మళ్లీ చాలా రోజుల తరువాత థర్ట్ ఫ్రంట్ మాట వినిపించింది. మారిన తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. స్టాలిన్ ఈ మాటనాల్సి వచ్చింది. ఇండి కూటమి మిత్రధర్మాన్ని కాదని.. విజయ్‌తో రాహుల్ జత కట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తిక్కరేగింది స్టాలిన్‌కు. అందుకే దీన్ని వెన్నుపోటు చర్యగా ఆయన అభివర్ణించారు. అంతే కాదు తమ డీఎంకే పార్టీ అత్యవసర సమావేశంలో ఇకపై ఇండి కూటమిలో ఉండటం లేదని, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లేని కూటమిని ఏర్పాటు చేస్తానని ఆయన తీర్మానం కూడా చేయడం చర్చకు వచ్చింది.
2018-19 లో కేసీఆర్ తనకు తానుగా దేశ్‌కి నేతగా ప్రకటించుకుని.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని బయలుదేరిన నాటి సంగతులు గుర్తుకు తెచ్చాడు స్టాలిన్. కాంగ్రెస్, బీజేపీలేని ఫెడరల్ ఫ్రంట్ కోసం శ్రమించాడు. ఈ రెండు పార్టీలు కాకుండా దేశంలో ఇంక ఏ పార్టీ ఏలలేదా? అని ఆయన దేశ రాజకీయాల్లో చర్చను లేవనెత్తాడు. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ ప్రయోగాన్ని మళ్లీ తట్టిలేపాడు కేసీఆర్. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు.. దేవెగౌడ, గుజ్రాల్ ప్రధాన మంత్రులుగా కొనసాగినా.. ఈ కూటములు ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ వాటి జోలికి ఎవరూ పోలేదు. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలతోనే కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటు జరుగుతూ వస్తోంది. అయితే తెలంగాణలో రాజకీయాలను తనకు అనుకూలంగా.. తన లక్ష్యానికి చేరువ చేసుకునేందుకు కేసీఆర్ ఓ వ్యూహంలో భాగంగా ఫెడరల్ ఫ్రంట్‌ను పేరుతో దేశంలోని ప్రాంతీయ పార్టీ శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించాడు.
ఆ ప్రయత్నంలో భాగంగా మమత బెనర్జీ, దేవెగౌడ, నవీన్ పట్నాయక్, స్టాలిన్‌లను కలిసి … తన ఉద్దేశ్యాన్ని విడమర్చి చెప్పాడు. ఆ ఫెడరల్ ఫ్రంట్‌కు తానే నాయకత్వం వహించాలనుకుంటున్నాడు కాబట్టి.. ప్రధాని క్యాండిడేట్ కూడా తానేనని చెప్పుడం ఆయన ఉద్దేశం. తెలంగాణ రాజకీయాలను తన కొడుకు కేటీఆర్‌కు అప్పగించి.. తాను ఢిల్లీ రాజకీయాలకు పరిమితమవుదామనేది ఆయన వ్యూహం. ఇక్కడ బీజేపీ బలంగా లేదు. కాంగ్రెస్‌ను లేవనీయకుండా చేయడంలో ప్రధాన ప్రతిపక్షాన్ని కకావికలం చేసేశాడు. ఇక తెలంగాణలో ప్రజలు తనకే ఓటేస్తారని, వెంటనే కొడుకును ఇక్కడ సీఎం చేసేసి తాను ఢిల్లీలో చక్రం తిప్పాలనేది ఆయన కోరిక. దీని కోసం ఆయన టీఆరెస్ పార్టీని బీఆరెస్‌గా మార్చాడు.
ప్రధానంగా మహారాష్ట్ర ఎంపీ సీట్ల మీద కన్నేశాడు. తెలంగాణ బార్డర్‌లో ఉండే నాందేడ్ తదితర ప్రాంతాల్లో తన బీఆరెస్ పార్టీని విస్తరించాడు. కోట్లు ఖర్చు చేసి పార్టీలోకి మరాఠాలను నేతలను చేర్చుకున్నాడు. ఈ వైఖరిని తెలంగాణ ప్రజలు ఆహ్వానించలేదు. కేసీఆర్ రాజకీయ వ్యూహం వారికి అర్థమైపోయింది. దేశాలు పట్టుకు తిరిగే నేత మాకెందుకు? కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలని ఆయనకు అభిలాష ఉండొచ్చు గాక.. కానీ మాకు కేటీఆర్ అవసరం లేదు.. అని డిసైడ్ అయ్యారు. అందుకే బీఆరెస్‌ను ఓడగొట్టారు.
ఆ తరువాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడింది బీఆరెస్ పార్టీ. ఫెడరల్ ఫ్రంట్‌తో ప్రయోగం మొదలు పెట్టగానే ఇక్కడ పార్టీ కాస్తా ఓడి… చతికిలపడటంతో అది అటకెక్కింది. ఆపై దీని ఊసేలేదు. ఇన్నాళ్లకు స్టాలిన్ నోటి వెంట థర్డ్ ఫ్రంట్ ముచ్చట వచ్చింది. కానీ అదంతా ఈజీ కాదని అతనికీ తెలుసు. విజయ్ తమిళనాట మరింత స్ట్రాంగ్ అయ్యాడు. బీజేపీ ఆడిన డ్రామాకు విజయ్‌కు రాజకీయంగా కూడా హీరో వర్షిప్ వచ్చింది. అక్కడ అధికార పార్టీతో తలపడి గెలిచి నిలవడమే ఇప్పుడు డీఎంకే ప్రధాన కర్తవ్యం. ఇక థర్డ్ ఫ్రంట్ పేరుతో ఆయన దేశాలు ఎక్కడ తిరగగలడు? అయినా అదో వికటించిన ప్రయోగమని తెలిసీ…!
ఇప్పుడు కేసీఆర్ కూడా చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఉన్నాడు. ఢిల్లీకి వచ్చే పరిస్థితి లేదు. అయినా.. ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతున్నాడు! అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూడాల్సిందే తప్ప… థర్డ్ ఫ్రంట్ అనే ముచ్చట తీయకపోవడమే బెటర్!