర్థమవుతోంది. జాతీయ రాజకీయాల్లో కింగులు కాలేకపోయినా.. కింగ్ మేకర్లుగా మాత్రం కీ రోల్ పోషిస్తాం. పాలకులకు కీ ఇచ్చే కీలక పాత్రగా ఉంటాం.. అనే తీరులో వారి మాటలున్నాయి.
అంటే ఇప్పుడున్న ఎన్‌డీఏకు ఈ జెన్‌జీ వ్యతిరేకమనే విషయాన్ని చెప్పకనే చెప్పారు వారంతా. జంతర్ మంతర్ వద్ద అన్ని రోజుల పాటు ఆందోళన చేస్తే గానీ కేంద్రం దిగి రాలేదు. అది కూడా పాశవికంగా విద్యార్ధులపై దాడి చేసిన తరువాత. ఉద్యమాన్ని ఉగ్రవాదులతో పోల్చి మరక వేసే ప్రయత్నం చేసి ..జెన్‌జీ అంటే వారికో లక్ష్యం ఉండదు.. దేశ భద్రతకు వీరి వల్ల ముప్పు వాటిల్లుతుందనే విధంగా అక్కడి వాతావరణాన్ని తయారు చేసిన కేంద్రం పట్ల ఈ సీజేపీకి ఇంకా పీకల్లోతు కోపమైతే ఉంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే కేంద్రం పాపాలన్నీ కడిగేసుకున్నట్టు కాదనే భావనలో బొద్దింకల పార్టీ ఉంది. ఇంకా పాలసీ అంశాలు చాలానే వెలికి తీసి తదనంతరం వరుసగా ఉద్యమాలు నిర్మించాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. అందుకే ప్రజలు ఏమనుకుంటన్నారో తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా నేషనల్ లిజనింగ్ టూర్ పెట్టుకున్నారు. దీని ద్వారా లోకల్ వారీగా ఇష్యూలపై కూడా ఇకపై ఫోకస్ పెడతారన్నమాట.
రెండు రోజుల పాటు మహారాష్ట్రలో జరిగిన మీటింగు అనంతరం వీరు మాట్లాడిన మాటను బట్టి.. వచ్చేసారి కేంద్రంలో యూపీఏ సర్కార్ ఉండేలా వారికి పరోక్ష మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులపై లాఠీ చార్జి జరిగిన తరువాత రాహుల్ వెంటనే రంగంలోకి దిగడం.. మోడీ ఇంటిని ముట్టడి చేసే క్రమంలో జెన్‌జీకి సమానంగా కాంగ్రెస్ కూడా పోరాటంలో ఉందనే భావన రావడం కూడా కాక్రోచులకు ఇండి కూటమిపై గురి కుదిరింది.
దీంతో మున్ముందు కేంద్రం పాలసీలపై ఒక్కొక్కటిగా నిలదీసేందుకు రెడీ అవుతున్నది బొద్దింకల పార్టీ. అయితే ప్రతీ దానికి రాజీనామా అనే అస్త్రం తీసుకుంటే దీని సీరియస్‌నెస్ పోతుంది. అందుకే సమస్యను లేవనెత్తడం, ప్రశ్నించడం.. దానికి పరిష్కారం దొరికే వరకు పోరాటమే లక్ష్యంగా జెన్‌జీ ఇకపై పోరాటాలు నిర్మించే అవకాశం కనిపిస్తున్నది.
భవిష్యత్‌లో సీజేపీ ఏ ఉద్యమాలు చేసినా దీనికి కాంగ్రెస్ కూడా తోడు రానుంది. అయితే పార్టీ ముద్ర పడినా కూడా కాక్రోచులు తమకు మద్దతిచ్చే ఏ ఒక్కరినీ దూరం చేసుకోవాలనుకోవడం లేదు.