ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోవడం సహజం. చాలామంది అప్పుడు ఆ పాలను పారబోస్తారు. ఇకపై అలా చేయకుండా… కొంచెం ఓపిక చేసుకుని ఆ పాలతో కలాకండ్ స్వీట్ చేసేందుకు ప్రయత్నించండి. ఆ విరిగిన పాలను ఉపయోగించి రుచికరమైన కలాకండ్ స్వీట్ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కలాకండ్ స్వీట్ షాప్‌లో దొరికేలా మృదువుగా, తీపిగా ఉంటుంది. ఇప్పుడు చాలా సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం.
కలాకండ్ స్వీట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలు – ఒక లీటర్
నిమ్మరసం లేదా వెనిగర్ – రెండు స్పూన్లు
చక్కెర – ఒక కప్పు
యాలకుల పొడి – అర టీస్పూన్
నెయ్యి – ప్లేట్‌కు రాయడానికి కొద్దిగా
డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తా) – తరిగినవి కొద్దిగా
Also read: Green mirchi Chutney: రాజస్థానీ స్టైల్లో పచ్చిమిర్చి పెరుగు పచ్చడి ఇలా చేస్తే దోశెతో అదిరిపోతుంది
కలాకండ్ స్వీట్ రెసిపీ
1. ముందుగా పాలను బాగా మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత మంటను తగ్గించి, అందులో నిమ్మరసం లేదా వెనిగర్ వేయాలి. కొద్దిసేపట్లో పాలు విరిగి ముద్దలా మారతాయి. పైకి తెల్లని పాల ముక్కలు కనిపిస్తాయి.
2. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఆ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన గుడ్డలో వడకట్టాలి. నీళ్లు పూర్తిగా బయటకు వెళ్లేలా గట్టిగా పిండాలి. నిమ్మరసం వాసన పోవాలంటే ఒకసారి చల్లని నీటితో కడిగి మళ్లీ పిండాలి. ఇప్పుడు విరిగిన పాల ముద్ద రెడీ అవుతుంది.
3. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో వడకట్టిన పాల ముద్దను సన్నని మంటపై నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అందులో ఉన్న తడి కొద్దికొద్దిగా ఆవిరైపోతుంది.
4. ఇప్పుడు అందులో చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగి మిశ్రమం కొంచెం తడి అవుతుంది. మళ్లీ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.
5. మిశ్రమం గట్టిపడుతూ కళాయికి అంటుకోకుండా ఒక ముద్దలా మారాలి.
6. మిశ్రమం గట్టిపడిన తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. ఇది కలాకండ్‌కు మంచి సువాసన ఇస్తుంది.
7. మీరు ఇష్టపడితే ఈ దశలో కొద్దిగా తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేయొచ్చు. అంతే కలాకండ్ సిద్ధమైనట్టే
8. ఇప్పుడు ఒక ప్లేట్ లేదా ట్రే తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి రాయాలి.
9. కలాకండ్ మిశ్రమాన్ని ప్లేట్‌లో వేసి సమంగా పరచాలి. పై నుంచి తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా చల్లాలి. గరిటెతో మెత్తగా ఒత్తాలి.
10. ఇప్పుడు ఈ ట్రేను కనీసం ఒక గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.
11. ఒక గంట తర్వాత ఫ్రిజ్ నుంచి తీసి మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. చతురస్రం లేదా డైమండ్ ఆకారంలో కట్ చేస్తే బాగుంటుంది.
Also read: Garlic Karam Dosa: నోరూరించే వెల్లుల్లి కారం దోశె రెసిపీ, కొబ్బరిచట్నీతో తింటే స్వర్గం కనిపిస్తుంది
స్వీట్ షాపుల్లో దొరికే కలాకండ్ స్వీట్ రెడీ అయినట్టే. మీరు దీన్ని తింటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండలేరు. అంత రుచిగా ఉంటుంది ఈ స్వీట్. ఇంకెందుకాలస్యం కలాకండ్ స్వీట్ వెంటనే చేసేయండి.