భారత్ ఫ్యూచర్ సిటీని ఎదగనీయొద్దనేది బీఆరెస్ పంతం. తను సీఎంగా ఉన్న సమయంలోనే ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్‌చేసి తనదైన ముద్ర వేసుకోవాలని రేవంత్ పట్టు. ఇద్దరి రాజకీయాలు కలిసి కొద్దిరోజుల పాటు ఫ్యూచర్ సిటీపై గందరగోళాన్ని సృష్టించాయి.
ఆ ప్రాంతంలో ఫార్మా సిటీ నిర్మించాలని, దీని కోసమే భూములు తీసుకున్నామని, చట్టబద్దంగా ఇక్కడి ఫార్మా కంపెనీలను తరలించాలని బీఆరెస్ వాదిస్తోంది. ఇక్కడ ఫార్మా కంపెనీలు వస్తే కలుషితమైన ప్రాంతంగా మారుతుందని, బీఆరెస్ సేకరికంచిన భూములకు అదనంగా రెండింతలు సేకరికంచి.. దాన్ని ఫ్యూచర్ సిటీగా నిర్మాణం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్.
ఇది ఎప్పటికీ చెల్లుబాటు కాదు.. ఇక్కడ పెట్టుబడులు పెట్టకండి.. మేము వచ్చిన వెంటనే వందకు వంద శాతం ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరుతామని బీఆరెస్ శపథం పూనింది. మీరే ఓ రద్దైన నోటు లాంటి వాళ్లు.. మీ మాటెవడింటాడు..? అవేం పట్టించుకోవద్దు..! అని రేవంత్ పిలుపునిచ్చాడు.
నీకే ఫ్యూచర్ లేదంటే.. నువ్వో ఫ్యూచర్ సిటీ కడుతున్నావా? నవ్విపోదురు గాక..!అని బీఆరెస్ వేళాకోళం చేసింది. దీన్ని అడ్డుకుంటే వంగబెట్టి తన్నండి.. !అని రేవంత్ అక్కడి ప్రజలకు సూచన చేశాడు.
ఈ భూములు చట్టబద్దంగా ఫార్మా కంపెనీలు పెట్టేందుకే.. ఆ విషయాన్ని రేవంత్ సర్కార్ కూడా హైకోర్టుకు విన్నవించింది. మీరు పెట్టుబడులు పెట్టి.. చట్టపరంగా ఇందులో ఇరుక్కుపోకండి.. ! అని బీఆరెస్ ఇరకాటంలో పెట్టేలా కామెంట్లు చేసింది. ఎప్పుడూ ఇలా అడ్డుకునే వారుంటూనే ఉంటారు.. దేశానికే ఈ ఫ్యూచర్ సిటీని రోల్‌మోడల్‌గా నిలిపి చూపిస్తా.. ! అని అదే పంతం, పట్టుదల మీదున్నాడు రేవంత్.
ఇదంతా గత కొంతకాలంగా సాగుతున్న వివాదం. ఫ్యూచర్ సిటీపై ఒకరిపై మరొకరు చేసుకున్న పొలిటికల్ కామెంట్లు, సెటైర్లు. చివరకు ఇది ఎలా తయారయ్యిందంటే.. బీఆరెస్ దీన్ని ముందు పడనిచ్చేలా లేదుగా.. ! వామ్మో మళ్లీ వాళ్లే వచ్చేలా ఉన్నారు.. వస్తే దీన్ని రద్దు చేస్తారేమో..!అని అనుమానాలు క్రియేట్ చేయడంలో చాలా వరకు సక్సెసయ్యింది బీఆరెస్. కానీ బీఆరెస్ చేతలకు, రద్దు మాటలకు .. తమ చేతల ద్వారానే సమాధానం ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ సర్కార్.
అమెజాన్‌తో భారీపెట్టుడులకు ఒప్పందం కుదుర్చుకున్నది. కావాల్సిన సౌకర్యాలు కల్పించింది. భూములిచ్చింది. ఇవాళ దీనికి ఫ్యూచర్ సిటీలో అంకురార్పణ జరిగింది. రేవంత్ అన్నట్టుగా.. ఒర్రెటోళ్లు ఒర్లతనే ఉంటరు.. మనం చేసుకుంటూ పోవాలె.. అంతే! ఇప్పుడు సర్కార్ కూడా అదే చేస్తోంది.
రద్దు అనే పదాన్ని పదే పదే ప్రయోగించడం ద్వారా పెట్టుబడి దారుల్లో భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేసి.. రేవంత్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టి.. ఈ ప్రాజెక్టును ముందుకు పోకుండా అడ్డుకట్ట వేసి.. ఓ రకమైన పైశాచికానందం పొందాలని బీఆరెస్ చూసింది. కేసీఆర్ మొదలు.. కేటీఆర్, హరీశ్.. ఈ ముగ్గురూ దీనిపై ఇవే మాటలన్నారు పదే పదే. దీంతో జనాలకు కూడా దీనిపై అనుమానాలను క్రియేట్ చేయగలిగారు.
కానీ ..పెట్టుబడులను ఆకర్షించి, భారీ కంపెనీలను రప్పించి.. వాటికి కార్యరూపం ఇచ్చే విషయంలో భారీ కదలిక తెచ్చిన రేవంత్.. ఒక్క దెబ్బతో అందరికీ సమాధానమిచ్చాడు. అనుమానాలన్నీ నివృత్తి చేశాడు. రద్దు నోళ్లకు తాళం వేశాడు. పెట్టుబడిదారుల్లో ఉన్న కంగాళీని కనుమరుగు చేశాడు.