రివ్యూ : మహావతార్ నరసింహా మూవీ
విడుదల తేదీ : జూలై 25
దర్శకుడు: అశ్విన్ కుమార్
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్ & క్లీమ్ ప్రొడక్షన్స్
వాయిస్ కాస్ట్: ప్రహ్లాద (సంతోష్), హిరణ్యకశిపు (శరత్ కుమార్), నరసింహా (విష్ణు అవతారం)
Mahavatar Narsimha Review in Telugu : ప్రస్తుతం థియేటర్లలో ఎక్కడ చూసినా ‘హరిహర వీరమల్లు’ సందడే కన్పిస్తోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు పోటీగా మూవీని రిలీజ్ చేసే సాహసం ఏ హీరో చెయ్యడు. పవర్ స్టార్ కు ఉన్న స్టార్మ్ అలాంటిది మరి. కానీ ఆశ్చర్యంగా ఓ యానిమేటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’కు ఒకరోజు గ్యాప్ తో థియేటర్లలోకి దిగింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో మొదటి చిత్రం ‘మహావతార్ నరసింహా’. ఈ యానిమేషన్ చిత్రం విష్ణు పురాణం, నరసింహ పురాణం, శ్రీమద్ భాగవత పురాణం ఆధారంగా రూపొందింది. 2 గంటల 21 నిమిషాల రన్ టైంతో కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో, 2D, 3D వెర్షన్లలో ఈ మైథలాజికల్ మూవీ రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ పవన్ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ
కథ విష్ణుమూర్తి భక్తుడైన ప్రహ్లాదుడు, అతని తండ్రి, రాక్షస రాజు హిరణ్యకశిపు మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. హిరణ్యకశిపుడు తపస్సుతో బ్రహ్మ దేవుని మెప్పించి, తనకు చావే లేకుండా ఒక వరం పొందుతాడు. ఆ తరువాత తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, ప్రపంచాన్ని ఏలాలని అనుకుంటాడు. కానీ విష్ణుమూర్తిని శత్రువుగా భావిస్తాడు. అయితే అతని వారసుడు ప్రహ్లాదుడు మాత్రం, తన తండ్రి ఆదేశాలను ధిక్కరిస్తూ విష్ణుమూర్తి భక్తిలో మునిగిపోతాడు. చివరకు, విష్ణుమూర్తి తన ఉగ్రమైన నరసింహా అవతారంలో ఆవిర్భవించి, హిరణ్యకశిపుని సంహరించి, ధర్మాన్ని నెలకొల్పుతాడు. ఈ కథ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఎవర్ గ్రీన్ తెలుగు మూవీ ‘భక్త ప్రహ్లాద’ ఇదే స్టోరీతో రూపొందింది. కానీ యానిమేటెడ్ వర్షన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ
‘మహావతార్ నరసింహా’ భారతీయ యానిమేషన్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో హిందూ పురాణాలను గౌరవప్రదంగా చిత్రీకరించారు. అదే సమయంలో ఆధునిక సాంకేతికతతో ఈ తరం యంగ్ ఆడియన్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేశారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రంతో భారతీయ సంస్కృతిని గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేసే దిశగా ఒక అడుగు వేయడం అభినందనీయం.
3D ఫార్మాట్‌లో నరసింహా ఆవిర్భావ సన్నివేశం, యుద్ధ దృశ్యాలు, దైవిక నేపథ్యం అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. ప్రాచీన భారతీయ ఆలయాలు, రాజ భవనాలు, పౌరాణిక వాతావరణం సినిమాలో అద్భుతంగా ఉంది. కలర్ మిక్సింగ్, లైటింగ్ టెక్నిక్స్ సీన్స్ కు డెప్త్ తో పాటు భావోద్వేగ బలాన్ని జోడించాయి. హోంబలే ఫిల్మ్స్ KGF, కాంతారా వంటి చిత్రాలతో సాధించిన విజువల్ గ్రాండియర్‌ను ఈ యానిమేషన్‌లోనూ కొనసాగించింది. తన తండ్రి హిరణ్యకశిపుతో ప్రహ్లాదుడి సంఘర్షణ, అతని అచంచలమైన విష్ణు భక్తి అన్ని వయసుల ప్రేక్షకులను ఆకర్షిస్తాయి.
సామ్ సిఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్, యాక్షన్ సీన్స్ కు బలాన్ని చేకూర్చింది. నరసింహా ఆవిర్భావ సన్నివేశంలో సంగీతం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. వాయిస్ ఓవర్… ముఖ్యంగా హిరణ్యకశిపుగా శరత్ కుమార్, ప్రహ్లాదుడిగా సంతోష్ వాయిస్ ఓవర్ బాగుంది. అయితే హాలీవుడ్ స్థాయి చిత్రాలతో పోలిస్తే, యానిమేషన్ క్వాలిటీ కొంత వెనుకబడి ఉంది. కొన్ని సన్నివేశాలలో పాత్రల ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, లిప్ సింక్ మ్యాచ్ కాకపోవడం వంటి చిన్న చిన్న లోపాలు కనిపించాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఊహించినంత డైనమిక్‌గా లేవు. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా హిరణ్యకశిపు బ్యాక్‌స్టోరీ, ప్రహ్లాదుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కొంత లాగినట్లు అనిపిస్తాయి. కొన్ని సీన్స్ పాటలు అతిగా అన్పిస్తాయి. ఇక హిరణ్యకశిపు సైన్యం లేదా ఇతర దేవతలు గురించి కథలో పూర్తిగా లేకపోవడం అన్నది కొంత లోటుగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
క్లైమాక్స్
ఎమోషనల్ సీన్స్
విజువల్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
యానిమేషన్ క్వాలిటీ (లిప్ సింక్, ఎక్స్పెషన్స్)
మొత్తానికి
యానిమేషన్, యాక్షన్ జానర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు… ముఖ్యంగా పిల్లలకు ఈ వీకెండ్ మూవీ సెట్టు.
Mahavatar Narsimha Rating : 2/5