Pineapple Kesari: శివరాత్రి పర్వదినం వేళ ముక్కంటికి సమర్పించే నైవేద్యాల్లో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ చేసే పరమాన్నం, కేసరి కాకుండా ఈసారి కాస్త కొత్తగా, పైనాపిల్ ముక్కలతో పైనాపిల్ కేసరిని ట్రై చేయండి. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండే ఈ ప్రసాదం ఆ స్వామికి నివేదించిన తర్వాత ఇంట్లో వాళ్లకి పంచిపెట్టండి. భక్తితో చేసే ఈ వంటకం పండుగ పూట మీ ఇంట్లో మరిన్ని మధుర జ్ఞాపకాలను నింపుతుంది.
ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, ఒక కప్పు పంచదార, ముప్పావు కప్పు నెయ్యి, చారెడు బాదం, జీడిపప్పులు, రెండు టేబుల్ స్పూన్ల కిస్‌మిస్, పావు చెంచా యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు, చిటికెడు పసుపు రంగు ఫుడ్ కలర్ తీసుకోండి.
Also Read: అర్ధనారీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ‘ఆమ్రఖండ్’ను ఇలా తయారు చేసుకోండి!
మొదట ఒక పాన్ తీసుకుని అందులో రెండు చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక కిస్‌మిస్, బాదం, జీడిపప్పులను దోరగా వేయించి ఒక పళ్లెంలోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో రవ్వను వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి పైనాపిల్ ముక్కలను 3 నిమిషాల పాటు వేయించాలి. అందులోనే పావు కప్పు పంచదార, 3 కప్పుల నీళ్లు పోసి చిన్న మంట మీద ఉడికించాలి. ఓ నాలుగు నిమిషాల తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, మిగిలిన పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలి. మిశ్రమం దగ్గరపడి చక్కగా ఉడికిన తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పైనాపిల్ కేసరి నైవేద్యం సిద్ధం.
Also Read: పక్కా పల్లెటూరి రుచితో ఉలవచారు కోడికూర.. జొన్న రొట్టెల్లోకి అదిరిపోయే కాంబినేషన్!