రాష్ట్రంలో ముచ్చటగా మూడు టీఆరెస్ పార్టీలున్నాయి. ఒక బీఆరెస్ పార్టీ కూడా ఉంది. అదేంటీ ..? కవితే కదా కొత్తగా టీఆరెస్ పేరు వచ్చేలా పార్టీ పెట్టుకున్నది. మరో రెండు ఎక్కడివి? అనే కదా డౌటు. ఇవి 2003, 2004లోనే ఈసీ వద్ద రిజిష్టర్ అయి ఉన్నాయి. తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్), తెలంగాణ రాజ్య సమితి.. ఈ రెండు టీఆరెస్ అబ్రివేషన్ వచ్చేలా పార్టీలను రిజిష్ట్రేషన్ చేయించిపెట్టుకున్నాయి.
తాజాగా తెలంగాణ రక్షణ సేన గా కవిత తన కొత్త పార్టీ పేరును పెట్టుకున్నారు. టీఆరెస్ నుంచి బీఆరెస్‌గా మారిన తరువాత ఎవరో ఇద్దరు టీఆరెస్ పార్టీ పేరును పెట్టుకున్నా.. పెద్దగా పట్టించుకోలేదు కేసీఆర్, కేటీఆర్. ఎందుకంటే అప్పుడు వారి హవా అట్ల నడుస్తున్నది మరి. మాకు ఎదురే లేదు అనే విధంగా ముందుకు పోతున్నారు. రాష్ట్ర రాజకీయాలను చంకలో పెట్టుకున్నాం.. చాపలో చుట్టేశాం.. ఇక జాతీయ రాజకీయాలు ఏలాలె అని ఢిల్లీ గల్లీల్లో చక్కర్లు కొట్టడం షురూ చేశారు.
దీనికి తోడు.. అప్పుడు టీఆరెస్ అని పార్టీలు పెట్టుకున్నది అనామకులు. అందుకే వారిని లైట్ తీసుకున్నారు.
ఓటమి చెందిన తరువాత గానీ తత్వం బోధపడలేదు. నేల దిగి వచ్చారు. అప్పటికీ పార్టీ పేరును మార్చాలని చాలా మంది చెప్పినా.. అహం అడ్డొచ్చింది. కేసీఆర్ అంటే అంతే మరి. రజినీకాంత్ లెక్కన్న మాట. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే. ఆ సినిమా హిట్టయినా ఫట్టయినా! ఇక్కడ కూడా బీఆరెస్ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ వెనక్కి తగ్డలేదు తండ్రీకొడుకులు.
తీరా ఆ కుటుంబంలో వివాదాలు, అన్నాచెళ్లెళ్ల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు. కేసీఆర్ ముందు కొడుకా..? కూతురా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన తరుణం. కూతురును పొమ్మన్నారు. సొంత పార్టీ పెట్టుకున్నారు కవిత. అదీ కేసీఆర్, కేటీఆర్‌కు దిమ్మదిరిగేలా టీఆరెస్ అని పేరు వచ్చేలా. ఇక్కడే రచ్చకెక్కింది ఆ కుటుంబ రాజకీయ లొల్లి.
ఇప్పటికే టీఆరెస్ పేరును పోగొట్టుకుని జనాల వద్ద మైనస్ మార్కులు పడ్డాయని బాధపడుతుంటే.. ఇప్పుడు అదే కుటుంబం నుంచి.. అదీ కేసీఆర్ కూతురు.. ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాని అన్నట్టుగా .. కేసీఆర్, కేటీఆర్ కాదనుకున్న టీఆరెస్‌ను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయడం.. వారిద్దరికీ అసలే మింగుడుపడలేదు.
అందుకే ఓ వెయ్యి అభ్యంతరాలను ఈసీకి పంపారు. ఇప్పటికీ జనాలు మమ్మల్నే టీఆరెస్ అనుకుంటారని, ఇది ఎవరికి ఇవ్వొద్దనీ చెప్పుకొచ్చారు. ఇక్కడే ఈసీ కూడా కవితకు వేరే మూడు పేర్లు చెప్పాలని సూచించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే.. కవిత ఢిల్లీ హైకోర్టు ద్వారా తన పార్టీ పేరును కొనసాగించేందుకు తాత్కాలిక ఉపశమనం దొరికినా.. ఈసీ ముందు నేరుగా తన అభిప్రాయాన్ని వివరించేందుకు సిద్దపడ్డారు కవిత.
గతంలో ఓ ఇద్దరు టీఆరెస్ పేరు వచ్చేలా పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. లేని అభ్యంతరాలు తన టీఆరెస్ పార్టీకి ఎందుకు వచ్చాయి? అనే కోణంలో ఈసీ ముందు తన లాజిక్‌ను వినిపించేందుకు కవిత రెడీ అయ్యారు. దీంతో పాటు ఈసీ తన పార్టీకి ఆమోద ముద్ర వేసిన తరువాతే.. 119 నియోజకవర్గాల్లో జెండా పండుగ చేసుకుని జెండా గద్దెలు కట్టుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
వెయ్యి అభ్యంతరాలేమిటో కూడా తమకు తెలిపాలని అడగడం వెనుక.. ఆ వెయ్యి అభ్యంతరాలు ఒక్క బీఆరెస్ పార్టీ నుంచే వచ్చాయని చెప్పడానికి కవిత ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో బీఆరెస్ .. గతంలో రెండు టీఆరెస్ పార్టీలు పెట్టుకున్నా అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడు తన టీఆరెస్ పార్టీ పట్ల ఎందుకు అభ్యంతరమని ఈసీ ముందు తన వాదన వినిపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ మార్చుకున్నా.. కారు గుర్తు బీఆరెస్‌కు అట్లనే ఉంటుంది కదా! జనాలకు కారు గుర్తు తెలుసు.. మరి బీఆరెస్‌కు ఎందుకంత భయం..? అనే కోణంలో వాదించి.. చివరగా తన పార్టీ టీఆరెస్‌గానే ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కవిత.