మోడీ, అమిత్ షాలు ఒకటనుకుంటే మరొకటి జరిగింది. కోతిని చేయబోతే హనుమంతుడయ్యాడు. అవును.. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో డీలిమిటేషన్ చేసి ఒకదెబ్బకు మూడు పిట్టలను కొట్టాలనుకుంది. ఒకటి.. మహిళల మన్ననలు పొందడం, ఉత్తరాది రాష్ట్రాలను మరింత బలపరిచి మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడం.. అన్నింటికన్నా ముఖ్యంగా రాహుల్‌ను బలహీనపర్చడం.. ఇవన్నీ ఒక్క మహిళా బిల్లు పేరుతో వ్యూహాత్మంగా వచ్చింది ఎన్డీయే సర్కార్. మరో వైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో లబ్దిపొందాలనుకోవడం కూడా దీంట్లో భాగంగా హడావుడిగా చేసుకుంటూ పోయారు. కానీ రోజులు అప్పట్లా లేవు. వేసిన ఎత్తులన్నీ పారయిని తేలింది.
రాహుల్‌ను విలన్ చేసి చూపిద్దామనుకుంటే హీరో అయి కూర్చున్నాడు. ఇప్పుడిదే జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లును ఎడాపెడా పెట్టేసి.. ఆమోదింపజేసుకుని ఏది చేద్దామనుకుంటే అది చేసేద్దామనే భావన ఇప్పుడు లేదు. అహం దిగింది. రాహుల్ నెగ్గాడు. అమిత్, మోడీలు ఓడారు. ఇదొకరకంగా వారికి గర్వభంగం లాంటిదే. రాహుల్‌ను సున్నితమైన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇరిక్కిద్దామనుకున్నారు. ఏమీ మాట్లాడలేని స్థితికి తేవాలనుకున్నారు. వ్యతిరేకించినా.. మహిళాలోకం ముందు దోషిగా నిలపాలనుకున్నారు. కానీ రాహుల్ ఎక్కడా తడబడలేదు.మొదటి నుంచి చాలా స్పష్టంగా ఉన్నాడు. ఎక్కడా వెనక్కి రాలేదు. మరో మాట ఆలోచించలేదు.
మహిళా బిల్లు రూపంలో ఎన్డీయే ఎత్తుగడలను గ్రహించిన వాడిగా.. పక్కా వ్యూహంతో పోయాడు. ఎత్తుకు పైఎత్తు వేశాడు. మాటకు మాట జవాబిచ్చాడు. ఘాటుగానే స్పందించాడు. సభ జరుగుతున్న తీరులోనే తేడా కొట్టింది మోడీ, అమిత్ షా ద్వయాలకు. తమ వ్యూహం బెడిసికొడుతుందనుకున్నారు. అదే జరిగింది. రాహుల్‌ను రెంటికీ చెడ్డ రేవడిలా మార్చి.. తాము అనుకున్నది సాధించాలనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఎన్డీయేనే రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. జనానికి ఇష్టం లేని ఏదీ బలవంతంగా చేయాలనుకున్నా.. అడ్డుకోవడానికి కాంగ్రెస్ బలంగా ఉందని, సరైన రీతిలో స్పందించి అడ్డుకట్ట వేస్తుందనే ఈ సంఘటనతో తేల్చి చెప్పేసినట్టయ్యింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా రాహుల్ గాంధీ క్లారిటీగా చెప్పాడు. సబ్ కోటా లేకుండా పెడితే.. బీసీ , ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం చేసినట్టేనని. హిందువుల పేరుతో అందరినీ కలుపుకుంటారు.. కానీ రాజకీయంగా అందరికీ ఫలాలు మాత్రం అందించరని.. సున్నితమైన సబ్జెక్టు మీద కూడా సూటిగానే కుండబద్దలు కొట్టాడు రాహుల్. జాదూగర్ వేశాలు ఇక చెల్లవన్నాడు. ఆరోగ్యం క్షీణించింది..ఇక ఆటలు ఆపు అని పరోక్షంగా సంకేతాలిచ్చాడు. పార్లమెంటులో ఇకపై ఇండి కూటమిని కాదని ఎన్డీయే తోక జాడించే పరిస్థితి లేదని నిరూపించాడు రాహుల్ గాంధీ.
ఇక ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా.. దేనికైనా రాజ్యాంగ సవరణ చేయాలన్నా.. తమ మద్దతు అవసరమని తేల్చి చెప్పేశాడు ఈ ఉదంతంతో. ఇష్టానుసారం రాజ్యంగ సవరణ చేస్తామంటే ఆటలు సాగవని వార్నింగ్ ఇచ్చినట్టయ్యింది ఎన్డీయేకు. అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు హీరోగా నిలిచాడు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తను అనుకున్నదానికి కట్టుబడి ఉంటే నాయకుడు ఎప్పుడైనా గెలుస్తాడని, జనం మేలు కోసం కమిట్‌మెంట్‌తో క్లారిటీతో ఉన్న నాయకుడిదే నైతిక విజయమని ఎన్డీయే హడావుడి మహిళా బిల్లు వీగిన ఉదంతమే నిదర్శనంగా చెప్పవచ్చు.