సోషల్ మీడియా బలం ఎక్కువగా ఉండటం మూలంగానో.. అధికారం పోయిందనే ఫ్రస్టేషన్‌లో వచ్చిన అత్యుత్సాహమో తెలియదు.. సర్కార్‌ను ఇరుకున పెట్టే కొన్ని విషయాల్లో బీఆరెస్ దూకుడు ఆ పార్టీనే ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం.. హిట్లర్.. హైడ్రా! గురించి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో హైడ్రా ఇష్యూ రాగానే .. హిట్లర్ పాలనలో ఉన్న హైడ్రా విధానాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్లు అనుకున్న దాని కోసం ఎంతటి కమిట్‌మెంట్‌తో, వెనక్కి అడుగేయకుండా పనిచేశారో.. దాన్ని హైడ్రాకు ఆపాదించి చెప్పే ప్రయత్నం చేశారు. ఆక్రమణలను కూల్చేక్రమంలో నేటమట్టం చేసేదాకా అది వెనక్కి తగ్గదు అని చెప్పడం సీఎం ఉద్దేశం. కానీ ఆ చెప్పే విధానంలో ఆయన తీసుకున్న హిట్లర్, యుద్ద దేశాల పేర్లు.. ఇబ్బందికరంగా మారాయి.
దీన్నే అదునుగా అందుకున్నది బీఆరెస్, ఆ పార్టీ సోషల్ మీడియా. సీఎంను హిట్లర్‌ను చేసేసింది. హిట్లరే నాకు స్పూర్తి అని టైటిల్ పెట్టి.. ఓ వార్త కుమ్మేసింది. దాని క్లిప్పింగ్‌ను తెగ వైరల్ చేయడమే కాదు.. ప్రెస్‌మీట్లు పెట్టి ఎడాపెడా తిట్టిపోసింది కేటీఆర్ టీమ్. వాస్తవానికి హిట్లర్ పాలన అనగానే చాలా మందికి కేసీయారే గుర్తొస్తాడు. ఇందులో అతిశయోక్తి లేదు. ఆయన మూర్ఖత్వం, అహంకారం.. అచ్చంగా అట్లనే ఉంటాయని చెప్పుకుంటారు. ఆ పార్టీ నేతలతో సహా. ఉద్యమ సమయంలో దాన్ని పట్టించుకోలేదు. అదే కలిసి వచ్చింది కూడా కొన్ని సార్లు కేసీఆర్‌కు, ఉద్యమానికి. రాష్ట్రం వచ్చిన తరువాత .. ఆయన సీఎం అయిన తరువాత ఇది రెట్టింపయ్యింది.
ఇక తనకు తిరుగేలేదనుకున్నాడు. నియంతృత్వ నిర్ణయాల్లో ఆయనకు మించినోడు దొరకడు. ఎవరి సలహాలు అవసరం లేదు.అంతా తనకే తెలుసుననే గర్వం. దీనికి తోడు కీర్తి ఖండూతి. అందరూ తనను మెచ్చుకోవాలె. తెలంగాణ తెచ్చినోడి పాలనలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నామని కీర్తించాలి. ఎవరూ ప్రశ్నించకూడదు. నిలదీయరాదు. అసెంబ్లీలో సైతం తనకుప్రతిపక్షం ఉండకూడదు. తను చెప్పే సూక్తులు గంటల తరబడి విని తరించాలి. జాతిపితగా యావత్ దేశం గుర్తించి, కీర్తించాలి. ఇదీ కేసీఆర్ మనస్తత్వం. అచ్చంగా హిట్లర్‌ను పోలిన మెంటాలిటీ. అహంకారం కలగలిపిన పాలన. మొదటి టర్ములో కొంచెం భయపడ్డాడు. అందుకే ప్రభుత్వాన్ని ముందే రద్దు చేసుకుని ఎన్నికలకు పోయాడు.
రెండోసారి ఇక ధైర్యం వచ్చింది. ఇక తనను కొట్టేవాడే లేడనుకున్నాడు. కుక్కను పెట్టినా, తన చెప్పును నిలబెట్టినా…. అక్కడ కేసీఆర్ ముఖం చూసి ప్రజలు ఓట్లేయాల్సిందే. గెలిచి తీరాల్సిందే. అనేదే ఆయన విధానం. అందుకే ముచ్చటగా మూడుసార్లు ఆ సిట్టింగులకే చాన్సిచ్చాడు. రెండు టర్ముల పాలనలో కేసీఆర్‌ను ప్రధానంగా దెబ్బకొట్టింది .. ఉద్యమకారుల ఇష్యూనే. ఇదింకా వాళ్లు గుర్తించకపోవడం.. కేసీఆర్, కేటీఆర్‌లలో నిండి ఉన్న దొరస్వామ్య పాలనకు నిదర్శనంగా చెప్పుకుంటారు వాళ్లు. పెండ్లాం పిల్లలకన్నా ఎక్కువగా కేసీఆర్‌కు సపోర్టు చేశారు ఉద్యమకారులు. మరి అలాంటి వారినే కేసీఆర్ విస్మరించాడు.
దళితబంధు పేరుతో కొందరికి మాత్రం పదిలక్షలు ఎరగా వేసి.. తన జాతీయ రాజకీయ ఎంట్రీగా వాడుకోవచ్చనుకున్నాడు. దళితుల అభ్యున్నతి అని దానికి పేరు పెట్టి.. పది లక్షల సాయం పేరుతో దేశాన్ని ప్రశ్నించాలనుకున్నాడు. చూశారా..! మా రాజ్యంలో ఎలాంటి పథకాలున్నాయో..! మీరెప్పుడైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా? అని నిలదీయడం కేసీఆర్ ఉద్దేశం. దాని కోసం ఇక్కడ చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు.. దళితులు, బీసీలు.. అని వేర్వేరు చేసి అగ్గి రాజేశాడు. ఆత్మగౌరవ నినాదాన్ని తట్టిలేపాడు. కాళేశ్వరాన్ని ఆగమాగం కట్టి.. దేశానికేదో చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు అది ప్రజలకు ఉపయోగపడని ప్రాజెక్టుగా మారేందుకు.. ఆయన చేసిన హడావుడే కారణం. అప్పులు మిగిలాయి. ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యలో రైతులు నలిగిపోతున్నారు.
తను, తన కొడుకు, తన మనువడు.. ఇలా మొత్తం తెలంగాణను తన కుటుంబమే పాలిస్తుందనే దురహంకారమే కేసీఆర్‌ను, ఆ పార్టీని ఈ స్థితికి తీసుకురావడం వెనుక ప్రధాన కారణంగా చెప్పుకుంటారు. ఇక రేవంత్ హైడ్రా విషయంలో కూడా జనం అంతా ఆనందంగా ఏమీ లేరు. ఉద్దేశ్యం సరైనదైనా.. పులి మీద స్వారీలా ఏ కొంచెం బ్యాలెన్స్ తప్పి దీన్ని ప్రయోగించినా మొదటికే మోసం వస్తుంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో తీసుకున్న ఆకస్మిక, హడావుడి నిర్ణయం.. మిగిలిన విషయాల్లో లేకపోవడాన్ని జనం చర్చించుకున్నారు. ఇక పేదల జోలికి వెళ్లకపోవడం చాలా మంచిదనే అభిప్రాయాలున్నాయి. ఈ అంశంలో భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని, ఆలోచించి ముందుకు సాగడం.. పెద్దల ఆక్రమణలపై దాడులు ముమ్మరం చేయడం లాంటివి చేస్తే.. హైడ్రాకు విమర్శలకన్నా.. ప్రశంసలే దక్కుతాయంటున్నారు. కిషన్‌రెడ్డిని తుక్కు తుక్కు తిట్టినవారిలో కేసీఆర్ కూడా ఉన్నాడు.
కానీ ఈ తిట్లు, నిలదీతలు, నిందల పర్వం రాష్ట్ర ప్రయోజనాలకు మరింత గ్యాప్‌ను పెంచేవే తప్ప ఉపయోగపడేవి కావు. వాస్తవానికి, తను అలాంటి పని చేయనని సామరస్యంగా కేంద్రంతో మాట్లాడి.. తెలంగాణ హక్కులు, నిధులు సాధిస్తానని రేవంత్ చెబుతా ఉంటారు. ఇలా ఆవేశంగా మాట్లాడటం ద్వారా పరిస్తితిని మరింత జఠిలం చేసుకోవడమే అవుతుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌కు, మోడీకి మధ్య తీవ్ర అగాధం నెలకొల్పుకోవడం వల్ల .. కేసీఆర్ పంతం నెగ్గించుకున్నాడేమో గానీ.. ఆయన అహం సంతృప్తి చెందిందేమో గానీ.. నష్టపోయింది ఇక్కడి జనమేనని గుర్తు చేస్తున్నారు. చివరగా.. హిట్లర్‌ను స్పూర్తిగా తీసుకున్నానని బీఆరెస్.. సీఎంపై ఆరోపణలు చేస్తున్నది. మరి హిట్లర్ పరిస్థితి ఏంటీ? చరిత్ర పుటల్లో ఆ హిట్లర్ ఎలా మిగిలిపోయాడు.. ఈ పదేండ్ల పాలన తరువాత కేసీఆర్ ఎందుకు ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. వీటిపై ఈ పాలకులిద్దరికీ స్పష్టమైన అవగాహన ఉంది. కానీ గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని పరివర్తన చెందడం, తనకు దక్కిన అవకాశాన్ని అందిపుచ్చకుని గత పాలకుడి పోకడలకు దూరంగా ఉండటం.. ఇద్దరూ పాటించాల్సిన నియమం. అమలు చేయాల్సిన విధానం. దీన్నే ప్రజలు గమనిస్తున్నారు.