Drinker Sai Movie Review : ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ లేవు. క్రిస్మస్ కి రెండు సినిమాలు వచ్చాయి. అవి ఆడట్లేదు. కొంచెం గ్యాప్ ఉండటంతో ఈరోజు ‘డ్రింకర్ సాయి’ అనే సినిమా వచ్చింది. దీనిని ప్రమోషన్స్ ని ఆడియన్స్ పట్టించుకోలేదు. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
సాయి (ధర్మ కాకాని) ఓ అనాధ. అలా అని అతనికి ఏ లోటూ ఉండదు. బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన వాడే. కానీ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల .. తాగుడికి బానిసైపోతాడు. రోజులో 20 గంటలు ఇతను తాగుతూనే ఉంటాడు.ఇతనికి మరో పని కూడా ఉండదు. అలాగే తాగేసి మిగిలిన వారితో గొడవలు పెట్టుకోవడం కూడా ఇతనికి అలవాటు. తాగి రచ్చ చేసిన ప్రతిసారి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం. తర్వాత ఇతని మావయ్య (శ్రీకాంత్ అయ్యంగార్) విడిపించడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు సాయి ఫుల్లుగా తాగి ఉన్న టైంలో.. యాక్సిడెంట్ కి గురవుతాడు. అతన్ని యాక్సిడెంట్ చేసింది డాక్టర్ భాగీ (ఐశ్వర్య శర్మ) అని సాయికి తెలుస్తుంది. దీంతో ఆమెతో గొడవపడటానికి వెళ్తాడు. కానీ భాగీని చూసిన తర్వాత ఆమె ప్రేమలో పడిపోతాడు. మరోపక్క భాగీ కూడా సాయిని లవ్ చేస్తున్నట్టు నటిస్తుంది. అది ఎందుకు? ఈ విషయం తెలిసి చివరికి సాయి ఏం చేశాడు? ఏం అయ్యాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ సినిమాని ‘మందు సిగరెట్లు తాగకండి పోరుతారు’ అనే లైన్ కోసం తీసాడేమో అనిపిస్తుంది. ఏదైనా పరిధి దాటితే ఫలితం తేడా కొడుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘మందు సిగరెట్లు తాగొద్దు.. పోతారు’ అనే మెసేజ్ ఇవ్వాలని కూడా అనుక్షణం పరితపించాడు దర్శకుడు. దీనికోసం 2 గంటల 28 నిమిషాలు టైం తీసుకున్నాడు. వాస్తవానికి ప్రేక్షకులు సినిమాకి వెళ్తే… ముందుగా ఈ యాడ్ వస్తుంది. అది పూర్తయ్యేవరకు ఫోన్లు చూసుకుంటూనో.. పక్కనోళ్ళతో కబుర్లు చెప్పుకుంటూనో ఆడియన్స్ కూర్చుంటారు. అంతేకాని ఆ యాడ్ ను చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించరు. మరి అలాంటి యాడ్ ను రెండున్నర గంటల పాటు చూడాలంటే.. ఎవరికి మాత్రం ఓపిక ఉంటుంది. సరే పోనీ దీని చుట్టూ అల్లుకున్న కథ ఏమైనా ఆసక్తిగా ఉంటుందా అంటే… అస్సలు ఉండదు. హీరో ప్రతి సీన్లోనూ మందు తాగుతూనే ఉంటాడు. అంతే కాదు ఒక మూర్ఖుడిలా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇటీవల వచ్చిన ‘బచ్చల మల్లి’ సినిమాలో హీరో కూడా చాలా వరకు ఇంతే.అల్లరి నరేష్ వంటి నటుడు ఉన్నప్పటికీ ఆ సినిమానే ఆడియన్స్ పట్టించుకోలేదు. మరి వెంటనే అలాంటి ‘డ్రింకర్ సాయి’ ని ఎలా పట్టించుకుంటారు? ఈ ఆలోచన కొంచెం చిత్ర బృందానికి ఉన్నా సినిమాని.. కొంచెం గ్యాప్ ఇచ్చి విడుదల చేసేవారేమో. అలా అని ఫలితం వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పలేం. కనీసం ఈ సినిమాకి వచ్చే విమర్శల్లో ‘బచ్చల మల్లి’ తో పోల్చి తిట్టడం తగ్గుతుంది అంతే..! సరే టెక్నికల్ టీం విషయానికి వస్తే.. శ్రీవసంత్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా వినడానికి ఒకే అనిపిస్తాయి. దానికి మించిన ప్లస్ పాయింట్ అయితే సినిమాలో ఏమీ లేదు.
నటీనటుల విషయానికి వస్తే.. ధర్మ కాకాని కొంచెం డాన్సులు బాగా చేశాడు. నటన విషాయంలో మెప్పించలేదు. ఐశ్వర్య శర్మ చూడటానికి బాగుంది. అంతే..! శ్రీకాంత్ అయ్యంగార్ కొత్తగా చేసింది ఏమీ లేదు. ఎస్.ఎస్.కాంచి,సమీర్ , పోసాని..వంటి తెలిసిన మొహాలు ఉన్నా.. వాళ్ళ పాత్రలు ఇంపాక్ట్-ఫుల్ గా లేవు.
ప్లస్ పాయింట్స్ :
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
మిగతావన్నీ
మొత్తంగా ‘మందు సిగరెట్టు’ మాత్రమే కాదు ‘డ్రింకర్ సాయి’ వంటి సినిమా వల్ల కూడా తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఖాయం. సో సింపుల్ గా స్కిప్ కొట్టేయొచ్చు.
Drinker Sai Movie Rating : 2/5