ఈ మధ్య పోక్సో కేసులు రేవంత్ సర్కార్‌ను వెంటాడుతున్నాయి. ఎప్పుడైతే బండి భగీరథ్ కేసు తెరపైకి వచ్చిందో అది రాజకీయ దుమారం రేపింది. దీన్ని ఎంతలా రచ్చ చేయాలో అంత చేసి వదిలింది బీఆరెస్. అయితే అంతకు ముందు కూడా అడపాదడపా తెలంగాణలో అక్కడక్కడా పోక్సో కేసులు నమోదయ్యాయి. కానీ అవి వార్తల్లోకెక్కలేదు. బండి భగీరథ్ కేసు ఉదంతం తెరపైకి వచ్చిన తరువాతే ఈ కేసులు ఎక్కడ నమోదైనా మీడియాలో ప్రముఖంగా ప్రచురితమవుతూ వస్తున్నాయి.
తాజాగా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ ఉదంతం కూడా ఫోక్సోలో బెయిల్ తీసుకుని వచ్చినదే కావడంతో ఇది మరింతగా చర్చకు తావిచ్చినట్టైంది. రాజ్‌కుమార్ విషయంలో పోలీసుల మీద విపరీతమైన ప్రచారం జరిగింది. అక్కడి ఎస్సైను కూడా సస్పెండ్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలకు తోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా విరుచుకుపడటంతో .. దీంట్లో సర్కార్ వైఫల్యం ఉందనే విధంగా.. తెలంగాణ పోలీసులు వైఖరితో ఇలాంటివి జరుగుతున్నాయనేలా పరిస్థితి మారింది.
తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. ఏకంగా రేవంత్‌కే లేఖ రాశాడు. ఇలా అయితే ఎలా..? ఇంత జరుగుతున్నా పట్టించుకోవా? కఠినంగా ఉండండి..? ఇదేం పోలీసింగ్..? అని నీతులు వల్లెవేసినంత పనిచేశాడు. పనిలో పనిగా పాతబస్తీ, లంగర్ హౌజ్ అంటూ కొన్ని ముస్లిం ఏరియాల పేర్లు కూడా తీశాడు. ఇక్కడే ఈ విషయంలో పవన్ చిత్తుశుధ్ది తుస్సుమన్నది.
పొరుగు రాష్ట్రంలో వేలు పెట్టడమే ఎక్కువ. అందులోనూ నీతో నీతులు చెప్పించుకుంటున్నారంటేనే అది తెలంగాణ సర్కార్‌కు నమోషీ. ఇది చాలదంటూ ఏరియాల పేర్లు చెప్పి.. ఈ పోక్సో కేసులు ఎక్కువగా ముస్లింల ఏరియాల్లో జరుగుతున్నాయనే తన సొంత పైత్యాన్ని, పార్టీ భావజాలాన్ని ఆ లేఖలో రుద్ది మరీ పంపించాడు.
అంతలా ఏరియాలు వెతికి రాసిన పవన్ .. మరి బండి భగీరథ్ అంశం కూడా ప్రస్తావిస్తే బాగుండేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చెప్పేది సూటిగా చెప్పక.. ఇందులో మళ్లీ డొంక తిరుగుడెందుకు? అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ జనాలు. అక్కడ ఆంధ్రాలో కూడా మేమేం సక్కగా లేమని చెప్పేందుకు.. ఏపీ పోలీసు బాస్‌కు కూడా లేఖ రాశాడంట. ఎట్లాగూ హోంమంత్రి ఉండీ లేనికిందకే అని అనుకుని ఉంటాడు. తానే హోమంత్రిని అయితే.. అని గతంలో అన్నాడు కదా.
మరి తెలంగాణలోనూ సీఎం రేవంతే హోమంత్రి కాబట్టి.. పోక్సో కేసుల విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారని ఆ లేఖ ద్వారా చెప్పకనే చెప్పాడు పవన్. చివరకు పవన్‌తో కూడా సలహాలు తీసుకునే స్థితిలో తెలంగాణ సర్కార్ ఉందనే విషయం చర్చకైతే వస్తోంది.