Bhairavam Movie Review : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన సినిమా ‘భైరవం’. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ వంటి హీరోలు కూడా నటించడం వల్ల.. మల్టీస్టారర్ అప్పీల్ ఏర్పడింది. దీంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపారు. మరి వారి అంచనాలకి తగ్గట్టు ఈ సినిమా ఉందో? లేదో? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ :
దేవీపురం అనే ఓ గ్రామం. అక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ చాలా పవిత్రమైనది, పవర్ఫుల్ కూడా..! దానికి నాగరత్నమ్మ(జయసుధ) పెద్దగా ఉండి అన్ని కార్యాలు చక్కబెడుతూ ఉంటుంది. ఆమె మనవడు గజపతి(మంచు మనోజ్) వరద(నారా రోహిత్) శ్రీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వారిని కూడా నాగరత్నమ్మ సమానంగా పెంచుతుంది. తర్వాత ఆమె చనిపోతుంది. దీంతో ఆ గుడిపై కన్నేస్తాడు నాగరాజు(అజయ్). అయితే ముగ్గురు స్నేహితులు అతనికి ఎదురెళ్తారు. వాళ్ళని ఏమీ చేయలేక సరైన సమయం కోసం నాగరాజు కనిపెడుతూ ఉంటాడు. ఇంతలో స్నేహితుల మధ్య మనస్పర్థలు వస్తాయి. అవి ఎంత వరకు వెళ్తాయి అంటే.. వరదని గజపతి చెంపేంత.. అలాగే గజపతిని శ్రీను చంపాల్సినంత.. రేంజ్ కు వెళ్తాయి. అసలు వీళ్ళ మధ్య చోటు చేసుకున్న మనస్పర్థలు ఏంటి? నాగరాజు ఎందుకు ఆ గుడిపై కన్నేశాడు? వంటి ప్రశ్నలకి సమాధానమే ‘భైరవం’ మిగిలిన సినిమా అని చెప్పాలి.
విశ్లేషణ :
‘భైరవం’ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గరుడన్’ కి రీమేక్. అది మంచి కథాబలం ఉన్న సినిమా. అందుకే తెలుగులో రీమేక్ చేయడానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ఆసక్తి చూపించారు. హరీష్ శంకర్ శిష్యుడు… ‘నాంది’ ‘ఉగ్రం’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడలని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. విజయ్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని ‘నాంది’ తో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అతని గురువు హరీష్ శంకర్ రీమేక్ సినిమాలు తీయడంలో ఆరితేరిన వాడు. కాబట్టి విజయ్ కి.. ‘భైరవం’ సేఫ్ మూవీ అని అంతా అనుకున్నారు. మరి వారి అంచనాలకి తగ్గట్టు ‘భైరవం’ ని విజయ్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దాడా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
ఒరిజినల్ తో పోలిస్తే.. ఇందులో చాలా మార్పులు చేశాడు. అవి వర్కౌట్ అవుతాయి అనుకున్నాడు. కానీ సోల్ మిస్ అయినట్టు అయ్యింది. ఇక్కడ నారా రోహిత్, మనోజ్ చేసిన పాత్రలు ఒరిజినల్లో రివర్స్ లో ఉంటాయి. తెలుగుకి వచ్చేసరికి ఈ మార్పు కొంత కథని డిస్టర్బ్ చేసినట్టు అయ్యింది. ఫస్ట్ హాఫ్ సాదా సీదాగా వెళ్తుంది. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి కొన్ని ట్విస్టులతో మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అవి కొంత వరకు ఓకే అనిపించినా పూర్తిగా వర్కౌట్ అయిన ఫీలింగ్ కలిగించవు. శ్రీ చరణ్ పాకాల ఫస్ట్ టైం ఒక మాస్ సినిమాకి పనిచేశాడు. అతని వరకు తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే.. మంచు మనోజ్ పాత్రకి ఎక్కువ మార్కులు పడతాయి. ఈ సినిమా తర్వాత కచ్చితంగా అతని ఇమేజ్ మారుతుంది. ఇలాంటి పాత్రలు అతనికి మరిన్ని వచ్చే అవకాశం ఉంది. నారా రోహిత్ కూడా ఒక హీరో అయినప్పటికీ సహాయనటుడిగా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అతని వరకు బాగానే చేశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర ఒరిజినల్ లో సూరి చేశాడు. అతనికి కమెడియన్ ఇమేజ్ ఉంది కాబట్టి.. అందులో అమాయకంగా చేసినా కన్వెన్సింగ్ గా అనిపించింది. కానీ ఇక్కడ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి యాక్షన్ ఇమేజ్ ఉంది. కాబట్టి.. అతన్ని అమాయకంగా చూడటానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. హీరోయిన్ అదితి శంకర్ కి మంచి పాత్ర దొరికింది. ఆనంది,దివ్య పిళ్ళై కూడా బాగానే చేశారు. జయసుధ, అజయ్ పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంది. కానీ వాటికి స్క్రీన్ స్పేస్ తక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. మిగతా నటీనటులు ఓకే.
ప్లస్ పాయింట్స్ :
ట్విస్టులు
మంచి కథ
క్యాస్టింగ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్
సోల్ మిస్ అవ్వడం
మొత్తంగా.. ‘భైరవం’ మంచి కథాబలం ఉన్న సినిమా. కానీ అనవసరమైన మార్పులు కథనాన్ని పక్కదోవ పట్టించి సినిమా ఫలితాన్ని మార్చేశాయి.
Bhairavam Telugu Movie Rating : 2/5