రోజూ తినే పచ్చళ్లు బోర్ కొట్టాయా? కాస్త కారంగా, పుల్లగా, సులువుగా చేసుకునే పచ్చడి కావాలా? అయితే ఈ రాజస్థానీ స్టైల్ పచ్చిమిర్చి పెరుగు పచ్చడి మీకోసమే. ఇది చాలా సులభంగా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు. అన్నం, రోటీ, చపాతీ దేనితో తిన్నా ఇది అద్భుతంగా ఉంటుంది.
పచ్చిమిర్చి పచ్చడికి కావలసిన పదార్థాలు
పచ్చిమిర్చి – ఒక కప్పు నిండా
వెల్లుల్లి రెబ్బలు – పదిహేను
అల్లం – చిన్న ముక్క
పెరుగు – అర లీటర్
శెనగపిండి – 1 టేబుల్ స్పూన్
నూనె – 5 టేబుల్ స్పూన్లు
ఆవాలు – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
ధనియాలు – 1 టీస్పూన్
ఎండుమిర్చి – 1
ఇంగువ – చిటికెడు
పసుపు – అర టీస్పూన్
ఉప్పు – సరిపడా
కరివేపాకు – కొద్దిగా
కొత్తిమీర – తరిగినది కొద్దిగా
Also read: Chapati: గోధుమ పిండితో చేసే చపాతీ, రోటీ ఎవరు తినకూడదు?
పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ
1. ముందుగా పచ్చిమిర్చులను కడిగి, ముక్కలుగా కట్ చేయాలి.
2. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేయకండి. గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి.
4. నూనె వేడయ్యాక ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
5. తరువాత ఇంగువ, కరివేపాకు వేసి కాసేపు కలపాలి. తాళింపు మంచి వాసన వస్తుంది.
6. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఈ తాళింపులో వేసి బాగా కలపాలి. చిన్న మంటపై నెమ్మదిగా వేయించాలి.
7. పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి మిశ్రమం నుంచి నూనె విడిపుతుంది. అప్పుడు పసుపు, ఉప్పు వేసి మళ్లీ కలపాలి.
8. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
9. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగు కలపాలి. వేడిగా ఉన్నప్పుడే పెరుగు వేస్తే అది మాడిపోతుంది. కాబట్టి ముందుగా చల్లార్చి, తరువాత అర లీటర్ తాజా పెరుగు వేసి బాగా కలపాలి.
10. చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలిపితే పచ్చడి రెడీ.
Also read: Simple Breakfast: రాత్రి మిగిలిన రోటీలతో ఉదయం టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రోటీ ఉప్మా .. రెసిపీ ఇదిగో
పచ్చిమిర్చి పెరుగు పచ్చడి వేడి అన్నంలో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చపాతీ, పరాటాతో కూడా బాగా సరిపోతుంది. భోజనంలో కాస్త కారంగా, పుల్లగా ఉండాలని అనుకునేవారికి ఇది చాలా బాగా నచ్చుతుంది.