తెలంగాణలో కచ్చితంగా బీజేపీని అధికారంలోకి తేవాలనే కంకణం కట్టుకున్నది అధిష్టానం. దీంతో పాటు ఒంటరిగానే పోటీ చేస్తానని కూడా ప్రకటించుకున్నది. మరి ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకునే సత్తా తెలంగాణలో ఉందా? అనే చర్చ మొదలైంది. దీంతో పాటు బీఆరెస్ కూడా ఎవరితో పొత్తు ఉండబోదని క్లారిటీ ఇస్తున్నారు. ఎవరికి వారే ఈ రెండు పార్టీలు తాము సింగిల్ గానే పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంటామని ప్రకటించుకున్నా అది మేకపోతు గాంభీర్యమనే అనుకుంటున్నారంతా.
ఆ రెండు పార్టీలకు లోలోన భయం వెంటాడుతూ ఉంది. కానీ పొత్తులు పెట్టుకోలేని పరిస్థితి. అంతకు ముందు ఉన్న దోస్తానా ఇప్పుడు లేదు. అక్కడ ఏపీలో చంద్రబాబు ఎలాంటి డాంబికాలకు పోకుండా, శషభిషలు లేకుండా అందరినీ కలుపుకున్నాడు. కూటమిగా ఏర్పడి జగన్‌ను ఢీకొట్టే విషయంలో తను పన్నిన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసి సర్కార్‌ను ఏర్పాటు చేసుకోగలిగాడు. కానీ ఇక్కడ కేసీఆర్ తను అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ లుక్‌తో పోయి.. మోడీతో దోస్తానా చెడగొట్టుకున్నాడు.
అప్పటి వరకు బాగానే ఉన్న ఇద్దరి మధ్య సఖ్యత ఎక్కడ చెడింది? అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నది. ఇద్దరి మధ్య సఖ్యత అలాగే కొనసాగితే తెలంగాణపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోపోయేదంటున్నారు. తనకు కావాల్సింది కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం. కానీ కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మోడీని చికాకు పెట్టాయి. బెదిరింపు రాజకీయాలు నచ్చలేదు. దీంతో కేసీఆర్ వెంట పడ్డాడు. తను ఓడిపోవడానికి పరోక్షంగా కారకుడయ్యాడు.
ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉన్న సమయంలోనే మెల్లగా తన మనసులోని మాట బయట పెట్టాడు కేసీఆర్. తన కొడుకును సీఎం చేయాలనేదే తన సంకల్పమని చావు కబురు చల్లగా చెప్పాడు. మీ సహకారం కావాలని మోడీని కోరాడు. ఈ ప్రతిపాదనకు మోడీ ఒప్పుకోలేదు. ముఖం మీదే తిరస్కరించాడు. ఇక అప్పటి నుంచి మోడీతో దోస్తానా కట్ చేసుకోవడం ప్రారంభించాడు కేసీఆర్. అయితే మోడీ మాత్రం కేసీఆర్‌తో దోస్తానాను వదులుకోవాలనుకోలేదు. అక్కడ కాంగ్రెస్ రాకుండా ఉండాలంటే కేసీఆర్ రాజకీయంగా బలంగా ఉండాలనే కోరుకున్నాడు.
తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు.. పార్లమెంటులో మాత్రం ఎంపీ సీట్ల మద్దతు తమకు ఉండాలని భావించింది బీజేపీ. అందుకే అప్పుడు బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించింది కూడా కేసీఆర్ చెప్పడం వల్లేననే ప్రచారం జరిగింది. ఇంత చేసినా కేసీఆర్ మాత్రం మోడీతో తన సంబంధాలను దూరం చేసుకుంటూ వచ్చాడు. తన కొడుకును సీఎం చేసే ప్రతిపాదనకు ఇక మోడీ ఒప్పుకోడనే ఏకైక కారణంతోనే.
ఆపై సైలెంట్‌గా ఏమి లేడు కేసీఆర్.. దేశ్ కీ నేత అవతారం ఎత్తాడు. ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కావాలన్నాడు. దీని కోసం తనే పూనుకుని ముందడుగు వేస్తానని.. తన పార్టీ పేరును టీఆరెస్ నుంచి బీఆరెస్‌గా మార్చుకున్నాడు. ఇక దేశాటన పట్టాడు. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పని పెట్టుకున్నాడు.
పాము తోక తొక్కినట్టుగా అయ్యింది మోడీకి.. కేసీఆర్ చర్యలు చూసి. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? అని .. మోడీ తన విశ్వ రూపాన్ని బయటపెట్టుకున్నాడు. కవితను మద్యం కేసులో ఇరికించాడు. కేసీఆర్‌ను నైతికంగా దెబ్బ కొట్టాడు. దీంతో ఈ పరిణామం మొత్తం పార్టీపై పడింది. డీలా పడ్డాడు కేసీఆర్. ఈ పరిణామాలు అటు బీజేపీకి మేలు చేయకపోగా… బీఆరెస్‌ను మాత్రం బాగా డ్యామేజీ చేశాయి.
కాగల కార్యం గంధర్వులు తీర్చిన చందంగా… వీరిద్దరి కుమ్ములాటలు కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చాయి. బీఆరెస్ ఓడిపోయింది. ఢిల్లీ కాదు .. గల్లీలోనే ముఖం చెల్లకుండా పోయింది. ఈ విషయంలో మోడీ అనుకున్నది సాధించాడు. కానీ కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదానికి తనకు తానే తూట్లు పొడుచుకున్నాడు మోడీ. కాంగ్రెస్‌కు తనే పరోక్షంగా అధికారాన్ని కట్టబెట్టాడు.
అక్కడ చెడిన దోస్తానా.. ఇంకా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడం ఇద్దరికీ చేటే. ఫలితాల తరువాత ఇద్దరూ కలవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. మరి అప్పుడు కూడా కేటీఆర్ సీఎం.. అనే ప్రతిపాదనకు మోడీ ఓకే అంటాడా? అనేది కూడా చర్చకు వస్తోంది. అందుకే ఒంటరిగానే అధికారంలోకి వస్తే.. మోడీ అవసరం ఉండదు కదా.. తను అనుకున్నట్టు తను ఓ ఆరు నెలలు సీఎంగా చేసి ఆ వెంటనే కేటీఆర్‌ను సీఎంగా ప్రకటించేస్తే సరిపోతుంది.. అని లెక్కలేసుకుంటున్నాడట కేసీఆర్.