ఫ్యూచర్ సిటీ రగడను పెంచి పోషిస్తోంది బీఆరెస్. ఓ వైపు సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతుంటే.. కేటీఆర్ మాత్రం తన ప్రతి మీటింగులో దీని గురించి నెగిటివ్ కోణంలో తెలంగాణ జనానికి ప్రజెంట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన అక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు.
ఓసారి చట్టం చూసుకోండి.. పెట్టుబడులు పెడుతూ పోతే మీకే నష్టం.. ! అని తేల్చిపారేశాడు. గతంలో కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం.. వచ్చీ రాగానే వెంటనే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తాం.. అక్కడ యథావిధిగా ఫార్మాసిటీనే ఉంటుంది.. అంటు చెబుతూ వచ్చాడు. తొలత ఈ వివాదాన్ని తట్టి లేపింది హరీశ్‌రావు. దీనికి కేటీఆర్ కూడా సపోర్టు చేస్తూ వస్తున్నాడు. హరీశ్ మాటతో నేను ఏకీభవిస్తున్నానని చెబుతూ వచ్చాడు. ఇవాళ ఏకంగా మహేశ్వరం పార్టీ మీటింగులో దీనిపై గతంలో కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఏమేమీ అన్నారో .. ఆ వీడియోలు ప్రదర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. అక్కడ ఉన్న ఫార్మాసిటీని రద్దు చేస్తామని, దీని కోసం రైతుల వద్ద తీసుకున్న 14వేల ఎకరాలను తిరిగి రైతులకు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రకటనల క్లిప్పింగులను చూపెట్టారు. అయితే కేటీఆర్, హరీశ్‌లు ఇద్దరూ ఫ్యూచర్ సిటీపై చేస్తున్న ప్రకటనలతో గందరగోళం ఏర్పడుతున్న విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి.. వీరికే ఫ్యూచర్‌లేదు.. వాళ్ల పార్టీ రద్దయిన వెయ్యినోటు లాంటిది.. వారి మాటలు పట్టించుకోకుండి అని ప్రజలకు సూచించారు.
అంతేకాదు.. ఎవరైనా ఇక్కడికొచ్చి రద్దు గిద్దూ అని మాట్లాడితే ఒంగబెట్టి తన్నండి..!అని కూడా పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. అయినా దీనిపై మాట్లాడటం ఆపలేదు కేటీఆర్. ఇవాళ ఏకంగా పెట్టుబడిదారేలకే ధమ్కీ ఇచ్చే విధంగా ఆయన మాట్లాడటం చర్చకు వస్తోంది. అక్కడ ఎన్ని పెట్టుబడులు పెట్టినా లాభం లేదని, లా ప్రకారం అది ఫార్మా కంపెనీలు పెట్టడానికే వినియోగించాలన్నారు. తాము కూడా తమ ప్రభుత్వం హయాంలో నిర్ణయం తీసుకున్నదానికే కట్టుబడుతామన్నారు.
ఆ 14వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మించేందుకు 2015 లో .. ఇబ్రహీంపట్రం, మహేశ్వరం రైతులను బతిమాలి ఒప్పించి తీసుకున్నామని గుర్తు చేశాడు కేటీఆర్. అప్పుడు రైతుల నుంచి తీవ్ర నిరసన వచ్చిందని, ప్రభుత్వం తరుపున బీఆరెస్ ఎమ్మెల్యేలు..మంత్రులు రైతులకు నచ్చజెప్పారన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి అక్కడ ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు రెడీ అయితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ భూములను తిరిగి రైతులకే ఇస్తామని చెప్పి.. ఇప్పుడు అందులో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామంటున్నారని విమర్శించాడు కేటీఆర్.
అంతే కాదు.. ఆ 14వేల ఎకరాలు సరిపోవని, 35వేల ఎకరాలకు పెంచాడని, ఈ భూములను బలవంతంగా లాక్కున్నాడని ఆరోపించాడు కేటీఆర్. ఇంత చేస్తున్న రేవంత్‌కు ఫ్యూచరే లేదని, ఆయనను ప్రజలను తిరస్కరించినా, రాహుల్ తిరస్కరించినా సీఎం పోస్టు పోతుందన్నారు. తమకు ఫ్యూచర్ లేదన్న రేవంత్‌పై .. అవే మాటలతో దాడి చేస్తున్నాడు కేటీఆర్.
మొత్తానికి ఈ నేతల ఫ్యూచర్ ఏమోగానీ, ఆ ఫ్యూచర్ సిటీ ఫ్యూచరే ప్రమాదంలో పడిపోయేలా పరస్పర కామెంట్లు ఉండటంతో.. మధ్యలో జనం తమ ఫ్యూచర్ ఏంటని ఆలోచించే పరిస్థితి వచ్చింది.