తెలంగాణ రాజకీయాలే కాదు.. ఏపీ రాజకీయాలు కూడా పెరిగిన ఉష్టోగ్రతలతో పోటీ పడుతున్నాయి. ఇవాళ జగన్‌కు తిక్కరేగింది. చంద్రబాబు వేదిక ఏదెక్కినా.. గొడ్డలి పార్టీ.. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్ సీపీని తెగ ర్యాగింగ్ చేస్తున్నాడు. ఇక ఓపిక నశించినట్టుంది. పెద్ద చిట్టా పట్టుకు వచ్చాడు. ప్రెస్‌మీట్ పెట్టాడు. ఏపీ రాజకీయ చరిత్ర తిరగదోడాడు. తాతా రాజారెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టి…హరిక్రిష్ణ అంత్యక్రియల వరకు.. తన తండ్రి మరణం అనుమానస్పదమేనన్న పాయింట్ నుంచి ఇప్పుడు జరుగుతున్న కక్ష, హత్యా రాజకీయాల వరకు దేన్నీ వదల్లేదు.. ఎన్టీఆర్ టీడీపీ నుంచి బాబుగోరి టీడీపీ చరిత్ర అంతా మళ్లోసారి జ్ఞాపకం తెచ్చాడు.
దేని కోసమిదంతా.. అంటే తన పార్టీని గొడ్డలి పార్టీ అని బాబుగారు సంబోధించడమే ఆయన కోపం నశాళానికి అంటడానికి కారణమైనట్టుంది. మొదట అవినీతి గురించి మాట్లాడాడు. ఏపీ సచివాలయానికి కట్టే ఐదు బిల్డింగులు, అసెంబ్లీ బిల్డింగులకు అయ్యే ఖర్చెంత..? బాబుగారు ఎందుకు ఇంత ధనాన్ని వెచ్చిస్తున్నారు? కాంట్రాక్టర్లకు ఇంతలా ఎందుకు దోచిపెడుతున్నారు? అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి.. ఇక ఏపీ రాజకీయ చరిత్రను తవ్వే పనిని ఏకధాటిగా మొదలు పెట్టాడు. గొడ్డలి పార్టీ అంటున్న చంద్రబాబు.. తన తాత రాజారెడ్డిని గొడ్డళ్లతో హత్య చేసింది టీడీపీనే అని ఆరోపించారు. మీది గొడ్డలి పార్టీ కాబట్టే..పదే పదే మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు.
తన బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపినోడే స్వయంగా బయటకు వచ్చి చెప్పినా.. బాజాప్తా అతడిప్పుడు కార్లలో తిరుగుతున్నాడని, దీనికి మీ పార్టీ సపోర్టు చేయడం లేదా? అని నిలదీశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై ఇంకా అనుమానాలు నివృత్తి కాలేదని, ఈ సంఘటనకు ముందు జరిగినన అసెంబ్లీ సమావేశంలో .. ఎలా నువ్వు తిరిగి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతావో చేస్తానన్న బాబుగారి మాటలను కోట్ చేయడం.. చర్చకు తెరతీసింది. బాధితులంతా మా కుటుంబం వాళ్లైతే మమ్మల్ని పట్టుకుని గొడ్డలి పార్టీ అని, గన్ కల్చర్ అని, శవ రాజకీయాలని అంటున్నాడని ఎద్దేవా చేశాడు జగన్.
చంద్రబాబు బావమరిది, సినీ హీరో బాలక్రిష్ణ తన ఇంట్లో కాల్పులు జరిపి ఇద్దరిని చంపింది గుర్తు లేదా? గన్ కల్చర్ మీదా మాదా? అని అప్పటి సంఘటనను గుర్తు చేశాడాయన.ఈ కేసులో సాక్షంగా ఉన్న వాచ్‌మెన్‌ను తలపై మోది హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు జగన్. అంతే కాదు..హరిక్రిష్ణ అంత్యక్రియలకు హాజరై.. అక్కడే ఉన్న కేటీఆర్‌తో రాజకీయ పార్టీల పొత్తుల గురించి చర్చించింది నువ్వు కాదా? అంటూ.. ఇది కాదా శవరాజకీయం అని ప్రశ్నించాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, ఆయన గుర్తును దోచుకున్న దొంగ చంద్రబాబు అని తిట్టిపోశాడు జగన్.
చంద్రబాబువి పక్కా క్రిమినల్ ఆలోచనలని, ఆయన రాజకీయ చరిత్ర మొత్తం తరిచి చూస్తే మొత్తం అవే గురుతులుంటాయని విమర్శించారు. ఇప్పటికీ అదే మెంటాలిటితో తమ పార్టీ నేతలను వెంటాడుతున్నడన్నారు. వైఎస్సాఆర్సీ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, యూనివర్సిటీ యాక్టివిస్టులు, సానుభూతిపరులు.. ఎవరినీ ఏపీ సర్కార్ వదలడం లేదని అందరిపై అక్రమ కేసులు పెడుతూ జైళ్లలోకి పంపుతున్నదన్నారు. ఏపీలో ఏదైనా సమస్య వస్తే జనం దృష్టిని పక్కదారి పట్టించేందుకు, డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్లే చేస్తారని విమర్శించారు. దీనికి మీడియా చానెళ్లు, పేపర్లు కూడా బాబుకు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు.