తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! సమకాలీన రాజకీయ పరిస్థితులకు అన్వయిస్తూ ఇది కొంచెం మార్చి చెప్పాలి ఇప్పుడు. తప్పించుకు తిరుగువాడు కేటీఆర్ సుమతి!అని. అవును..కొండంత రాగం తీసి.. ఏదో పాట పాడినట్టు.. కేటీఆర్ తోకముడస్తున్నాడీ మధ్య. మాటల్లో స్పష్టత లేదు. జంకు బొంకు లేకుండా వచ్చే ధైర్యవచనాలు కావవి. అధికార పార్టీ విసిరే ఛాలెంజ్‌లను స్వీకరిస్తున్నా అనే చెప్పేం ధైర్యం కొరవడింది. ఎందుకో కేటీఆర్ భయపడుతున్నాడు.
అంతా కేసీఆర్ రావాలంటున్నారు.. మనమే వస్తున్నాం.. ఇగో నీకు హోం మినిష్టర్..ఇగో నీకు ఇది .. అని తన భజన బ్యాచుకు మంత్రుల శాఖలు పంచే పనిలో బిజీగా ఉన్న నేత ఎందుకు ఇంతలా భయపడుతున్నాడు. మీకు విషయం అర్థం కాలేదా? అయితే కొంచెం వివరంగా చెబుతా. మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓ సవాల్ విసిరాడు. ఏమని? హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇంటిని కూడా స్టార్ట్ చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నావు కదా! ఈ సర్కార్‌కు ఇంకా మిగిలి ఉన్న రెండున్నరేండ్లలో మీరు పదేళ్ల కాలంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూంలకు మించి.. ఇంకా ఎక్కువే కట్టి చూపిస్తాం.. ఇదే నా సవాల్! ఒకవేళ నేను అలా చేయకపోతే ఎమ్మెల్యేకు పోటీచేయను.. మరి నువ్వు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటావా? అని సవాల్ విసిరాడు.
దీనికి కేటీఆర్ స్పందించిన తీరు.. నవ్వుకునేలా ఉంది. ఒకవేళ గవర్నమెంటుకు అంత సీన్ లేదని అతను భావిస్తే.. అసలు సర్కార్ మీదే నమ్మకం లేకపోతే.. సరే నేను రెడీ కాసుకో..! అని ఛాతి విరుచుకుని మరీ సవాల్‌ను స్వీకరించాల్సింది. కానీ, అలా చేయకుండా.. మేం కట్టిన ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానమని కొత్త రాగమందుకున్నాడు. అంటే ఆయన లెక్క ప్రకారం.. మేము లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాం కాబట్టి.. మీరు ఏడు లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే డిమాండ్ కావొచ్చు. కానీ అది కూడా ఇతమిత్థంగా చెప్పలేకపోయాడు. గతంలో మీరు మొత్తం 20 లక్ష ఇండ్లు కడతామన్నారు కదా..! అవి కట్టండని పాత విషయాన్ని వల్లెవేశాడు.
అంటే తాను పొంగులేటి సవాల్‌ను స్వీకరించేందుకు రెడీగా లేడని చెప్పకనే చెప్పాడన్నమాట. అంటే.. ప్రభుత్వం హైదరాబాద్ లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతుందని ఆయనే సర్టిఫికెట్ ఇచ్చేశాడు. సవాల్‌ను స్వీకరించడకుండా. ఇక ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఏమని? రైతు డిస్కంపై చర్చ జరుగుతున్న సమయంలో .. సర్కార్‌పై బీఆరెస్ ఓ ప్రచారం చేసింది. ఆ పార్టీ నుంచి మూడు గంటల కరెంటు చాలనే ప్రతిపాదన వచ్చిందని, ఇది సీఎం మనోగతంగానే భావించాల్సి ఉంటుందని, గతంలో కూడా ఆయన అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదాలో రైతులకు మూడు గంటల కరెంటు చాలు అనే పాత వీడియోను తిప్పి తెగవైరల్ చేశారు.
రైతు డిస్కం పేరుతో రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించనున్నారనే ప్రచారం కూడా జోరుగా చేస్తున్నారు. ఈ రెండు ప్రచారాలపై సీఎం తీవ్రంగా రియాక్టయ్యాడు. ఎంతలా అంటే.. మేము రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వలేకపోయినా.. మోటార్లకు మీటర్లు బిగించినా.. ఎన్నికల్లో నేను పోటీ చేయను.. రైతులకు ఇరవై నాలుగ్గంటల ఉచిత కరెంటు ఇచ్చి, మోటార్లకు మీటర్లు బిగించకపోతే.. మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా? అని నేరుగా సవాల్ విసిరారు.
దీనిపై ఇవాళ కేటీఆర్ స్పందించాడు. స్పందించాడు అంటే.. అది స్పందన కాదు.. సవాల్ స్వీకరించినట్టూ కాదు. ధైర్యంగా బరిలోకి దిగి రా చూస్కుందామనే వీరోచిత పలుకులూ కావు. అటూ ఇటూ కానీ స్పందన అది. ఎలా ఉందంటే.. అసలు విషయం పక్కకు పెట్టి మీ ఆరు గ్యారెంటీలు ఏమమయ్యాయి? 420 హామీలు ఏమయ్యాయి. ముందు వాటిని తీర్చండి అని పాత చింతకాయ పచ్చడి నినాదాన్ని అందుకున్నాడు. ఓ సీఎం స్థాయిలో రేవంత్ అంత ధీమాగా సవాల్ విసిరితే దాన్ని కేటీఆర్ స్వీకరించలేదనే చెప్పాలి. ఎందుకంటే .. ఆయన టాపిక్‌ను డైవర్ట్ చేసే పనిని ముందు పెట్టుకున్నారు.
అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు.. చాలెంజ్‌లు విసురుతున్నాడు. అక్కడి నుంచి తిరిగి డిమాండ్లు, లక్ష్యాలతో కలగలిపిన ప్రతిసవాళ్లు కేటీఆర్ ముందుకు రాగానే తోకముడుస్తున్నాడు. తన సోషల్ మీడియాలో వేసే పులివేశాలు.. ఇలా ప్రాక్టికల్‌గా రంగంలోకి దిగినప్పునడు సీరియస్ నెస్ ఉండాలి. అది కేటీఆర్‌లో లోపించింది. అందుకే మధ్యే మార్గంగా తప్పించుకునే రాజకీయాలకు ఆశ్రయించాడు.