మీడియాకు మంచి టైంపాస్ బఠానీలు. నేతల చిట్‌చాట్ ముచ్చట్లు. మైకులుంటే భయం.. వీడియో కెమెరాలుంటే జంకు. లోపలున్నది మాట్లాడలేరు. మీడియా అడిగిన ప్రతీ ప్రశ్నకు జవాబులు చెప్పలేరు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! అన్నట్టుగా కొన్ని కొన్ని తప్పించుకోవాలె. లేదంటే .. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టు రికార్డెడ్‌గా దొరికిపోతారు. అందుకే మధ్యే మార్గంగా ఇప్పుడు తెలంగాణ లీడర్లు చిట్‌చాట్ మార్గాన్ని ఎంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డైనా.. ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీశైనా.. ఏ పార్టీ అని కాదు… ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ఈ చిట్‌చాట్ ముచ్చట్లకు ఎగబడ్డాయి.
దీని వల్ల ఏదో ఒక కామెంట్ వైరల్ అవుతుంది. గట్టిగా తిట్టొచ్చు. లోపలున్నది కక్కొచ్చు. కసిదీరా ఆరోపణలు గుప్పించొచ్చు. మీడియాకు ఏ కామెంట్ కావాలన్నా.. మరే కౌంటర్ ఇవ్వాలన్నా.. వారేం కోరుకుంటున్నారో… ఆ ఛానెల్ ఉద్దేశమేమిటో పసిగట్టి మరీ కసిగా కామెంట్లు చేయవచ్చు. ఈ దోరణి ఇక్కడ ఎంతలా పెరిగిందంటే.. ఇక్కడి నేతలకు.. మీడియా ఎంతగా అలవాటు చేసిందంటే.. ఇవాళ పలానా టైంకు పలానా లీడర్ మీడియా చిట్‌చాట్ ఉంది… అని మెసేజ్ పంపేలా. అంటే మీడియా సమావేశాలు కావవి. ప్రెస్‌మీట్ అని పెట్టే మెస్సేజ్‌లకు బదులు.. మీడియాతో చిట్ చాట్ అని సందేశాలు పంపుతున్నారు.
ఇది తెలుసుకున్న మీడియా చెంగున ఎగిరి గంతేసి.. ఏమేమి ఆ నేత నుంచి రాబట్టాలో.. ఎవర్నెవరిని ఎలా ఇరికించాలి.. ఎలా తిట్టించాలి.. ! ఎలాంటి కామెంట్లు రాబట్టాలి..! వివాదస్పద విషయాలన్నీ పోగేసి.. అడిగేసి.. జవాబు రాబట్టేసి.. వాటిని అచ్చేసి.. బ్రేకింగ్‌గా వాడేసి.. వైరల్ చేసేసి…! మళ్లీ నెక్ట్స్ ఇంకో నేత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండాలె. ఆ మీడియాకు వీరు అలవాటు చేశారా? ఈ మీడియానే వారికి అలవాటు చేసిందా? ఎవరి మీడియా వారి నేతలను రెచ్చగొట్టేందుకు మధ్యే మార్గంగా దీన్ని వాడుకుంటుందా? ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా.. చిట్ చాట్‌లో చిందులు తొక్కినా.. వారికి కావాల్సిన సరుకే అక్కడ హైలెట్ అవుతుంది.
మిగిలిన తిట్లు.. ఆరోపణలు.. ఇంకొకరికి అవసరం పడతాయి…! ఆణిముత్యాల్లాంటి ఆ నేతల తిట్ల, ఆరోపణల నుంచి ఏఏ పార్టీ మీడియాకు ఏమేమీ కావాలో.. అలా ఏరుకోవాలి అంతే. ఎవరికి కావాల్సినవి వారు తీసుకుని.. ఆ రోజుకు చేతినిండా పని దొరికిందని… ఇక వైరల్ చేసుకునే పనిలో ఎవరికి వారే బిజీ అవుతారు. ఇదిప్పుడు తెలంగాణలో బాగా ముదిరింది.
కేసీఆర్ కు చిట్‌చాట్‌లు ఇష్టం ఉండవు. డైరెక్ట్ అటాక్. ఎన్ని ప్రశ్నలైనా వేయండి .. తడబడకుండా చెప్పేస్తాడు. కానీ, చికాకు తెప్పించే ప్రశ్నలు వేయొద్దు. తన నుంచి రాబట్టుకోవాలనే ప్రశ్నలే వేయాలి. అదీ కండిషన్. లౌక్యం ప్రదర్శించాలి. లేదంటే ఏందయ్యా రాహుల్.. నువ్వు కూడా ఇంత సిల్లీగా అడుగుతవ్..! అని ఇజ్జత్ తీసేస్తాడు. నీది ఏ పేపర్ వయా..! అయితే రాసుకో.. నేను రాజ్యాంగం మార్చబోతున్నా.. అని ఉల్టా ధమ్కీ ఇస్తాడు. మా మధ్య పంచాది పెట్టాలని నీకు బాగా షోకున్నట్టుంది గానీ.. అది కేసీఆర్ కాడ నడ్వదు..అని గాలి తీసేస్తాడు. అదో ప్రశ్ననా వయా..! ఏ ఊకో… అని అందరి ముందు పలుచన చేస్తాడు. అందుకే ఆయనకు కావాల్సినవే అడగాలి. ఏదో సినిమాలో జోక్‌లా.. ఒరే మాస్టరూ.. నువ్వు చెప్పే స్టెప్పులు ఆయన వేయడు. ఆయనకొచ్చిన ఆ గోడ మీద పిడికెలు వేసే స్టెప్పు ఉందే అది వేయించు! అని అన్నట్టుగా.
దీనికన్నా మీడియాకు ఈ చిట్ చాట్ ముచ్చట్లే టైం పాస్ బఠానీల్లా బాగున్నాయి. వానాకాలం గరం గరం పకోడిలా స్పైసీగా అనిపిస్తున్నాయ్! వానంటే గుర్తొచ్చింది.. ఇప్పుడు ఈ వానల నుంచి బయటపడి, ఈదుకుంటూ.. ట్రాఫిక్‌ను దాటుకుంటూ ఇంటికి చేరేదెప్పుడూ..? అని తనకు తాను వేసుకునే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. ఆ ప్రశ్న ఏ లీడర్లను వీరు అడగరు.. వారి వద్ద సమాధానముండదు..! ఇంకో టర్ము కావాలని ఒకరంటే.. మరో రెండు టర్ములు పక్కగా ఉంటే.. ఆ ప్రాబ్లెం ఉండదని ఇంకొకరంటరు. ఎవరొచ్చినా.. ఎవరు పోయినా.. వానాకాలం హైదరాబాద్ మారదని ఆ మీడియాకు మాత్రమే తెలుసు.