టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి ఖాయమని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కేబినెట్ విస్తరణలో భాగంగా బీసీని తీసుకుంటారని, అతనికి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని జరిగిన ప్రచారంలో ప్రధానంగా మహేశ్ పేరు వినపడింది. సీఎం రేవంత్‌రెడ్డికి, మహేశ్‌కుమార్ గౌడ్‌కు మధ్య ఉన్న సాన్నిహిత్యం, పరస్పర సహకారం అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తోంది. మహేశ్ టీపీసీసీ అయ్యేందుకు తెర వెనుక రేవంత్ ప్రమేయం చాలానే ఉందంటారు. వీరిద్దరి కాంబినేషన్ సక్సెస్‌ఫుల్ జోడిగా పిలవబడుతున్నది. మంత్రి పదవి కన్నా మహేశ్‌కు టీపీసీసీగానే ఉండాలనే ఆకాంక్ష ఉంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట్టయ్యింది తాజాగా.
తెలంగాణ రాజకీయాల్లో జోడీలు కొత్తవి కావు. కానీ కొన్ని జోడీలు మాత్రం కాలాన్నే మార్చేలా ప్రభావం చూపిస్తాయి. అలాంటి జోడీల్లో ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి – డి. శ్రీనివాస్ (వైఎస్-డీఎస్) కాంబినేషన్. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో ఊపిరి పోసిన ఈ జోడీ, వ్యూహం-అమలు అనే రెండు చక్రాల్లా పని చేసింది. వైఎస్ మాస్ లీడర్. ప్రజల్లో అద్భుతమైన పాపులారిటీ. పాదయాత్రలతో, సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. మరోవైపు డీఎస్ ఆర్గనైజర్‌గా.. పార్టీ నిర్మాణం, కేడర్ మేనేజ్‌మెంట్, ఎన్నికల వ్యూహాల్లో దిట్ట. ఇద్దరూ కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన బేస్ ఏర్పడింది. 2004లో అధికారంలోకి రావడంలో ఈ జోడీ పాత్ర కీలకంగా పని చేసింది. రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకొచ్చింది ఈ జోడీనే. అందుకే ఈ కాంబినేషన్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.
అయితే కాలం మారింది… రాజకీయ సమీకరణాలు కూడా మారాయి. ఇప్పుడు అదే తరహా జోడీగా రేవంత్ రెడ్డి – మహేశ్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు మాస్ అప్పీల్ ఉన్న నాయకుడు, మరొకరు ఆర్గనైజేషన్‌పై పట్టు ఉన్న నేతగా ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన బహిరంగ సభలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు రేవంత్. తమ జోడీ మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తుందని ప్రకటించారు. దీంతో ఇక పీసీసీ చీఫ్ హోదాలోనే మహేశ్ కొనసాగనున్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా .. బీసీకా, ఓసీకా అనే సమీకరణాలు అటుంచి..ఇందులో మహేశ్ పేరు మాత్రం ఉండబోదని సీఎం స్వయంగా చెప్పినట్టయ్యింది. ఇక ఆ ప్రచారానికి బ్రేకులుపడ్డాయి.
రేవంత్ రెడ్డి తన దూకుడైన శైలితో, ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పాలనలోనూ, రాజకీయాల్లోనూ తన ముద్ర వేయాలని చూస్తున్నారు. మరోవైపు మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, కేడర్ సమన్వయం, గ్రౌండ్ లెవెల్‌లో బలపర్చడంపై దృష్టి పెట్టారు. కానీ.. అప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కలా లేవు. అప్పట్లో కాంగ్రెస్‌కు … పాలక పక్షంపై వ్యతిరేకంగా ఉన్న అసంతృప్తి పెద్దగా ఉపయోగపడింది. ఇప్పుడు మాత్రం బలమైన ప్రత్యర్థులు, మారుతున్న ఓటర్ మైండ్‌సెట్, సోషల్ మీడియా ప్రభావం అన్నీ కొత్త సవాళ్లు. కానీ ఎదురొడ్డి నిలుస్తామంటున్నది ఈ జోడి. గెలిచి చూపిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నది. మొత్తానికి… వైఎస్-డీఎస్ జోడీ ఒక మోడల్‌గా నిలిచింది. రేవంత్-మహేశ్ జోడీ ఆ మోడల్‌ను రిపీట్ చేస్తుందా లేదా అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
డీ శ్రీనివాస్, మహేశ్ కుమార్ గౌడ్.. ఇద్దరూ నిజామాబాద్ వాస్తవ్యులే కావడం కొస మెరుపు.