రివ్యూ : సర్జమీన్ మూవీ
ప్లాట్‌ఫామ్: JioHotstar (డైరెక్ట్ OTT రిలీజ్)
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్, జితేంద్ర జోషి, మిహిర్ అహూజా, బోమన్ ఇరానీ
దర్శకుడు: కయోజ్ ఇరానీ
నిర్మాణ సంస్థ: ధర్మా ప్రొడక్షన్స్ & స్టార్ స్టూడియోస్
Sarzameen Review in Telugu : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్, సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్జమీన్’. బోమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ డైరెక్ట్ గా జియో హాట్‌స్టార్‌లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈరోజే రిలీజ్ అయింది. మరి ఈ మూవీ అంచనాలను అందుకోగలిగిందా ? అనేది రివ్యూలో చూద్దాం.
కథ
సర్జమీన్ కాశ్మీర్ నేపథ్యంలో జరిగే ఎమోషనల్, పేట్రియాటిక్ థ్రిల్లర్. ఈ చిత్రం కర్నల్ విజయ్ మీనన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే భారత సైన్య అధికారి చుట్టూ తిరుగుతుంది. ఆయన కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. దానికోసం తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడు. విజయ్ కొడుకు హర్మన్ (ఇబ్రహీం అలీ ఖాన్) speech impediment సమస్య ఉండడంతో… సిగ్గుపడుతూ, నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. అదే విజయ్‌కు అతన్ని బలహీనుడిగా కనిపించేలా చేస్తుంది. విజయ్ భార్య మెహర్ (కాజోల్) తన భర్త, కొడుకు మధ్య సమస్యలను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక రోజు, హర్మన్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. బదులుగా ఇద్దరు ఉగ్రవాదులను విడుదల చేయమని డిమాండ్ చేస్తారు. కానీ విజయ్ తన దేశభక్తి కారణంగా ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? చనిపోయాడు అనుకున్న కొడుకు ఎలా తిరిగి వచ్చాడు? ఆతను టెర్రరిస్టుగా మారాడా ? అతనికి నత్తి ఎలా పోయింది? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
దర్శకుడు కయోజ్ దేశభక్తికి ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించి, ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకున్నారు. కానీ మొదటి సినిమా కావడం వల్ల ఆయన తడబడ్డారు. ఫస్టాఫ్ పర్లేదు అనిపించినా… సెకండాఫ్, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు నెమ్మదిగా సాగుతాయి. క్లైమాక్స్ తో పాటు కొన్ని సీన్స్ లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే కష్టం అనుకుంటే డబ్బింగ్ కూడా చిరాకు పెడుతుంది.
సౌమిల్ శుక్లా, అరుణ్ సింగ్ రాసిన కథ, స్క్రీన్ ప్లే విచిత్రంగా భావోద్వేగాలకు తావు లేకుండా ఉంది. స్క్రీన్ ప్లే ఎమోషన్స్ ను రేకెత్తించడంలో విఫలమైనప్పటికీ, విశాల్ ఖురానా కె సంగీతం, కౌసర్ మునీర్ సాహిత్యం బాగున్నాయి. ఆజ్ తుక్ జా పాటను శ్రేయ ఘోషల్, సోను నిగమ్, మోహిత్ చౌహాన్ మూడు విభిన్న రీడిషన్లలో పాడగా, ఇది ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవసరమా? అనే అనుమానం కలుగుతుంది.
కాశ్మీర్ లోయ అద్భుతమైన దృశ్యాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. హిమాలయ పర్వతాలు, గడ్డి మైదానాలు, అందమైన ఆకాశం… వంటి విజువల్స్ ఆహ్లాద పరుస్తాయి. DOP రాత్రి/పగలు సీన్స్ ను అద్భుతంగా బంధించాడు. ఎడిటింగ్ బాగుంది. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. కానీ ఇబ్రహీం అలీ ఖాన్ ఎమోషన్స్ సరిగ్గా పండించలేకపోయాడు.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
సినిమాటోగ్రఫీ
విజువల్స్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
సెకండాఫ్
క్లైమాక్స్
మొత్తానికి
‘సర్జమీన్’ పేట్రియాటిక్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే వారికి సింగిల్-టైమ్ వాచ్.
Sarzameen Rating : 1.75/5