గతంలో భారత్-పాక్, భారత్-చైనా ఘర్షణలను కొన్ని సందర్భాల్లో రాజకీయ లాభం కోసం తీసుకున్న నిర్ణయాలుగా ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ ఆపరేషన్ సిందూర్ ని ఎవరూ వేలెత్తి చూపలేదు. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత రోజులు గడిచేకొద్దీ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేశాయంటే రాజకీయ కారణాలు ఉన్నాయనుకోవచ్చు. కానీ ఇక్కడ ఘాటు వ్యాఖ్యలు చేసింది ప్రతిపక్ష నేత కాదు. స్వయానా భారత వాయుసేన అధిపతి. ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వ తీరుని ఆయన పరోక్షంగా ఎండగట్టారు.
వాయుసేన అసంతృప్తి
రక్షణ రంగంలో ఆయుధాల సరఫరా, వాహనాల సరఫరా వంటివి కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగిస్తుంటాయి ప్రభుత్వాలు. కొన్నిసార్లు ప్రభుత్వమే నేరుగా తయారీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. అయితే ఆ ఒప్పందాలు సరైన సమయానికి అమలు కావడం లేదనేది ఇక్కడ ప్రధాన ఫిర్యాదు. రక్షణ రంగంలో ప్రధాన కాంట్రాక్టులన్నీ ఆలస్యం అవుతున్నాయంటూ వాయుసేన అధిపతి, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ ఒప్పందాల అమలు తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకాలు జరుగుతాయి కానీ, సరఫరాలు మాత్రం సమయానికి మొదలుకావని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు స్వయంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలోనే చేయడం ఇక్కడ మరో విశేషం.
వాగ్దానాలు దేనికి..?
భారత పరిశ్రమల సమాఖ్య ఢిల్లీలో నిర్వహించిన బిజినెస్ సమ్మిట్ లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా ఇతర సైనికాధికారులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లోనే ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు గుర్తున్నంత వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తికాలేదని అన్నారాయన. సరైన సమయంలో హామీలు పూర్తి చేయలనేప్పుడు వాగ్దానాలివ్వడం దేనికని ఆయన ప్రశ్నించారు.
ఉదాహరణలు ఇవే..
తేజస్-ఎంకే1 భారత రక్షణ రంగంలోకి రావడం చాలా ఆలస్యమైంది. తేజస్-ఎంకే2 ప్రొటోటైప్ ఈపాటికే అందుబాటులోకి రావాల్సి ఉన్నా అది ఇంకా సాధ్యం కాలేదు. ఐదోతరం యుద్ధ విమానం ‘ఆమ్కా’ కూడా బాగా ఆలస్యమవుతోంది. ఆయా కాంట్రాక్ట్ లు సకాలంలో అమలులోకి వస్తేనే మన సైనిక దళాలు మరింత శక్తిమంతం అవుతాయని అన్నారు అమర్ ప్రీత్ సింగ్. అది జరిగితేనే యుద్ధాల్లో గెలుస్తామని చెప్పారు.
వాయుసేన అధిపతి చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేరుగా స్పందించకపోయినా.. పరోక్షంగా బదులిచ్చారు. రక్షణరంగ పరికరాలు తయారుచేసే కంపెనీలకు, మన సాయుధ బలగాలకు మధ్య పరస్పర అవగాహన ఉండాలని చెప్పారు రాజ్ నాథ్ సింగ్. మేకిన్ ఇండియా ఉత్పత్తుల వాడకాన్ని పెంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
వాయుసేన అధిపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. రక్షణ రంగానికి బడ్జెట్ పెంచామని, అన్ని సౌకర్యాలు అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని మోదీ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా అని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ఆపరేషన సిందూర్ తర్వాత ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. సైన్యం వద్దకు వెళ్లి లెక్చర్లిచ్చారని.. ఇప్పుడు వారు సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చిందని నెటిజన్లు చురకలంటిస్తున్నారు.